అమ్మ చదివితే విని.. సివిల్స్ సాధించాడు: ఓ అంధుడి అసాధారణ ప్రయాణమిది!

లీలావతి గర్భంలో ఉన్నప్పుడే విష్ణుతత్వాన్ని ఆసాంతం లోపలే గ్రహించిన భక్తప్రహ్లాదుడంత నాటకీయత లేదుగానీ.. వేదవ్యాసుడు చెబుతూ పోతే ఎకసంథాగ్రాహిలా భారతం రాసిన గణపతిలాంటి కథ ఇది. అమ్మ బోధనతో అక్షర జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కలియుగ యువకుడి కథ ఇది. బీహార్ కు చెందిన రవిరాజ్ యూపీఎస్సీ ప్రయాణం.. ఒక సాధారణ యువకుడి అసాధారణ విజయం.

అవును.. అమ్మ బిగ్గరగా చదివింది… ఆ యువకుడు వినికిడితో గ్రహించి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించి తక్కిన లోకానికి తన ఎబిలీటీ ఏంటో నిరూపించాడు విజువల్లీ ఛాలెంజ్డ్ రవిరాజ్.

రవిరాజ్ బీహార్ లోని నవాడా జిల్లాలో మహూలి అనే ఓ కుగ్రామానికి చెందినవాడు. చిన్నప్పట్నుంచే దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. తండ్రి ఓ రైతు. చిన్నప్పట్నుంచి తండ్రి పొట్టకూటి కోసం పొలం పనులకెళ్తే.. తల్లి బిడ్డణ్ని చదివించేందుకు తన గొంతెత్తి బిగ్గరగా చదువుతూ అర్థం చేయించేది. అదే ఇప్పుడు సివిల్స్ సాధించేవరకూ ఆమె కొనసాగించింది. ఆ తల్లి విభాసిన్హా కలను రవిరాజ్ యూపీఎస్సీలో 20వ ర్యాంక్ సాధించి నిజం చేశాడు. దేశవ్యాప్తంగా సివిల్స్ ఫలితాలు ప్రకటించగానే సర్వత్రా ఆకట్టుుకున్న పేరు రవిరాజ్. పుట్టు గుడ్డివాడైన రవిరాజ్ ఇవాళ సివిల్స్ ప్రిపేర్ కావాలనుకునేవాళ్లెందరికో ప్రేరణగా నిలుస్తున్నాడు.

రవిరాజ్ విజయం వెనుక ఏళ్ల తరబడి పట్టుదల, కృషి ఉన్నాయి. గత ప్రయత్నంలో సివిల్స్ లో 182వ ర్యాంక్ సాధించిన రవిరాజ్.. ఆ ర్యాంకుతో సరిపెట్టుకోకుండా మళ్లీ యత్నించి, 20వ ర్యాంక్ కొట్టాడు.

ఎలాంటి లోపాల్లేకుండా ఆరోగ్యంగా ఉండేవారిలా రవిరాజ్ చదువుకోలేడు. అయినా, ఆడియో లెక్చర్స్, డిజిటల్ ఫ్లాట్ఫామ్ లెర్నింగ్ టూల్స్ పై ఆధారపడి సివిల్స్ వంటి కఠిన పరీక్షకు సిద్ధమయ్యాడు.

చాలామంది ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పుడు వనరులు సరిగ్గా లేవనే ఒకింత అసంతృప్తి ఎక్కడో కనిపిస్తుంది. కానీ, రవిరాజ్ సివిల్స్ ప్రయాణం చూసినప్పుడు మాత్రం వనరులను మించి.. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కోవచ్చనిపిస్తుంది.

182 నుంచి 20వ ర్యాంక్ వరకు పట్టుదలతో అడుగులు!

ఆల్ ఇండియా 182వ ర్యాంక్ అంటే సివిల్స్ లో మాటలేం కాదు. చాలామంది దీంతో సరిపెట్టుకుంటారు. కానీ, రవిరాజ్ కు మాత్రం ఈ ర్యాంక్ నచ్చలేదు. మళ్లీ ప్రయత్నం చేసేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. పుస్తకాలున్నా చదవలేని విజువల్లీ ఛాలెంజ్డ్ స్థితిలో ఆడియో లెక్చర్లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. డిజిటల్ ఆడియో క్లాసులే రవిరాజ్ కు తరగతి గదులుగా మారిపోయాయి. అనుకున్నట్టే రవిరాజ్ కృషికి తగ్గ ఫలితం వచ్చింది. ఆల్ ఇండియా 20వ ర్యాంక్.. అంటే, సివిల్స్ లో వావ్ అని లోకమంతా చప్పట్లు చరిచే విజయాన్ని అందుకున్నాడు. ఓర్పుతో, క్రమశిక్షణగా చదివుతూ నిరంతర కృషి చేస్తే ఎవరైనా విజయం సాధించవచ్చని నిరూపించేందుకు ఓ బెంచ్ మార్క్ అయ్యాడు.

తల్లే బలమైన తోడు!

రవి విజయంలో అమ్మదే కీలకపాత్ర. దృష్టి లోపంతో చదవలేకపోతున్న రవికి అన్నీ అమ్మే అయ్యింది. చివరకు పత్రికలు, పుస్తకాలు, నోట్స్ అన్నింటికీ గంటల సమయాన్ని కొడుకు కోసమే వెచ్చించి, గొంతెత్తి బిగ్గరగా చదివి వినిపించేది. మనం చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ గా కనిపించే ఈ ఫార్మాట్… రవి ఇంట్లో ఓ నిత్య అధ్యయన విధానంగా మారిపోయింది. పేజీ తర్వాత పేజీ.. పాఠం తర్వాత పాఠం అర్థమయ్యేవరకూ తల్లి చదువుతుంటే.. వింటూ, అర్థం కాని చోట రిపీట్ చేయించుకుంటూ మొత్తంగా తమ ఇంటి పరిసరాలనే ఓ విద్యానిలయంలా మార్చేశారు రవిరాజ్, తన తల్లి విభాసిన్హా.

రవి తండ్రి రంజన్ కుమార్ సిన్హా ఓ రైతు. దిగువ మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితులే అయినప్పటికీ.. కుమారుడి చదువు విషయంలో మాత్రం పూర్తి మద్దతునిచ్చాడు. కొడుకు పట్టుదల చూసి ముచ్చట పడి ఎంత కష్టమైనా తను చదువుతానన్నట్టుగా చదివిస్తూ వచ్చాడు.

యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు అలా వెల్లడయ్యాయో, లేదో… బీహార్ లోని మహూలిలో రవిరాజ్ కుటుంబంలోనే కాదు.. చిన్నప్పట్నుంచీ అంధుడిగా చూస్తూ వచ్చిన ఆ గ్రామంలో ఆ యువకుడి అసాధారణ విజయం అందరినీ ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ఈ విజయం కేవలం రవిదే కాదు… ప్రతీ కష్టసమయంలో రవి వెంట నిల్చిన కుటుంబానిది. సివిల్స్ కు రవి ప్రిపేర్ అవుతున్నాడా.. తానా అన్నట్టుగా రవికి ప్రతీది అర్థం చేయించిన తల్లి విభాసిన్హాది. ఎంత కష్టమైనా కొడుకు చదువు కోసం డబ్బు వెచ్చించి మద్దతిచ్చిన నాన్న రంజన్ కుమార్ సిన్హాది.

రవిరాజ్ గతంలోనే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. కానీ, యూపీఎస్సీలో ఎలాగైనా ఉత్తమ ర్యాంక్ సాధించాలన్న తన కల మాత్రం మారలేదు. అందుకే, దాన్ని సాధించేవరకూ నిద్రపోని విక్రమార్కుడిగా ఇప్పుడు వార్తల్లోకెక్కాడు రవిరాజ్.

ఏదైనా కళ్లతో చూస్తేనేగానీ నమ్మలేని లోకంలో, నేటి రోజుల్లో.. ఆ కళ్లే తన జీవితానికి ప్రధాన అవరోధంగా మారాయి. అయినా, తన మనోఫలకంతో దుర్బిణీ వేసి అనుకున్నది సాధించుకున్న మొనగాడు రవిరాజ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles