సామాజిక అంశాలన్నీ తెరపై పర్చాలన్న తపన తప్ప.. ఫోకస్డ్ నెరేషన్ ఏది..?

ఫోకస్డ్ నెరేటివ్ కనిపించని సుబేదార్!

చాలాకాలం తర్వాత అనిల్ కపూర్ ఫుల్ ప్లెడ్జ్డ్ హీరో పాత్రలో వచ్చిన సినిమా సుబేదార్. ఆ ఆసక్తితోనే సినిమా చూస్తే సీరియస్ పాత్రలో అనిల్ నటన వరకు ఓకే. కానీ, సినిమా సబ్జెక్ట్ మాత్రం ఆబ్జెక్టివ్ గా ఒక అంశానికి పరిమితం కాకపోవడం.. వీక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది.

ఓ చిన్న పట్టణంలో సామాజిక సమస్యగా మారిన ఇసుక మాఫియా… ఆ తర్వాత ఆర్మీలో సుబేదార్ గా రిటైర్డైన అనిల్ కపూర్ వ్యక్తిగత సమస్యగా మారి ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నదే సినిమా థీమ్.

అయితే కామెడీనా, లేక లవ్ ఓరియెంటెడా… కాకపోతే, భావోద్వేగ బంధాలు, పాత్రల చుట్టూ తిప్పడమా.. అదీ కాకపోతే పూర్తిగా మ్యూజికల్ హిట్టా ఇలా ఏదో ఒక రూపంలో సినిమా గుర్తుండిపోవాలి. కానీ, ఎన్నో ఆలోచలనల సమాహారాన్ని మొత్తం తీసుకొచ్చి కుప్పుకు కుప్ప ప్రేక్షకుడి ముందు గుప్పిస్తే.. చివరకు అందులో అసలు ఏ పాయింట్ ను ఎలివేట్ చేయాలనుకున్నారనేది సినిమా మొత్తం చూసినా కూడా అర్థం కాని పరిస్థితి సుబేదార్ లో గమనిస్తాం.

కథనం సాగిన తీరు!

ఇసుకాసురులతో పోరాడుతున్న ఓ చిన్న పట్టణం. ఆ ఊళ్లోకి రిటైర్డై వచ్చి దేశానికి సేవ చేసిన ఒకింత గర్వంతో కనిపించే ఓ దేశభక్తుడు, ఇంకోవైపు భార్యను కోల్పోయి, కుటుంబంతో గడపలేకపోతున్న ఓ సామాన్యుడైన అర్జున్ మౌర్య అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి అనిల్ కపూర్. ఇంకోవైపు, ఇసుకమాఫియాలో క్రూరత్వానికి కేరాఫ్ లా కనిపించే సైకిక్ ప్రిన్స్ పాత్రలో ఆదిత్యారావల్.. అతడికి సవతి అక్క, మరింత క్రూరురాలైన బాబ్లీ దీదీ పాత్రలో మోనాసింగ్ అనే ఇసుక మాఫియా నాయకురాలు. వీళ్ల పాత్రలతో పాటు.. తన తల్లి చనిపోతున్నప్పుడు కూడా ఫోన్ లో స్పందిచలేదని తండ్రి అనిల్ కపూర్ ను అపార్థం చేసుకునే కూతురు శ్యామ మౌర్య… ఈ ప్రధాన పాత్రలకు ఇంకొన్ని లింకులు పెట్టి సినిమా కథను నడిపించారు.

రిటైర్డ్ ఆర్మీ అధికారైన అర్జున్ మౌర్య, విలన్ ప్రిన్స్ ఇద్దరూ ఢీ అంటే ఢీ అనే ఘర్షణే సినిమా అంతా పర్చేశాడు దర్శకుడు. అనిల్ కపూర్ హీరోయిక్ ఎలివేషన్లలో భాగంగా బలంగా కొట్టే పంచులు తప్ప.. సినిమాలో కదిలించే సన్నివేశాలేవీ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.

ఒక సెంట్రిక్ పాయింట్ మీద ఫోకస్డ్ గా తీయకపోవడం వల్ల సినిమా పెద్దగా రిజిస్టర్ అవ్వదు. సినిమాలో ఎక్కువపాళ్లు ఘర్షణ సన్నివేశాలే కనిపిస్తే.. మిగిలిన ఎపిసోడ్ లోనైనా ఫోకస్డ్ గా ఒక్క పాయింట్ పైన సినిమా నడవదు. ఒకటొకటిగా శ్యామా మౌర్యకో లవ్ స్టోరీ.. ఆమెను వెంటాడే విలన్ ఒకడు.. ఇలా సినిమా మోటో ఏంటో అర్థం కాకుండా తీయడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు.

ఎందుకంటే, ఇసుక మాఫియా సమస్యను ప్రస్తావిద్దామని ప్రారంభించిన సినిమాలో… అధికారముంటే సాధారణ ప్రజలను ఎలా అవమానిస్తారు, హింసలకు గురిచేస్తారో చెప్పడంతో పాటే.. కళాశాలలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, టీజీంగ్ వంటి మల్టీపుల్ ఇష్యూస్ ను ఇరికించి ఏం చెప్పాలనుకున్నాడో దర్శకుడే గందరగోళంలో పడిపోయాడు.

దర్శకుడు ఎంచుకున్నవన్నీ ప్రధాన సమస్యలే కావచ్చు. కానీ, ఒకదానిపై నుంచి మరొకటి ఓవర్ ల్యాప్ అవ్వడంతో ఏదీ సరిగ్గా గుర్తుంచుకోలేడు ప్రేక్షకుడు.

మధ్య మధ్యలో వెబ్ సీరీస్ తరహాలో దర్, ఘావ్ అనే ఉపశీర్షికలను కూడా తెరపై వేస్తూ ఒక్కో అధ్యాయాన్నీ ముందుకు తీసుకెళ్లాలనుకున్నా ఆ సబ్ క్యాప్షన్స్ అన్నీనూ నాటకీయ పద్ధతిలోనే కనిపిస్తాయి. సినిమాలో హస్యం శూన్యం. ఒక్కోసారి సీరియస్ గా నడుస్తున్న సినిమాలో ఓ చిన్న కామెడీ పండినా సినిమాకు బలమే. కానీ, అదీ కనిపించలేదు.

అయితే నటీనటులు మాత్రం సినిమాకు బలంగా నిల్చారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో తీవ్రతను పట్టిచూపడంలో వృద్ధ సైనికుడిగా అనిల్ కపూర్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కనిపించే బలం. అలాగే, యంగ్ విలన్ క్యారెక్టర్ ప్రిన్స్ పాత్రలో ఆదిత్యా రావల్ అహంకారాన్ని బాగా ప్రదర్శించాడు. రాధిక మదన్ కూడా శ్యామ మౌర్య పాత్రకు న్యాయం చేసింది. అలాగే మోనాసింగ్ బాబ్లీ దీదీ పాత్రతో పాటు.. సౌరభ్ శుక్లా, ఫైజల్ మాలిక్ కూడా తమ పాత్రల పోషణలో తమ వంతు చేసిన కృషి కనిపిస్తుంది.

మొత్తంగా దర్శకుడి సురేష్ త్రివేణి తీసిన సుబేదార్.. పరిపరి విధాల ఆలోచనలను తెరపై ఒకేసారి పర్చేయాలనుకున్న ఆత్రుత, కక్కుర్తిని ప్రేక్షకుడి ముందుంచుతుంది. చూడమని రికమండ్ చేసేంత గొప్ప సినిమా ఏం కాదు. జస్ట్ టైంపాస్ కోసమనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles