జయాపజయాలు మానవ జీవనంలో సర్వసాధారణం. అపజయం కృంగదీస్తే మనిషి పతనం అంచులను చూస్తాడు. అదే అపజయం నుంచి ఎగిసిపడితే.. మనిషి విజయతీరాల్ని ముద్దాడుతాడు. ఇవాళ దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒక్కటిగా పేరొందిన యశ్ రాజ్ ఫిల్మ్స్… దాని యజమానైన నిర్మాత, దర్శకుడు యశ్ చోప్రా వెనుక అలాంటి ఆటుపోట్లున్నాయి. లవ్ ఎమోషనల్ మూవీస్ కు కేరాఫ్ లా నిల్చిన యశ్ చోప్రాను.. అప్పటివరకూ తాను తీసిన సినిమాలకు భిన్నంగా ఓ ప్రేమకథనెంచుకోవడమే.. ఆయన జీవితానికి కలిసొచ్చింది. ఇవాళ యశ్ రాజ్ ఫిలిమ్స్ ను.. దేశంలోనే ఓ భారీ నిర్మాణ సంస్థగా నిల్పింది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇక షట్ డౌన్ చేయడమే అనుకున్నారంతా. దీవార్, కాలాపత్తర్, త్రిశూల్ వంటి భారీ యాక్షన్ డ్రామాలతో పాటు.. కభీ కభీ, సిల్ సిలా వంటి లవ్ స్టోరీస్ ను అందించిన సంస్థ.. దివాళా దిశలో ఎందుకు పయనించింది..?
ఒక దాని వెనుక మరో వైఫల్యంతో ఢీలా పడ్డ యశ్!
యశ్ చోప్రా దర్శకుడిగా సినిమాలు తీస్తూ హిట్స్ సాధిస్తున్న తరుణంలోనే 80వ దశకంలో తానే నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ క్రమంలో సంజీవ్ కపూర్, శశికపూర్, రణధీర్ కపూర్, వహీదా రెహమాన్, పూనమ్ థిల్లాన్ వంటివారితో… రమేష్ తల్వార్ దర్శకత్వంలో సవాల్ అనే సినిమా తీశాడు. అదే విధంగా మరో మల్టీస్టారర్ నఖుడాను… రాజ్ కిరణ్, కులభూషణ్ కర్బంధా, స్వరూప్ సంపత్, భరత్ పూరీ, మదన్ కపూర్ వంటివారితో.. దిలీప్ నాయక్ డైరెక్షన్ లో తను నిర్మాతగా తెరకెక్కించాడు. అంతేకాదు, అదే సమయంలో విజయ్ అనే మరో మల్టీస్టారర్ సినిమాను రాజేష్ ఖన్నా, రిషీకపూర్, అనిల్ కపూర్, హేమమాలిని, మీనాక్షీ శేషాద్రి వంటివారితో తన డైరెక్షన్ లోనే తెరకెక్కించిన సినిమాతో పాటు.. సునీల్ దత్, రేఖతో తీసిన ఫాస్లే… సంజీవ్ కుమార్, అమితాబ్, శశికపూర్, రేఖ, జయబాదురితో తీసిన సిల్ సిలా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో యశ్ చోప్రా పనైపోయిందనే టాక్ బాలీవుడ్ లో బయల్దేరింది. ఇక ఆయనతో సినిమా తీస్తే… అందులో నటించేవారి పని కూడా ఐపోయినట్టేనంటూ రూమర్స్ విస్తరించాయి.
పట్టువదలని విక్రమార్కుడిలా.. మళ్లీ లవ్ మూవీతోనే హిట్ కొట్టిన యశ్ చోప్రా!

ఐదు సినిమాలు వరుస ఫ్లాఫ్స్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి తననెవ్వరూ పట్టించుకోని స్థితి… ఉన్న డబ్బంతా పోయింది.. అప్పు చేస్తే కూడా పుట్టని పరిస్థితుల్లో ఓ డేర్ స్టెప్ అయితే వేశాడు యశ్ చోప్రా. అలా చాందినీ అనే ఓ హార్డ్ కోర్ లవ్ స్టోరీని సినిమాగా తెరకెక్కించేందుకు కసరత్తు మొదలెట్టాడు. ముందుగా రేఖను హీరోయిన్ గా నటించాలంటూ ఆఫర్ చేశాడు. కానీ, రేఖ తిరస్కరించింది. అదే సమయంలో యశ్ చోప్రాకు రేఖనే.. శ్రీదేవి పేరును సూచించింది. అలా చాందినీ లీడ్ రోల్ లో శ్రీదేవిని ఒప్పించిన యశ్ చోప్రా.. ఎలాగోలా తిప్పలు పడి అప్పుడే మంచి బూమ్ లో ఉన్న రిషీకపూర్ తో పాటు.. వినోద్ ఖన్నా, వహీదా రెహమాన్ ను ఒప్పించాడు. మన తెలుగు ప్రముఖ సినీ నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ పేరిట నిర్మించిన చాందినీ చిత్రానికి ఓ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మొత్తంగా కష్టపడి చాందినీ పూర్తి చేశాడు.
కానీ, అప్పటికే ఫ్లాప్స్ వెంటాడుతున్న యశ్ చోప్రా చాందినీ సినిమాను విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదు. అలాగే, అప్పటికే యాక్షన్ సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ లో… 11 పాటలతో సుదీర్ఘంగా చాందినీ రిలీజ్ చేయడానికి విముఖత ఏర్పడింది. అలా, పంపిణీదారుల్లో మౌత్ టాక్ గా మారి వ్యాపించడంతో.. సినిమా విడుదలకు యశ్ చోప్రా అష్టకష్టాలూ పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు పట్టువదలని విక్రమార్కుడిలా యశ్ చోప్రా తన చాందినీని సినిమా థియేటర్లలో విడుదయ్యేలా చేశాడు. ఇంకేం.. ఆ తర్వాత చాందినీ బంపర్ హిట్టైంది. అప్పటివరకూ మూసధోరణిలో సాగుతున్న యాక్షన్ చిత్రాల పరంపరకు.. చాందినీ గండికొట్టింది. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అప్పటివరకూ యశ్ చోప్రా అంటేనే దూరం జరిగినవారంతా మళ్లీ.. ఆయనకు దగ్గరయ్యారు.
ఇక చాందినీ తర్వాత యశ్ చోప్రా రొమాంటిక్ సినిమాలన్నీ హిట్టే!
ప్రేమ సినిమాల అద్భుతమైన ఫిల్మోగ్రఫీకి కేరాఫ్ గా నిల్చిన యశ్ చోప్రా… చాందినీ హిట్ తర్వాత తీసిన డర్ ఓ వెర్సటైల్ బ్లాక్ బస్టర్. ఇక దిల్ వాలే దుల్హనియా లేజాయింగే అయితే… షోలేతో పోటీపడి ముంబాయి మరాఠా మందిర్ లో నడించింది. అంతెందుకు హైదరాబాద్ లోని నాటి మహేశ్వరీ, పరమేశ్వరీ థియేటర్స్ లో షారూఖ్, కాజోల్ కాంబినేషన్ లో వచ్చిన డీడీఎల్జే… ఉర్రూతలూగించింది. ఇక దిల్ తో పాగల్ హై… మళ్లీ డీడీఎల్జేను తలపించేలా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అలా మొహాబ్బతే, ధూమ్, వీర్ జారా, జబ్ తక్ హై జాన్ వంటి అనేక సినిమాలను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా.. యశ్ చోప్రా మరణానంతరం ఆయన కుమారుడు.. డీడీఎల్జే డైరెక్టర్ ఆదిత్యచోప్రా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3 వంటి పలు భారీ సినిమాలతో ఇప్పటికీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ను భారీ నిర్మాణసంస్థగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా యశ్ రాజ్ ఫిల్స్మ్ సినిమా అంటే ఇప్పుడో క్రేజ్ ఏర్పడటం వెనుక.. యశ్ చోప్రా పట్టుదల, ధైర్యంతో పాటు.. అపజయం ఎదురైనప్పుడు కృంగిపోకుండా ముందడుగేసిన మొండితనం ఆయన్ను గెలిపించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ను నిలబెట్టింది.



