అతి సర్వత్ర వర్జయేత్! రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వరకూ పుట్టి ముంచుతున్న నానుడి!!

అలెగ్జాండర్ ది గ్రేట్ – గ్రీకు వీరుడు.. పోరాట యోధుడు.. ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏర్పరచాలి అనేది ఆయన కోరిక .

తన కలను చాలామటుకు నిజం చేసుకొన్నాడు .

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు .

ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడు . ఈ వాస్తవికత దృక్పథాన్ని చివరి దశలో కోల్పోయాడు అలెగ్జాండర్. సైన్యం అలసి పోయింది అని తెలిసి కూడా ఇంకా ముందుకు సాగాలని నిర్ణయించాడు. ఫలితం సైన్యంలోనే తిరుగుబాటు ఎదుర్కొన్నాడు .

హిట్లర్, స్టాలిన్..

నియంతలుగా పరిచయస్థులు. వారిని ఒక దశలో ఆ దేశాల ప్రజలు అమితంగా అభిమానించారు. కానీ, వారి పతనానికీ కారణం అతినే.

ఔరంగజేబు.

దక్కన్ షియా రాజ్యాలను జయించాలనేది అతని కోరిక. అక్కడి దాక ఓకే. కానీ దాని కోసం రాజధాని వదిలి అనేక సంవత్సరాలు దక్కన్ ప్రాంతంలో ఉండిపోయాడు. దక్కన్ నైతే జయించాడు కానీ, ఉత్తరాదిన తిరుగుబాట్లను ఊహించలేకపోయాడు. ఫలితం.. తన సామ్రాజ్యం బలహీనమైంది. ఇక్కడ కూడా పాయింట్ అతే.

సరే పైవన్నీ రాజరికం కథలు. ఆ నాటి యుద్ధ నియమాలు వేరు.
సోవియెట్ యూనియన్, జర్మనీల కథ కూడా వేరు.

ప్రజాస్వామ్యయుగం నీతి వేరు .
అందునా భారత్ వంటి భిన్నత్వమున్న దేశం సంగతి వేరు.

నూటికి నూరు శాతం ప్రజాభిప్రాయం.. ఓట్లు పొందిన నాయకులెవరైనా ఉన్నారా..? పోనీ డెబ్భై శాతం.. ? లేదు. డెబ్భై ఏళ్ళ చరిత్ర ఇది. నలబై శాతం ఓట్లు వస్తే ఏదో ఓ పార్టీ గెలిచినట్టే. కానీ, గెలిచిన పార్టీని వ్యతిరేకించిన వారు యాభై – అరవై శాతం వుంటారు. తమ పార్టీ గెలవాలని ప్రతీ రాజకీయ పార్టీ నాయకుడికి ఉంటుంది. గెలవాలంటే మరింత మంది ఓటర్లను ఆకట్టుకోవాలి. కానీ, అది అనుుకున్నంత సులభం కాదు .రూలింగ్ లో ఉన్న పార్టీకి కొన్ని అనుకూలతలుంటాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతా అనే ప్రతికూలత కూడా వుంటుంది. అంటే గతంలో తమ పార్టీ గెలిచిన ఓట్ల శాతం కంటే కాస్తో కూస్తో తక్కువ ఓట్లు వస్తాయి. పాలన బాగుంటే ఎక్కువ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. కానీ, అలాంటి పరిస్థితులు బహుస్వల్పమే.

ఇలాంటప్పడు రాజనీతి ఏమి చెబుతుంది ?

తన ప్రత్యర్థి పార్టీలు కలవకుండా చేయాలి.

ఇందిరాగాంధీ.. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష నాయకులను రాచి రంపాన పెట్టింది . ఫలితం మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ప్రధానులయ్యారు . ఎమర్జెన్సీ సమయంలో ఆమె ప్రభుత్వం చేసిన అతి… జన్మలో కలవరు అనుకున్న నాయకులను ఒక్క తాటిపైకి తెచ్చింది.
అంటే ఆ రోజుల్లో ఎజెండా ఒకటే.. ఇందిరకు అనుకూలురు.. ఇందిరకు ప్రతికూలురు. ప్రతికూలురందరినీ ఏకం చేసిన ఘనతా ఇందిరదే.

రాజకీయ నాయకులు చరిత్ర నుంచి పాఠాలను గ్రహించరు. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఇదే దారి పట్టింది. ప్రజా అభిమానంతో లెఫ్ట్ ఫ్రంట్ అప్రతిహతంగా గెలుస్తూ వచ్చింది. కానీ, అధికారం తమ చేజారి పోవద్దని వారు అవలంబించిన విధానాలే నాయకురాలిగా మమతా బెనర్జీ అవతరణకు దారి తీశాయి. నాలుగో లేదా ఐదో ఎలక్షన్స్ లో ప్రజాభీష్టం అమలయ్యి ఉంటే లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపొయ్యేది. కాంగ్రెస్ కు చెందిన ఎవరో నాయకుడు సీఎం అయివుండేవాడు. మరోసారి.. అంటే ఇప్పుడు కేరళలో జరుగుతున్నట్టుగా లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చివుండేది . కానీ, లెఫ్ట్ ఫ్రంట్ అతి కారణంగానే మమత… అంటే తాము అనుసరిస్తున్న విధానాలనే అనుసరించే మరో లీడర్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ మూడో స్థానానికి పడిపోయింది. ముమ్మాటికీ స్వయంకృతాపరాధం!

తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. పోటీ కాంగ్రెస్, బీజేపీకి మధ్యే నడిచింది. తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాం .. ఇప్పుడు మోడీకి వోట్ వెయ్యాలి అనే మూడ్ లో ఎక్కువ మంది ప్రజలు కనిపించారు. తన బలమే.. తన బలహీనత.. అదే బీజేపీ. బీజేపీ గెలవాలనుకునేవారు వున్నట్టే… బీజేపీని ఓడించాలి అనే ఓటర్లు వున్నారు . చాలా నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి మూడో స్థానానికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తోంది . బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ కే వోట్ వెయ్యాలి అనే నిర్ణయానికి ఎక్కువ మంది మైనారిటీ ఓటర్లు వచ్చారు .

దీన్ని గమనించే రేవంత్ రెడ్డి బీజేపీనే విమర్శించారు. తెలంగాణా సాధించిన పార్టీ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా..? అనే స్థాయికి వచ్చిందంటే.. ఇక, కారణాల్ని.. ఆ పార్టీ నాయకత్వం ఆత్మవలోకనం చేసుకోవాలి. సో ఓవర్ టూ బీఆర్ఎస్! ఇక్కడ అదే అతి. ప్రతిపక్షం వుండకూడదని నాయకుల్ని టార్గెట్ చేసుకున్న ఫలితమే .. రేవంత్ రెడ్డి! పశ్చిమ బెంగాల్ లో మమతాలాగా ఇక్కడ రేవంత్!! . లేకుంటే భట్టి (మా మిత్రుడు బట్టి మామ) లాంటివారు సీఎం అయ్యేవారు.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ రెండూ ఢీ అంటే ఢీ అనే స్థితిలో కనిపించాయి . చెరో ఎనిమిది అంటున్నారు. బీజేపీకి ఒకటి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదనేదీ ఓ టాక్.

ఇదే జరిగితే ఆగష్టు నెలలో తెలంగాణాలో మహారాష్ట్ర తరహా మార్పనే ఊహాగానం వినిపిస్తోంది . ఖమ్మంకు చెందిన నాయకుడు ముప్పై మందితో బీజేపీ, భారత రాష్ట్ర సమితి సాయంతో ముఖ్యమంత్రి అవుతారు అనేది ఊహాగానం .

ఇలా జరగాలంటే బీజేపీ 350 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఇప్పుడున్న అంచనా బట్టి బీజేపీ 250 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్న మాట. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే.. చిన్నాచితక పార్టీల సాయం తీసుకోవాల్సి రావొచ్చు . ఎన్నో ఏళ్లుగా తనకు మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, అకాళీదళ్ లాంటి పార్టీలను దూరం చేసుకోవడం వల్లే ఇది జరిగిందని అప్పటికి ఆ నాయకత్వం ఆత్మావలోకనంలో పడిపొయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటప్పుడు గతంలో తాను పాటించిన స్పీడ్ విధానాలను.. బీజేపీ పాటించకపోవచ్చు . ప్రతిపక్ష పార్టీల పట్ల తాను పాటిస్తున్న విధానాల వల్లే అవి ఏకమయ్యాయి అని అవగాహహన వారికి వచ్చే అవకాశం అప్పటికైనా వస్తుందా చూడాలి.

ఒక వేళ రేవంత్ ప్రభుత్వాన్ని నెలలు నిండకుండా కూలదోస్తే.. అతని నోట్లో పాలు పోసినట్టు అవుతుంది. ఎంతో మంది నాయకులున్న తెలంగాణాలో రేవంత్ కు అవకాశం వచ్చిందంటే.. అది చర్లపల్లి ఘటన మహత్యం . ఇప్పుడు అయిదారు నెలలకే కూల దోస్తే.. ఆయన మరింత బలపడే అవకాశముంది. రాజకీయాల్లో నేడు ముఖ్యమే.. కానీ రేపు కూడా ఉంటుందని మరిస్తే ఎలా.. ?

ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి!.

గిరి గీసినట్టు విభజన. ప్రతి ఒక్కరికి వారి నాయకుడు హీరో. అవతలి నాయకుడు విలన్. తమ పార్టీ గెలుస్తుందని ఇరు పక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కులం, మతం బలమైన పాత్ర పోషిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొంత శాతం ఓట్లను కోల్పోతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు అందుకు కారణమనుకుంటే… అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు అదనపు ఓట్లు తెస్తుందన్నది పాలకపార్టీ నమ్మకం.

గత ఎన్నికల్లో బలమయిన విజయం సాధించిన పార్టీకి వచ్చింది ఎంత శాతం ఓట్లు ? ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎన్ని శాతం ఓట్లు ? సంక్షేమ కార్యక్రమాల మూలంగా పెరిగిన ఓట్లు ఎన్ని ? ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పోయిన ఓట్లెన్ని ? లెక్క వేసుకోక తప్పదు.

మరి తేడా.. ?

అప్పుడు వైరి శిబిరం చెల్లాచెదురు! ఇప్పుడు.. ? ఏకం!

పవన్ కళ్యాణ్.. ఎప్పటికైనా సీఎం కావాలనే ఆలోచన వున్న నాయకుడు.

మామూలుగా ఉంటే.. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అరవై డెబ్భై సీట్స్ అడిగివుండేవాడు. పొత్తు కుదిరుండేది కాదు .

ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఓడించాలి అనే స్థాయికి పవన్ ను నెట్టింది ఎవరు ? ఆయనలో అంత కసి పెరగడానికి కారణం ఎవరు ??

ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెడిత .. న్యూట్రల్ ఓటర్లలో సింపతీ పెరగదా ?

మొదటి దశలో మోడీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. రెండో దశ ప్రచారంలో తీవ్ర విమర్శ లు చేసాడు. ఇంతలా బంధాన్ని కుదిర్చింది ఎవరు ? పవన్ కాదా ? బీజేపీ కి పట్టణాల్లో స్థిరపడిన నార్త్ ఇండియన్ ఓటర్ల వోట్ బ్యాంకు ఉంది. ఇంకా సాంప్రదాయక ఓటు బ్యాంకు ఎంతో కొంత ఉంటుంది.

ఏడు ప్లస్ మూడు .. మొత్తం పది శాతం ఓట్లు కలిస్తే ఎన్ని సీట్ల ఫలితాలు తారుమారవుతాయి ?

పవన్ కళ్యాణ్ లో కసికి కారణమేమై ఉంటుంది.. ప్రతిపక్ష కూటమి మధ్య ఐక్యత సాధించింది ఎవరు ? దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? వేచి చూడాల్సిందే.

ఇక్కడ పోస్ట్ చేసింది.. నా అభిమతం కాదు.. కేవలం విశ్లేషణ మాత్రమే. దీనితో మీరు విభేదించవచ్చు. ఇక్కడ మీ మీ కామెంట్స్ను పోస్ట్ చెయ్యండి. ప్రజాస్వామ్యమంటే భిన్నాభిప్రాయాల కలబోత. మన అభిప్రాయంతో విభేదించేవాడు మన శత్రువు కాదు.

మన అభిప్రాయంతో విభేదించేవాడు మన శత్రువనుకుని… వ్యక్తిగత విమర్శలు చేస్తే ?

ఇన్ని చూశాక కూడా గుణపాఠాలు నేర్చుకోనట్టే లెక్క!

వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యా, సామాజికవేత్త..✍️

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles