టూరిస్ట్ ఫ్యామిలీ – ఓ కుటుంబ కథ కాదు… ఓ ప్రపంచ గాథ
……………………………………………………………………………………..
రఘు మందాటి… ✍🏼
ఈ రోజుల్లో మనం చూస్తున్నది చందమామ కధల్లాంటి కథలు కావు.
వాస్తవ జీవితాలు, వలసలు, బతుకు కోసం పోరాటాలు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మొదట చూసినప్పుడు ఇది ఒక చిన్న కథలా అనిపించొచ్చు.
కానీ గమనిస్తే ఇది ప్రపంచం నడుస్తున్న మార్గం గురించి చెప్పే గొప్ప వాస్తవం.
బతుకు దూరదేశంలో మొదలయ్యే ప్రతి మనిషికీ ఇది సొంత కథ. శ్రీలంక నుంచి ఒక కుటుంబం అక్రమంగా భారతదేశానికి వస్తుంది. వాళ్లు చట్ట ప్రకారం తప్పు చేశారు. కాని వాళ్లు బతికే ప్రయత్నం చేశారు.

ఈ రోజుల్లో అటువంటి కుటుంబాలే ఎన్నో దేశాల్లో ఉన్నాయి.
గాజాలో, ఉక్రెయిన్‌లో, సిరియాలో, రోహింగ్యాల మధ్య…
తమ పిల్లల కోసం, ఒక గుడిసె కోసం, ఓ భద్రత కోసం
వాళ్లు ప్రాణాలను పణంగా పెట్టి దేశాలు దాటి వస్తున్నారు. వాళ్ల కథలే ఈ సినిమా రూపంలో మనముందుకొస్తుంది.
ప్రపంచం యుద్ధాలు చేస్తోంది… కుటుంబాలు ఊచలు మోస్తున్నాయి.
ఒక మనిషి వెనక ఒక సమూహం నడుస్తోందంటే,
ఆ మనిషి దగ్గర డబ్బు లేకపోయినా, పవర్ లేకపోయినా,
ఆ మనిషికి గొప్ప మనసు ఉండాలి.
టూరిస్ట్ ఫ్యామిలీ లైన్ ఇదే.
ఒకవైపు రాజకీయ నాయకులు సరిహద్దులు గీసుకుంటుంటే, ఇంకోవైపు తల్లి చేతిలో పసిబిడ్డ, పక్కలో బ్యాగ్, చెంతలో ఏడుస్తున్న భవిష్యత్తుతో ఎక్కడికైనా ప్రయాణిస్తోందే.
ఈ సినిమా మనకు ఏం గుర్తుచేస్తుంది – ఓ కుటుంబం బతకాలనే ఆశతో దేశం విడిచినప్పుడు, మన బాధ్యత వారిని పరిగణలోకి తీసుకోవడం.
ఈ సినిమా ఎక్కడా హడావిడి చెయ్యలేదు..
అసలు సందేశం నెమ్మదిగా, ప్రేమగా ఒక మాట చెప్తుంది.
మనమంతా ఒక్కటే. మనకు మనమే అండగా ఉండాలి.
అక్కడ వాళ్లు ఒక కాలనీలో చేరారు, పని చేశారు, మంచితనంతో ముందుకెళ్లారు. ఆ కుటుంబం పక్కవాళ్ల మనసుల్లో చోటు సంపాదించుకుంది.
ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రతి శరణార్థి కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ఇక్కడ ప్రశ్న మనదే. మనం వాళ్లను చూస్తున్న దృష్టి ఏంటి? వాళ్లని భయంతో చూస్తున్నామా? లేదా మన కుటుంబాన్ని చూసినట్టు మనసుతో చూస్తున్నామా?
“No one leaves home unless home is the mouth of a shark.” – Warsan Shire
ఈ ప్రపంచంలో ఎవరూ తమ ఇంటిని వదిలి రావడం ఇష్టం ఉండదు. కానీ పరిస్థితులు వదిలిపెట్టవు.
అలాంటి వారికోసం మనం ఒక భద్రత, ఓ ఆశగా మారాలే తప్ప, భయంగా మారిపోవద్దు.
టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి చిత్రాలు మన దృష్టిని మార్చేస్తాయి. మనం చూసే కోణం మారుతుంది.
మనుషుల్ని మతాలుగా, ప్రాంతాలుగా కాకుండా
మనుషుల్లాగే చూడాలన్న గుర్తు చేస్తాయి.
“Where you see a refugee, I see a survivor.”
మనమే ఈ కథలో పాత్రలు. ఈ సినిమా ఒక కుటుంబ కథ కాదు. మనిషిగా ఉండటానికి మనం నేర్చుకోవలసిన పాఠం. ప్రేమతో, సహనంతో, గౌరవంతో
వాళ్ల కథను మన కథగా చూడగలిగితే
ఈ ప్రపంచం నిజంగా మారుతుంది.
ఈ సినీమా కథ కంటే ఎక్కువ.
ఒక సందేశం.
ఒక గులాబీ.
ఒక ఆశ.
ఒక తెల్లని పావురాయి.
ఎప్పటికైనా ఈ ప్రపంచం అడ్డుకుంటున్న గోడలను కూలదీసి, ఒక కుటుంబంలా ముందుకెళ్లే రోజు కోసం ఈ సినిమా అవసరం.
ఈ సినిమా కేవలం కళ కాదు. అది ఒక మానవతా పిలుపు.
“The world is my country, all mankind are my brethren, and to do good is my religion.” – Thomas Paine
ఈ సినిమా చూస్తున్నంతసేపూ మనం మన దేశాన్ని కాక,
మన హృదయాన్ని ఒక దేశంగా మార్చుకుంటాం.
మనుషుల్ని ప్రాంతాలుగా విభజించే ఈ కాలంలో, మనుషుల్ని మానవత్వంతో కలిపే సినిమా ఇది.
సింపుల్ కథ, గొప్ప పాత్రలు, సహజ నటన, కంటిని తడిపే కొన్ని మౌన సన్నివేశాలు.. హాస్యం కూడా హద్దును దాటకుండా, మనం నవ్వుకునేలా చెయ్యడం ఈ దర్శకుని ప్రత్యేకత.
ఎవరో ఒక తెలుగు రైటర్ చెప్పినట్లు
సినిమాలో ప్రేక్షకుడు expect చేసిందే ఉండాలి, కానీ అది expect చేయని టైంలో రావాలి.
అది పకడ్బందీగా రాసుకున్నాడు అభిషన్ జీవింత్.
అతని కథ, రచన, దర్శకత్వం… ఒక్కటే చెబుతుంది.
మనిషిగా ఉండే నైపుణ్యం గలవాడవ్వాలి, నటన కాదు… నిష్కళంకమైన మనసు కావాలి.
“People are not illegal. Actions are.” – Elie Wiesel
వారు పాస్‌పోర్ట్ లేకుండా వచ్చారు.
కానీ ప్రేమతో, శ్రమతో, మనస్సుతో తమకంటూ ఒక ఊరిని నిర్మించుకున్నారు.
ఎక్కడైనా స్వేచ్ఛగా బతకాలని కోరుకునే హక్కు మనిషికి ఉంది.
మనసు కలిసిన చోటే దేశమవుతుంది. ప్రేమ మొదలైన చోటే దేవాలయమవుతుంది..
.
.
.
.
రఘు మందాటి



