అది ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ ప్రభావిత బస్తర్ దండకారణ్యం… ఎన్నికల కమిషన్ కు అక్కడ ఎన్నికల నిర్వహణ.. ఎప్పుడూ ఓ పీడ కలలా మారే సవాల్. అక్కడికి హీరో వెళ్లి.. ఎలా సక్సెస్ ఫుల్ గా ఆ ప్రక్రియ పూర్తి చేశాడన్నదే న్యూటన్.

తన పేరు నూతన్ కుమార్ అని పెట్టుకోవడాన్ని ఎగతాళి చేసే సమాజాన్ని చూసి… తనకు తాను న్యూటన్ గా మార్చుకున్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిది ఈ సినిమాలో కీలకపాత్ర . ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వాలు, మావోయిస్టుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో.. దండకారణ్యంలో అడవిబిడ్డల అభివృద్ధి ఏపాటిదో కళ్ళకు కడుతూ.. బ్లాక్ కామెడీ చిత్రంగా తీర్చిదిద్దాడు… దర్శకుడు అమిత్ వి. మసూర్కర్. ఒకింత వ్యంగ్యాన్ని జొప్పించిన ఈ సినిమా రూపకల్పన.. ఒక్కమాటలో ఓ మంచి సబ్జెక్ట్ పై.. ఓ అద్భుతమైన అంటెంప్ట్.
పదిలక్షల వరకట్నం, ఓ బండి ఇస్తామన్నా.. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని ఓ ప్రగతిశీల మధ్య తరగతి యువకుడు న్యూటన్. ప్రభుత్వ గుమాస్తాగా (ఓ క్లారికల్ జాబ్) పనిచేస్తున్న న్యూటన్… ఎన్నికల కమిషన్ కు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణనేది ఓ సవాల్ గా మారిన మావోయిస్ట్ దండకారణ్యంలో ఆ బాధ్యతను భుజాన వేసుకుని వెళ్లడం… అక్కడ ఆత్మాసింగ్ అనే కాస్త ఇగోయిస్టిక్ కమాండింగ్ ఆఫీసర్ పాత్రలో పంకజ్ త్రిపాఠీతో న్యూటన్ (రాజ్ కుమార్ రావు) కు పరిచయం, ఆ తర్వాత సాగే జర్నీ… అక్కడి రకరకాల పరిస్థితులను సజీవంగా కళ్లకు కట్టారు. మావోయిస్టులను చూపించాల్సిన అవసరం లేకుండానే.. హింసా సన్నివేశాలుంటేనే మావోయిస్టులు వర్సెస్ సర్కారు మధ్య తీవ్రతను పట్టిచూపించొచ్చు అనుకోకుండా.. అందుకు పూర్తి భిన్నంగా ఆ దండకారణ్య వాతావరణంతో ఓ సింబాలిక్ ఫీల్ క్రియేట్ చేశాడు దర్శకుడు.
ఎన్నికలధికారి దండకారణ్యంలో ఎన్నికల నిర్వహణ గురించి చెబుతున్నప్పుడు.. ఒకవేళ అనివార్య కారణాలవల్ల ఎన్నికలు జరక్కపోతే.. మావోయిస్టులు పదే పదే అడ్డుకుంటే ఏంచేసేది అనే ప్రశ్నలు కిందిస్థాయి సిబ్బంది నుంచి రెయిజ్ అయితాయి. దానికి అధికారి మళ్లీ నిర్వహించడమేనని చెబుతాడు. అయినా మళ్లీ అదే ప్రశ్న వేసిన న్యూటన్ ను వూ ఆర్ యూ అని అడుగుతాడు. న్యూటన్ అంటాడు. న్యూటన్…? వాహ్.. అని ఒకింత వెటకారంగా చూస్తాడు ఆ అధికారి. ఆ తర్వాత మళ్లీ న్యూటన్ ఆ అధికారిని హోటల్ లో కలిసినప్పుడు న్యూటన్ పేరు పెట్టుకున్నావ్ కదా… ఇంతకీ న్యూటన్ ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలనుకున్నాడన్నప్పుడు.. సాధారణంగానే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని జవాబుగా చెప్పబోతాడు న్యూటన్. అరే.. యార్.. న్యూటన్ పేరు పెట్టుకుని దునియా మొత్తం తిరుగుతున్నావ్… భూమీ, ఆకాశం ఎప్పటికీ ఒక్కటి కావు.. ఆకర్షించుకోవు.. గుళ్లో పద్ధతులు గుళ్లోవే… చర్చ్ లో ఆచరణ చర్చ్ లోదే తప్ప అవి ఎన్నడూ ఒకటికావు. కానీ న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ధనికుడైనా, పేదవాడైనా కాలుతున్న కట్టే చచ్చేనాడు కావలంటూ శ్మశాన వైరాగ్యానికీ.. న్యూటన్ గురుత్వాకర్షణకూ.. ఈ సమాజంతో ముడిపెట్టి ఓ ఫిలాసఫికల్ థియరీ చెప్తాడు న్యూటన్ తో సదరు అధికారి.
మొత్తం మీద బస్తర్ అటవీప్రాంతంలో మరొకరి డ్యూటీ తనకు పడటంతో.. దండకారణ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం న్యూటన్ బయల్దేరడం… అక్కడి ప్రాంతీయ భాష తెలిసిన మాల్కో పాత్రలో అంజలి పాటిల్ పరిచయం.. ఆ తర్వాత ఆత్మాసింగ్ తో ఓవైపు సమన్వయం.. ఇంకోవైపు వైరుధ్యం… వంటివాటిని నటులంతా పోటీపడి జీవిస్తారు.
అయితే ఆ దండకారణ్యంలోని 76 ఓట్లు మాత్రమే ఉన్న ఆ గ్రామంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా ఎందుకు తయారైంది..? అదేదో కేవలం మావోయిస్టులు దాడులు చేస్తారనే భయానికే పరిమితం కాదు. ఆ అడవిబిడ్డల అభంశుభం ఎరుగని అనాగరిక జీవనం! అక్కడ వాళ్లకు అసలు పోలింగ్ ఏంటి… ఏ ఏ పార్టీలు బరిలో ఉన్నాయి… అసలు పాలన అంటే ఏంటి… ఎవరెవరు పోటీలో ఉన్నారు… ఎవరికి ఓటు వేసుడు… అసలు ఓటు వేయడమంటే ఏంటీ… ఈవీఎం ఏంటి.. ఇలా కనీస ప్రాథమిక అవగాహన కూడా ఉండని నిరక్షరాస్యత వాళ్లల్లో కనిపిస్తుంది. అక్కడ వాళ్లకు వాళ్లే పాలకులు. కులపెద్ద ఎంత చెబితే అంతే. అలాంటి పరిస్థితుల్లో న్యూటన్ పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నికలను ఎలా నిర్వహించాడు… అడుగడుగునా ఆత్మాసింగ్ ఎలా అడ్డుపడుతాడు.. చివరాఖరకు ఎన్నికల ప్రహసనాన్ని పూర్తి చేసి.. న్యూటన్ ఎన్నికల కమిషన్ మనన్ననలెలా అందుకుంటాడు వంటి సన్నివేశాలతో… సినిమా ఆకట్టుకుంటుంది.
మొత్తంగా ఇతర భాషలేమీ రాక… వాటిని అర్థం చేసుకోలేక… తమదైన సమాజంలో తమదైన భాషతో… తమది తామే బతికే ఆదీవాసీల బతుకుచిత్రాన్ని కళ్లకు కడుతాడు ఈ న్యూటన్ చిత్రంలో. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపమన్నట్టుగా… ఓ వైపు మావోయిస్టులు.. ఇంకోవైపు పోలీసుల మధ్య నలిగిపోయే అడవిబిడ్డల ఆత్మఘోష ఎలా ఉంటుందో చూపిస్తాడు ఈ సినిమాలో. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా… అదే స్థితిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా.. ప్రజాస్వామ్య ఎన్నికల ఓటింగ్ అనే ప్రక్రియలో ఏమాత్రం తమ ప్రమేయం లేకుండానే ఓ షరతులా తప్పనిసరిగా పాల్గొంటున్న నిరక్షరాస్యుల అమాయకత్వం కనిపిస్తుంది ఈ మూవీలో. మొత్తంగా న్యూటన్ ఓ అద్భుత చిత్రం. విడుదలైంది 2017లోనేనైనా… ఈ సినిమా ఇప్పటికీ 2024లోనూ అదే భావనను కల్గిస్తుందంటే.. అలాంటి సమాజాల్లో ఇంకేం మార్పులు కనిపిస్తున్నట్టు..? ఈ సినిమాకు జాతీయ పురస్కారాలతో పాటు.. ఐఫా పురస్కారం వంటివెన్నో దక్కాయి. మొత్తంగా న్యూటన్ ఓ వర్త్ వాచ్!
అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.



