Amarnath Vasireddy… ✍️✍️
…………………………………………………………………………….

అమెరికాలో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… గాడిద మార్గం.
ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద.
గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది.
గాడిద మార్గం రహదారి కాదు.
ఎన్నెన్నో దొంగ మార్గాలు.
ఇందులో ఒకటి… దరియెన్ ఖాళీ స్థలం.
అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల.
పొడవు 97 కిలోమీటర్లు.
పనామా… కొలంబియా మధ్య వుంది.
విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి.
ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ.. వేడి.. చెమటలు కారిపోతాయి.
అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియాలతో.
ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు .
ఈ మార్గంలో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్లు ఇస్తారు.
డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి.
లేకపోతె చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు.
ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది .
ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు.
వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి.
రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు.
తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు. దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది.
అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా… ?
కొండలు, గుట్టలు.. బురద.. చెట్లు చేమలు.. పాములు.. దోమలు.. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం.
అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి.
ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది.
అంటే అక్కడే తిండి లేకుండా చచ్చిపోతారు.
జనాలు వెళుతుంటే దారిలో శవాలు, అస్తిపంజరాలు కనిపిస్తాయి.
ఇంతటి దారుణమైన మార్గంలో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా.. ?
2023లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబల్.
విమానంలో ఎక్కించినా బేడీలు ఎందుకు.. ?
భయం!
భయపెట్టడం!!
“మా దేశానికి అక్రమమార్గంలో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!” అని అందరికీ హెచ్చరిక!
సైకలాజికల్ వార్నింగ్!!
అందుకే అమృత్సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియోను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది .” దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశంలో దూరినా.. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బంధిస్తాం. అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము “అని వారు అధికారికంగా చెబుతున్నారు. ( గెంటేస్తాము అనే మాట వారు వాడిందే. )
శిక్షించవచ్చు కదా.. ?
టైటిల్ 8 సెక్షన్ 1325 .. US కోడ్ ప్రకారం ఆ దేశంలో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు.. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం.
ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు. వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే. ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికాలో చొరబడి… అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు.
ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
విద్యార్థుల సంగతి ఏంటి.. ?
స్టడీ వీసాపై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు.
ఇన్నాళ్లూ సాగింది.
ఇప్పుడు… పట్టుబడిపోతాము అని భయంతో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు.
వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీగా లేరు .
పరిస్థితి దారుణంగా వుంది.
ఆయనకో షాప్ వుంది. వ్యాపారం వారి కుల వృత్తి. కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు. అటుపై మరో ఇరవై లక్షల అప్పు. వడ్డీ కట్టలేక మొన్న ఆత్మహత్య చేసుకొన్నాడు .
కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి! ఎవరిదీ పాపం.. ?
ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు.
“పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి” అనే తపనే.
గాడిద మార్గంలో ప్రాక్సీ మార్గంలో అమెరికాకు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు.
అమెరికా కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు
నాశనం అయిపోతోంది మనోళ్లే!
దోచుకొంటోంది మనోళ్లే!
మొసలి కన్నీరు కురుస్తోంది మనోళ్లే!
డాలర్ డ్రీమ్స్ కాస్తా… డాలర్ నైట్ మేర్స్ అయితున్నాయి.
బహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియాలో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళ,తాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు.
రహదారికీ .. అడ్డదారికీ తేడా ఇప్పటికైనా తెలుసుకుంటే అందరూ బాగుపడతారు.



