సంపాదించాలనే తపన ఉండాలేగానీ.. ఐడియాలు మస్త్ అంటున్నాడు ఈ ముంబై ఆటోడ్రైవర్. పైగా ఆటో నడపం ఆపేశాడు. పోనీ, ఏదైనా ఓలానో, ఊబర్ వంటి సంస్థలు తన ఆటోను హైర్ చేసుకుని నడిపిస్తున్నదీ కాదు. కానీ, ఆ ఆటోడ్రైవర్ సంపాదన మాత్రం ఇప్పుడు నెలకు 5 నుంచి 8 లక్షల మధ్య ఉంటోందట. ఇప్పుడీ స్టోరీ లింక్డ్ ఇన్ లో తెగ వైరలై మిగిలిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ చక్కర్లు కొడుతోంది.

వాస్తవంగా ఇప్పుడీ ఆటోడ్రైవర్ సంపాదిస్తున్న డబ్బు చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్, ఐటీ నిపుణులు సంపాదిస్తున్నదానికంటే కూడా ఎక్కువ ఉండటమే ఇతగాడి స్టోరీ వైరల్ కావడానికి కారణం.
సదరు ఆటోడ్రైవర్ కథను లెన్స్ కార్ట్ వ్యవస్థాపకుడైన రాహూల్ రూపానీ తన లింక్డ్ ఇన్ అకౌంట్ లో షే చేశారు.
ఇంతకీ ఆటోడ్రైవర్ చేస్తున్నదేంటని అంత డబ్బంటారా..?
ముంబైలోని యూఎస్ కాన్సులేట్ కు నిత్యం వందలు, వేలమంది వీసా అపాయింట్మెంట్ పర్పస్ లో వస్తూ, పోతూ ఉంటారు. భద్రతా ప్రోటోకాల్ దృష్ట్యా కాన్సులేట్ ప్రాంగణంలోకి వచ్చే సందర్శకులు బ్యాగ్స్ గానీ, ఎలక్ట్రానిక్ వస్తువులనుగానీ తీసుకెళ్లడాన్ని అనుమతించరు. ఈ సమస్యను గుర్తించిన ఆటో డ్రైవర్ ఇక తనకు ఆటో నడిపే అవసరం లేదనీ అంతకుమించి గుర్తించాడు. కానీ, ఆటో మాత్రం తన వెంటే ఉంటుంది. కాన్సులేట్ బయట తన ఆటో పెట్టుకుని… వచ్చి, పోయేవారి బ్యాగ్స్ ను, ఇతర సామాన్లను లోపలికి తీసుకెళ్లడం నిషేధం ఉన్న నేపథ్యంలో తన ఆటోలో పెట్టి వెళ్లమంటాడు. మళ్లీ వాళ్లు తమ పని ముగించుకుని వచ్చేటప్పుడు వారి సామాన్లను భద్రంగా అప్పజెప్పుతాడు. ఇలా ఒక్కో కస్టమర్ దగ్గర అవి భద్రంగా వారు వచ్చేవరకూ పెట్టుకుని తిరిగి భద్రంగా అప్పజెప్పినందుకు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇలా యూఎస్ కాన్సులేట్ ను అడ్డాగా చేసుకుని తన ఆటో నడపకుండానే.. సామాన్లు భద్రపర్చే స్థలంగా మార్చేసి రోజుకు ఒక 20 నుంచి 30 సామాన్లను భద్రపర్చి.. 20 నుంచి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే నెలకు యావరేజ్ గా 5 నుంచి 8 లక్షల డబ్బును జస్ట్ ఆటోను ఉన్నచోటే పెట్టుకుని ఎలాంటి డీజిల్, పెట్రోల్ ఖర్చుల్లేకుండా.. ఎక్కడికీ తిరిగి అలసిసొలసి పోకుండా… ఉన్నచోటే ఈ ఆటోడ్రైవర్ సంపాదిస్తున్న తీరు యూఎస్ కాన్సులేట్ కు వచ్చే కార్పోరేట్ శక్తులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అందజుకే ఈ కథను రాహూల్ రూపానీ షేర్ చేశారు.
మరి ఆటో స్టాండ్ లో ఆటో పెట్టుకున్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ వస్తే వెళ్లాల్సి వస్తుంది కదా అంటే.. అది పెద్ద గిరాకీ అయితే సదరు డ్రైవర్ దాన్నీ మిస్ చేసుకోడు. అందుకోసం, దగ్గరే ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో పాట్నర్షిప్ మెయింటెయిన్ చేస్తున్నాడు. సదరు పోలీస్ ఆఫీసర్ కు లాకర్ స్పేస్ ఉండటంతో.. తాను ఎటైనా వెళ్లితే ఆ సామాన్లన్నింటినీ ఆ ఆఫీసర్ లాకర్ లో పెట్టి వెళ్లి మళ్లీ వచ్చేస్తాడు. దాంతో తాను ఆటోరైడింగ్ కు వెళ్లినా ఎలాంటి సమస్య రాకుండా ముందే ప్లాన్ చేసుకున్నాడు.
నమ్మకాన్ని చూరగొని, అంతకుమించిన భద్రతను కల్పిస్తున్నాడు గనుకే.. ప్రీమియం ఛార్జెస్ వసూలు చేస్తున్నాడు సదరు డ్రైవర్. కాబట్టి ఇప్పుడు ముంబై యూఎస్ కాన్సులేట్ వద్ద సదరు డ్రైవర్ చేస్తున్న బిజినెస్ ఎందరికో ఓ మాస్టర్ క్లాస్ గా అభివర్ణిస్తూ రాహూల్ రూపానీ ఈ స్టోరీని షేర్ చేశారు.
ఎలాంటి మాస్టర్ డిగ్రీలక్కర్లేకుండా, ఎలాంటి యాప్స్, టెక్నాలజీ వంటివేవీ అవసరమే లేకుండా, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎలాంటి అనవసరమైన హడావిడి లేకుండా.. సదరు డ్రైవర్ చేస్తున్న బిజినెస్ ను ఇదీ అసలైన వ్యాపారమంటే అంటూ కొనియాడాడు రాహూల్ రూపానీ. ఈ కథకు అదే స్థాయిలో ఆన్ లైన్ లో స్పందన కనిపిస్తుండగా.. ఆవిష్కరణలు సూట్ బూట్లతోనే రావు.. అవి యూనిఫామ్ వేసుకున్నవాళ్ల నుంచీ పుట్టుకురావచ్చు.. రాయబార కార్యాలయాల బయట ఆవిష్కరించబడవచ్చంటూ భిన్నమైన స్పందనలతో ఆ ముంబై డ్రైవర్ బిజినెస్ అప్లాజ్ అందుకుంటోంది.



