76 ఏళ్ల బాలకృష్ణ అయ్య… ఇప్పుడు గోవా రాక్ స్టార్!

అక్కడ బావిని తవ్వడం అసాధ్యమన్నారంతా. కానీ, ఆ రాక్ స్టార్… ఆ రాక్ నే తొలగించి తన కమ్యూనిటీకి నీరందించాడు. ఇది గోవాలోని లోలియం నివాసైన 76 ఏళ్ల బాలకృష్ణ అయ్య కథ.

మద్ది తొలోప్ అంటే కొంకణిలో రాతిప్రాంతమని అర్థం. ఆ ప్రాంతమందా నీరు లేక దుర్భిక్షంగా మారిపోయిన ఒక కరవు పరిస్థితినెదుర్కొంది. ఎందరో నిపుణులు వచ్చి అక్కడి భూభాగంలో నీరు రాదని తేల్చేశారు. ఎందుకంటే, పైనంతా రాతి పొర, ఆ తర్వాత బంకమట్టి, మళ్లీ దాని పొరల కింద నల్లరాయి.. అలా భౌగోళిక సవాళ్ల మధ్య ఆ ఊళ్లో ఆ కమ్యూనిటీకి ఇక నీరు అందని ద్రాక్షేనని కుండబద్ధలు కొట్టేశారు.

కానీ, 76 ఏళ్ల బాలకృష్ణకు మాత్రం ఆ రాళ్ల కింద కూడా నీళ్లున్నాయన్న బలమైన నమ్మకముండేది. కానీ, ఆ లోతుల్లోకి వెళ్లి తవ్వుతున్నప్పుడు ఆ బండరాళ్ల కింద పడి ఎలాంటి ప్రమాదమైన జరిగే అవకాశముంది. పైగా బయటకు వచ్చే అవకాశాలూ తక్కువే. ఆ క్రమంలో నేల పొరల నుంచి తవ్వడం ప్రారంభించాక.. ఆ బంకమట్టి వచ్చేవరకూ తవ్వుతూ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తనతో పాటు పనిచేస్తున్న కార్మికులకూ అవసరమైతే తప్పించుకునేలా.. తమను ఇంకెవరైనా కాపాడేందుకు అవకాశముండేలా ఒక పక్కా ప్రణాళిక, డిజైనింగ్ తో తవ్వకాలు చేపట్టాడు. మొత్తంగా బండల కింది బంకమట్టిని దాటి.. ఆ కింద ఉన్న రాళ్లనూ పగులగొట్టి ఆ గంగమ్మను ఒడిసిపట్టాడు.

చివరాఖరకు, ఏ జియోలజిస్టులు, ఇతర నిపుణులంతా నీరే రాదని తేల్చేశారో ఆ ప్రాంతంలో… తన టినీ కమ్యూనిటీకి నీరందించేలా బావిని తయారు చేశాడు. ఆ బావిని తానే స్వయంగా కష్టపడి తవ్వినందుకు తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా.. చుట్టుపక్కల తన కమ్యూనిటీ అందరికీ పైప్ లైన్స్ వేసి నీరందిస్తున్నాడు.

రోబోటిక్ బోర్స్ వంటి యంత్రాలతో పనిచేస్తూ కూడా ఆరువందల ఫీట్లకో, వెయ్యి అడుగులకో నీళ్లు పడకపోతే.. ఇక లాభం లేదనుకునేవాళ్లు కనిపించే కాలంలో.. ఎందరో నిపుణులు అసాధ్యమన్న పనిని సాధించి నివ్వెరపర్చాడు బాలకృష్ణ అయ్య.

అయ్యా ఇప్పుడక్కడ ఓ నూతన ఆవిష్కర్త. వాస్తవానికి గణేష్ ఐడల్స్, చీపుర్ల తయారీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే బాలకృష్ణ అయ్యా.. ఇప్పుడా తన కమ్యూనిటీలోనే కాకుండా గోవా మొత్తంలోనే అసంభావన్ని సంభవంగా మార్చిన హీరో అయ్యాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బాలకృష్ణ భగీరథ ప్రయత్నానికి.. గోవా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ నుంచి కళాగౌరవ్ పురస్కారం కూడా వరించింది.

తాను అక్కడి భూమిని అధ్యయనం చేశానని.. ఎలాగైనా నీరు తీసుకురాగలననే నమ్మకమే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందంటాడు బాలకృష్ణ.

స్వయానా డ్రాయింగ్ మాస్టర్ అయిన బాలకృష్ణ ఓ 17 ఏళ్లు స్థానిక పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేశాడు. బతుకుదెరువు కోసం డ్రాయింగ్ టీచర్లను స్కూల్స్ లో నియమించుకుంటున్నారని తెలిసి డ్రాయింగ్ కోర్సును అభ్యసించి ఆ జాబ్ సాధించాడు. అయితే, కొంతకాలానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బాలకృష్ణ అయ్య.. తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి తన కళకు మరింత సాన పెట్టి విగ్రహాల తయారీ మొదలుపెట్టాడు.

అంతేకాదు, బాలకృష్ణ తయారుచేసే చీపుర్లకు కూడా గోవాలోని కెనకోనా ప్రాంతంలో మంచి డిమాండ్ కనిపిస్తుంది. కత్తి ఆకారంలో కనిపించే ఆ చీపుర్ల డిజైనింగ్ బాలకృష్ణ తయారీ ప్రత్యేకత. చీపుర్ల తయారీలోనూ బాలకృష్ణ ప్రయోగాలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత బైండింగ్ లో టెక్నిక్ తో తాను తయారుచేసిన చీపురు ప్రతీ ఇంటిలోనూ ఇప్పుడు దర్శనమిస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ చీపురు ఒక్కోటి 250 నుంచి 300 రూపాయల వరకూ అమ్ముడుపోతున్నాయి.

తన చేతివృత్తులను నల్గురు నేటి యువతకు నేర్పాలన్నదే ఇప్పుడు బాలకృష్ణ అయ్య అభిలాష. జ్ఞానం మీతోనే అంతరిస్తే దానివల్ల ప్రయోజనమేంటని అడుగుతున్న అయ్య.. ఇప్పుడు గోవా సంద్రతీరంలో మంచినీటికి గోస పడుతున్న లోలియం గ్రామంలో ఓ అపర భగీరథుడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles