900కు పైగా మార్బుల్ నిర్మిత ఆలయాలున్న కొండ అది. కానీ, సూర్యాస్తమయం తర్వాత అక్కడినుంచి అంతా వెళ్లిపోవాల్సిందే.
ఎందరికో శాంతి, స్వస్థత, ఆత్మపరిశీలనకు సెంటిమెంట్ గా మారిన ఆ కొండ.. గుజరాత్ లో ఉంది. భావ్ నగర్ జిల్లాలోని పాలితానా… అందమైన ప్రకృతి మధ్యలో నిశ్శబ్దంగా కనిపించే ఓ చిన్న పట్టణం. ఈ పట్టణం వెనుక భాగంలో కనిపించేదే శత్రుంజయ పర్వతం. శత్రువులను జయించేందుకు ఉపయోగించిన కొండ కాబట్టే.. శత్రుంజయ పర్వతమని పేరు వచ్చిందన్నది చరిత్ర చెప్పే మాట.

సిటీ ఆఫ్ టెంపుల్స్!
ప్రకృతి సిద్ధంగా కనిపించే శత్రుంజయ కొండపైన 900కు పైగా చిన్న చిన్న ఆలయాలను మార్బుల్స్ తో నిర్మించారు. అందమైన కళాకృతులతో చెక్కారు. వీటిలో కొన్ని ఆలయాలు తెల్లని మార్బుల్ తో నిర్మితం కాగా.. ఆ ధవళ సూర్యకాంతికి ధగధగా మెరిసిపోతాయి. అందుకే పాలితానాకు సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పేరు.
జైన క్షేత్రం!
ముఖ్యంగా జైన మతస్థులకు పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటిగా ఈ ప్రాంతం ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే మిగిలిన క్షేత్రాలతో ప్రత్యేకంగా నిలబెట్టగల్గే ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది. అదే సూర్యాస్తమయం తర్వాత ఈ కొండపై ఎవ్వరినీ అనుమతించకపోవడం. సూర్యాస్తమయమనంతరం పూజార్లు, భక్తులు ఎవ్వరైనా కొండ దిగిపోవాల్సిందే. ఆ తర్వాత రోజు ఉదయం వరకూ కూడా ఈ శత్రుంజయ కొండ నిశ్శబ్దమైపోతుంది. శతాబ్దాలుగా ఈ ఆనవాయితీ, సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అందుకే, దీనికి నిశ్శబ్ద క్షేత్రమనీ పేరు.
ఎందుకు ఈ నియమం..?
శత్రుంజయ పర్వతం జైనులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. జైనమతంలోని 24 తీర్థంకరుల్లో 23 మంది ఇక్కడే జ్ఞానోదయం పొందారని విశ్వాసం. ఇక్కడ నిర్మించిన ప్రతీ ఆలయం తీర్థంకరులు, జైనుల ఆధ్యాత్మిక గురువులకు అంకితం చేయబడ్డాయి. ఈ దేవాలయ సముదాయాన్ని దేవతల నివాసంగా భావిస్తారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదనే నియమాన్ని పెట్టారంటారు. ప్రపంచంలోనే స్థిరనివాసానికి యోగ్యం కాని ఒకే ఒక్క ఆధ్యాత్మిక పర్వత క్షేత్రంగా పాలితానాకు పేరు.

శత్రుంజయ పర్వతానికి ఎలా వెళ్లాలి..?
ఈ కొండ శిఖరాన్ని చేరుకోవడం సాహసమేం కాకున్నా.. ఒక సహన యాత్రలాంటిదే. సుమారు 3 వేల 800 మెట్లు ఎక్కితేనేగానీ ఈ కొండకు చేరుకోలేం. భక్తుల భక్తికి, ఆధ్యాత్మికతకు, ఓపికకు పరీక్ష పెడుతుంది ఈ పర్వతం ఎత్తు.
సూర్యోదయానికి ముందే యాత్ర ప్రారంభిస్తారు. ఎందుకంటే, పైకి చేరుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి. మార్గమధ్యంలో విశ్రాంతి కోసం ఏర్పాట్లుతో పాటు, తాగునీటి సౌకర్యాలు, కాస్సేపు సేదదీరేలా ప్రకృతి వీక్షణ స్థలాలుంటాయి. ఎక్కలేని యాత్రీకులు, భక్తులకు డోలీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మబ్బుల్లో మెరిసిపోయే పాలరాతి ఆలయాలు ఇక్కడ ఒక అమోఘమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి.
పాలితానాలోని ముఖ్యమైన ఆకర్షణలేంటి..?
జైనమతపు మొదటి తీర్థంకరుడు ఆదినాథుడిగా పిల్చుకునే రుషభనాథుడికి అంకితమిచ్చిన పవిత్రమైన దేవాలయం ఇక్కడ ఉంది. అలాగే, పాలితానా శత్రుంజయ కొండ అందాలను ద్విగుణీకృతం చేసేలాంటి శిల్పకళా వైభవంతో.. ప్రతి దిశలోనూ దైవజ్ఞానం వ్యాపిస్తోందా అన్న భావనను కల్గించేలా నిర్మించిన చౌముఖ ఆలయం మరో ప్రత్యేకత. మధ్యయుగ జైన శిల్పకళకు ఓ అద్భుత ఉదాహరణలా కనిపించే విమల్ షా దేవాలయంలో శిల్పకారుల ఫినిషింగ్ టచెస్ అలరిస్తాయి. అలాగే తొమ్మిది క్లస్టర్స్ గా చిన్న ఆలయాలు, ధ్యానమందిరాలు, ప్రాంగణాలు చూడముచ్చటగా కనిపిస్తాయి.
ఏ సమయంలో సందర్శనకు బాగుంటుంది..?
అక్టోబర్ నుంచి మార్చ్ వరకు పాలితానా సందర్శనకు అనుకూలమైన సమయం. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండి, కొండపైకెక్కడం సులభమైతుంది. ఉదయం సమయంలోనే వెళ్లడం మరింత ఉత్తమం.
పాలితానాకు ఎలా వెళ్లొచ్చు..?
విమానమార్గంలోనైతే భావ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని… 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలితానాకు బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో పోవచ్చు. ఇక రోడ్డు మార్గంలో అటు అహ్మదాబాద్ నుంచి కూడా బస్సులు, ట్యాక్సీలు నడుస్తుంటాయి.
ఆధ్యాత్మికతతో పోటీపడే ప్రకృతి సౌందర్య క్షేత్రం!
పాలితానా ఆలయాల సమూహంగానే కాదు.. ప్రకృతి కూడా విశ్రాంతి తీసుకునే ఓ నిశ్శబ్దమైన కొండ ప్రాంతం. ఇక్కడకొచ్చే భక్తుల్లో, యాత్రీకుల్లో క్రమశిక్షణ, ఒక హుందాతనం కనిపిస్తాయి. ఇక్కడ నిబంధనలూ అలాగే ఉంటాయి. రీల్స్ తీయడం, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడానికి అనుమతి ఉండదు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధం. అంతేకాదు, లెదర్ వస్తువులనూ ఇక్కడ అనుమతించరు.
ఇక్కడ విశ్వాసాలు కాలాన్ని శాసిస్తున్నాయి. ఇక్కడి నిశ్శబ్దం కూడా పవిత్రతకు ప్రతీకలా కనిపిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ నిద్రపోని ఓ పునీత పర్వతం పాలితానా శత్రుంజయ కొండ.



