కురిసే మబ్బును ఒడిసి పట్టుకోవాలంటే.. ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాల్సిందే!

డోల్నీ మొరావా.. ఇప్పుడో కొత్త బంగారులోకం!

అదో మానవ నిర్మిత అద్భుతం… అసలే అదెత్తంటే.. అంతకన్నా ఎత్తు నుంచి ఏరియల్ షాట్ లో చూసినా.. లేక లోషాట్ లో దాన్ని కెమెరాల్లో బంధించినా.. అదో అద్భుతమైన దృశ్యకావ్యం. అదే చెక్ రిపబ్లిక్ లో నూతనంగా నిర్మించిన పాదచారుల సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్.

ఎత్తైన పర్వతమెక్కడమంటే.. ఎవరో ట్రైక్కింగ్ చేసేవాళ్లకు తప్ప… సామాన్యులకో ప్రహసనం. అలాంటిది ఒక ఎత్తైన పర్వతం పైనుంచి సమాంతరంగా ఉండే మరో ఎత్తైన పర్వతంపైకి అలా సులభంగా ఎర్రతివాచీ పర్చినట్టు రాజసంగా నడుచుకుంటూ వెళ్లడమంటే మామూలు మాటా..? కానీ చెక్ రిపబ్లిక్ దాన్ని నిజం చేసింది. అలా రెండు కొండలను ఓ బ్రిడ్జ్ తో కలిపేసింది. ఇప్పుడీ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనగా.. ఒక్కమాటలో స్కైబ్రిడ్జ్ గా ఓ వండర్ ఫుల్ స్పాట్.

ఈ బ్రిడ్జ్ పై ఇప్పటికే నడిచిన పలువురు బ్లాగర్స్ వాళ్ల ఇన్ స్టా, ఎఫ్బీ, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఫోటోలతో పాటే… అక్కడ వారు పొందిన అనుభూతిని షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. దీంతో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నుంచి రెండున్నర గంటల్లో వెళ్లగల్గే డోల్నీ మొరావా పర్యాటక ప్రాంతానికి ప్రపంచ పర్యాటక ప్రేమికులిప్పుడు క్యూ కడుతున్నారు.

థ్రిల్ కోరుకునేవారికి డోల్నీ మొరావా వెకేషన్ రిసార్ట్ ఓ ప్రకృతి ఆస్వాదనా కేంద్రం. కాగా, ఇప్పుడీ బ్రిడ్జ్ కూడా రెండు ఎత్తైన పర్వతాలను కలుపుతూ ఆకట్టుకుంటుండగా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ గా కూడా ఇప్పుడందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేశారు. 721-మీటర్ల పొడవు అంటే 2,365 అడుగులు కాగా.. ఈ బ్రిడ్జ్ ని మే 13, 2022న ప్రారంభించారు. దీని పేరిప్పుడు స్కై బ్రిడ్జ్ 721 అని నామకరణం చేశారు. మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా అని తెలుగు సినిమా పాటలో చెప్పినట్టుగా.. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ పైనుంచి రెండు ఎత్తైన కొండల నడుమ.. ప్రపంచంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ పైన… కింద లోతైన లోయలు, అందులో అడవులను చూస్తూ… మబ్బులను ముద్దాడుతుంటే కచ్చితంగా నవరాగం పలకుతున్న అనుభూతి కల్గుతోందని ఇప్పటికే పలువుర బ్లాగర్స్ చెబుతున్న మాట. అయితే ఎత్తైన బ్రిడ్జ్ పై నుంచి నడుస్తున్నప్పుడు కొంత భయపడేవాళ్లకు మాత్రం ఆందోళన కూడా అదే స్థాయిలో కల్గే అవకాశమూ ఉంటుందంటున్నారు అక్కడ పర్యటించినవారు.

సాధారణంగా కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే కాస్తా ఊగుతూ ఉండటం కూడా పర్యాటకులకు ఓవైపు అనుభూతినిస్తూనే… ఇంకొంత టెన్షన్ నూ క్రియేట్ చేసే అవకాశముంటుంది. కానీ, ఛాలెంజింగ్ గా కట్టిన ఈ బ్రిడ్జ్ పై అలాంటి భయపడాల్సిన అవసరమేమీలేదని చెబుతున్నారు ఇక్కడికొచ్చే పర్యాటకులు.

సముద్రమట్టానికి పదకొండు వందల పదహారు మీటర్ల ఎత్తులో ఉన్న కొండ భాగంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్.. ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. నేపాల్‌ గండకీ ప్రావిన్స్‌లోని బగ్లుంగ్ పర్బత్ ఫుట్‌బ్రిడ్జ్ కంటే 154 మీటర్లు ఎక్కువ పొడవుండటంతో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ గా ఈ వంతెనకు పేరు . లోయ కింద భాగం నుంచి 95 మీటర్ల ఎత్తులో… ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో వేలాడే ఈ బ్రిడ్జ్ పై ప్రయాణించడానికి ప్రత్యేకంగా కేబుల్ కార్లతో పాటు.. వాకర్స్ కోసం ప్రత్యేక మార్గం కూడా ఏర్పాటు చేశారు. అయితే వీల్ చైర్స్ ఫుష్ చైర్స్ లో వచ్చేవారికి మాత్రం ఈ బ్రిడ్జ్ పై ప్రయాణం అంత అనువైంది కాదంటున్నారు.

పోలాండ్ సరిహద్దుల్లో.. అందమైన ప్రకృతి పారవశ్యంలో.. వీడియో గేమ్స్ ను తలపిస్తుంది ఈ బ్రిడ్జ్. ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆల్పైన్ రోలర్ కోస్టర్ కు సమీపంలో… స్కైవాక్ పర్వతశిఖరాలపై ఉన్న రెస్టారెంట్స్ కు దగ్గరలో.. వంపువంపులుగా సాగే ఈ డోల్నీ మొరవా స్కైబ్రిడ్డ్.. ఇప్పుడు పర్యాటకుల కలల కేంద్రం

అయితే పర్యాటకులు డోల్నీ మొరావా బ్రిడ్జ్ పైకెళ్లి ఓ కొత్తలోకంలో విహారించాలన్నా.. అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలన్నా.. డోల్నీ మొరావా వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్కై బ్రిడ్జ్ 721 టిక్కెట్‌లను.. 350 చెక్ కొరునా అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 1 వెయ్యి 140 రూపాయలకు టిక్కెట్ ని ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రపంచం మొత్తం చుట్టి రావాలని ఎప్పటికప్పుడు పర్యటించేవారికి ఇప్పుడు డోర్నీ మొరావా స్కైబ్రిడ్జ్ 721 మరో కొత్త బంగారులోకం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles