Ganesh Thota.. ✍️
పరిస్థితులు ఏ వ్యక్తినైనా అయితే గొప్పవాడిగా తయారు చేయగలవు.. లేదా, చరిత్ర హీనుడిగానైనా మార్చగలవు.
ఏదీ ఏమైనప్పటికీ సంకల్పశక్తి,.. జీవితంలో ఏదైనా సాధించాలన్న కోరిక ఉంటే మాత్రం ఓ వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.

అస్సాం రాష్ట్రం బిశ్వనాధ్ జిల్లా, గోహ్పూర్ పట్టణానికి చెందిన దిగంతాదాస్ కథ ఒక సినిమా కథను తలపిస్తుంది. ఇప్పుడు అతను అస్సాంలో పరోటా ఆన్- ది- గో ప్యాకేజింగ్ వెంచర్ అయిన DFF డైలీ ఫ్రెష్ ఫుడ్ యజమానిగా ఎదిగాడు.
ఒకప్పుడు రోజువారి కూలీగా ఉన్న అతడు ఇప్పుడు పదిమంది ఉద్యోగులు కలిగిన యజమాని. తన “పరోటా ఆన్ ది గో” వ్యాపారానికి కేరళలోని ప్రసిద్ధ మలబార్ పరోటాలు ఇన్స్పిరేషన్.
2001లో ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసిన తర్వాత దిగంతాదాస్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా అరుణాచల్ ప్రదేశ్లో రోజువారీ కూలీగా పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత బొగ్గు గనుల్లో పనిచేసేందుకు పొరుగున ఉన్న మేఘాలయకు వెళ్ళాడు. బొగ్గు గనిలో కొంత కాలం గడిపిన తర్వాత, అస్సాంలోని ఉదయగిరి జిల్లాలో ఓ నిర్మాణ సంస్థలో స్టోర్ కీపర్ గా చేరాడు. అక్కడ వంటవాడిగా అవకాశం వచ్చి మూడేళ్లు ఆ పదవిలో కొనసాగాడు. 2008లో మంచి అవకాశాల కోసం దాస్ బెంగుళూరు వెళ్లిపోయాడు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు.
కర్ణాటక రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలు చేసిన తర్వాత అస్సాం కు తిరిగివచ్చి 2014లో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే దిగంతాకు మంగళూరులోని ఓ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మిక్సింగ్ మ్యాన్ గా ఉద్యోగం వచ్చింది. ఈ సమయంలోనే దిగంతాదాస్ తనలోని నైపుణ్యాన్ని కనుగొనగలిగాడు. మిక్సింగ్ మ్యాన్ గా అతని నైపుణ్యాలు త్వరలో అతన్ని పరోటా రెడీ మిక్స్ తయారీదారు స్థానానికి పెంచాయి.
కొంతకాలం తర్వాత కుటుంబ కారణాలవల్ల దిగంతాదాసు అస్సాంకు తిరిగి ప్రయాణం కావల్సివచ్చింది. 2017లో దిగంతా పైన ఓ హై వోల్టేజ్ విద్యుత్ కేబుల్ పడి సగం పక్షవాతానికి గురయ్యాడు. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఆ సమయంలోనే కుటుంబాన్ని ఈదటానికి దిగంతదాస్ నానా ఇబ్బందులు పడవలసి వచ్చింది.
కోలుకున్న తర్వాత బెంగుళూరులో మళ్లీ పనిచేయడానికి ఆఫర్లు వచ్చాయి. వేరే మార్గం లేకపోవడంతో సిలికాన్ సిటీకి వెళ్లిపోయాడు. పరోటా తయారీదారుగా మళ్లీ పని ప్రారంభించాడు.
ఈ క్రమంలో దాస్ ఆంధ్రప్రదేశ్ కు మకాం మార్చాడు. ఆ ప్రాంతంలో తన స్నేహితుని దగ్గర పరోటాలను మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. తన అంకితభావం, ప్రయత్నాల ద్వారా దాస్ ఆంధ్రప్రదేశ్ లో బలమైన కస్టమర్ బేస్ ను నిర్మించగలిగాడు. ఈ విజయం దాస్, అతని స్నేహితుడు తమ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రేరేపించింది.
దక్షిణాది రాష్ట్రంలో విజయవంతమైన తర్వాత దాస్ అస్సాంలోని తన స్వగ్రామానికి తిరిగి వచ్చి ప్యాక్ చేసిన పరోటా వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దిగంతాదాస్ త్వరలో తన సొంత పట్టణమైన గోహపూర్ లో తన సొంత పరోటా బ్రాండ్ డైలీ ఫ్రెష్ ఫుడ్ ని ప్రారంభించాడు. నెలకు యాభై లక్షల టర్నోవర్ తో తన స్వయంశక్తిని నమ్ముకుని ఎదిగిన కూలీ.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని తన వ్యక్తిగతానికే పరిమితం చేయకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న యువకులను కూడా తనతో కలిపి కలిసి ఎదగండి అని ఆహ్వానిస్తున్నాడు.



