ప్రేమికురాలి నుంచి నాయకురాలిగా: సుచేతా కృపలానీ ఆసక్తికర జర్నీ!

సమాజాన్ని ధిక్కరించి ప్రేమ పెళ్లి… తిరిగి అదే సమాజంలో తొలి ముఖ్యమంత్రి!

గాంధీ కూడా తొలుత వ్యతిరేకించాడు. కానీ, ఆమె మాత్రం మాట వినలేదు. సమాజాన్ని ఎదిరించి.. ప్రేమను గెలిపించింది. ప్రేమతో పాటే ఆమె కూడా గెల్చింది. భారతదేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించింది. ఇది సుచేతా కృపలాని కథ.

భారతదేశ రాజకీయ చరిత్రలో సుచేతా కృపలానీ పేరు శాశ్వతం. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆ పేరు రెపరెపలాడుతూనే ఉంటుంది. అయితే, ఆమె రాజకీయ జీవితంలో ఎంత ఎత్తుకెదిగారో… వ్యక్తిగత జీవితంలో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సామాజిక సాంప్రదాయాలకే ఛాలెంజ్ విసిరారు. సవాళ్లకు ఎదురొడ్డి నిల్చి గెల్చారు.

తనకంటే దాదాపు 20 ఏళ్ల పెద్దవాడైన స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య జేబీ కృపలానీని వివాహం చేసుకోవాలనుకున్న ఆమె నిర్ణయం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులే కాదు.. ఏకంగా మహాత్మాగాంధీ కూడా ఆ బంధాన్ని సమర్థించలేదు. అయినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పట్టుదలే ఆమె ప్రేమను విజయవంతం చేయడంతో పాటే.. భారత రాజకీయాల్లోనూ చిరస్థాయిగా నిలబెట్టింది.

సుచేతా కృపలానీ ఎవరు..? ఓ విద్యావేత్త జాతీయస్థాయి నాయకురాలిగా ఎలా ఎదిగింది..?

1908, జూన్ 25న జన్మించింది సుచేతా మజుందార్. తొలుత ఓ అధ్యాపకురాలిగా పనిచేసింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్ర బోధిస్తూ విద్యార్థులను జాతీయ భావాలవైపు నడిపించారు సుచేత. స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో ఆమె జీవితం మరో కొత్త మలుపు తిరిగింది. అదే ఆచార్య జేబీ కృపలానీతో పరిచయం.

జేబీ కృపలానీతో పరిచయం ప్రేమగా ఎలా చిగురించింది..?

1929లో స్వాతంత్ర్య ఉద్యమానికి వాలంటీర్లను సమీకరించేందుకు జేబీ కృపలానీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. దేశభక్తి, సేవాభావం, గాంధేయ సిద్ధాంతాలపై కృపలానీకి, సుచేతకు ఉన్న అభిప్రాయాల సారూప్యతతో వారి పరిచయం జరిగి ఆ తర్వాత ప్రేమవరకూ వెళ్లింది. సుమారు 20 ఏళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ వివాహానికి నిర్ణయించుకునేదాకా దారితీసింది వీరిద్దరి 1929 లవ్ స్టోరీ.

సుచేత, కృపలానీల వివాహాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించాడు..?

స్వాతంత్ర్య ఉద్యమంలో ఫోకస్డ్ గా పనిచేసిన కీలక నాయకుల్లో జేబీ కృపలానీ ఒకరు. వివాహం చేసుకుంటే కీలక సమయంలో కృపలానీ దృష్టి ఉద్యమం తగ్గిపోతుందేమోనన్న భావన గాంధీలో ఉండేది అన్న కథనాలు కొన్ని చారిత్రకంగా వినిపిస్తాయి. అప్పుడు సుచేత గాంధీతో చెప్పిన సమాధానం ఓ హిస్టారికల్ ఆన్సర్. మా పెళ్లి జరిగితే మీకు ఓ కార్యకర్త తగ్గుతాడని భావిస్తున్నారేమో… కాదు, మరో కార్యకర్త పెరిగి ఇద్దరవుతారని చెప్పారట సుచేత. ఆ ఒక్కమాట దేశసేవపై ఆమెకున్న అంకితభావానికి నిదర్శనం.

చుట్టుముట్టిన వ్యతిరేకతల మధ్య వివాహం!

ఓవైపు కుటుంబ సభ్యులు, ఇంకోవైపు సమాజం, మరోవైపు ప్రముఖ నాయకుల అభ్యంతరాలను అన్నింటినీ ఎదిరించి 1936, ఏప్రిల్ లో సుచేతా మజుందార్, ఆచార్య జేబీ కృపలానీ ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఆ తర్వాత తన భర్త పేరుతో కాకుండా.. తన సొంత ప్రతిభతోనే రాజకీయాల్లోనూ సుచేత ప్రస్థానం కొనసాగింది.

స్వాతంత్రోద్యమంలో సుచేత పాత్రేంటి..?

క్విట్ ఇండియా మూమెంట్ లో కీలకపాత్ర పోషించారు. అవసరమైనప్పుడు గూఢచారిగా వ్యవహరించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఏర్పాటులోనూ కీలక పాత్రధారి. రాజ్యాంగ సభ్యురాలిగా సేవ చేశారు. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన చారిత్రక రాజ్యాంగ సభ సమావేశంలో వందేమాతరం ఆలపించినవారిలో ఒకరిగా నిల్చారు. ఇలా సుచేతా కృపలానీ స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించారు.

భారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రిగా అవకాశం ఎలా దక్కింది..?

1963లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకుడి కోసం అన్వేషిస్తున్న సమయంలో సుచేతా కృపలానీ.. సీనియర్ నాయకుడైన కమలాపతి త్రిపాఠిపై విజయం సాధించి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. అలా 1963, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే మళ్లీ ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.

సుచేతా కృపలానీ వారసత్వం ఎందుకు ప్రత్యేకం..?

సుచేతా కృపలానీ జీవితం కేవలం రాజకీయ విజయాలుగానే చూడలేం. సమాజం వ్యతిరేకించిన ప్రేమను గెలిపించుకున్న నవయుగ మహిళామణిగా ఆమె పేరు నిల్చిపోయింది. స్వాతంత్ర్య సమరయోధురాలిగా, మహిళా సాధికారతకు ప్రతీకగా, తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఇలా తరాలకు స్ఫూర్తినిచ్చే ఒక వెలుగయ్యారు సుచేత.

జీవితంలో ధైర్యం, ప్రజాసేవలో అంకితభావం, రాజకీయాల్లో నాయకత్వం ఈ మూడు లక్షణాల కలయికే సుచేతా కృపలానీ. అందుకే ఆమె భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ నాయకురాలిగా గుర్తుండిపోయారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles