భావోద్వేగాల కలబోత, ప్రతి ఊరికథ.. సత్యం సుందరం!

సత్యం సుందరం!

బావా.. వచ్చినప్పట్నుంచీ నన్ను పేరు కూడా పెట్టి పిలువలేదు.. ఎవర్నో చూసినట్టు అందరిలానే నన్నూ చూస్తున్నారు.. రేపుదయాన్నే మమ్మల్ని పేరు పెట్టి పిల్చే మీరు వెళ్లాలని చెప్పాక.. అతడి పేరేంటో తెలియని పరిస్థితొకవైపు… అంత ఆప్యాయత, ప్రేమ చూపిన వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పేరు పెట్టి పిల్చేందుకు వాళ్ల పేర్లు తెలీకపోవడం మరోవైపు.. అలాంటి సందిగ్ధావస్థలో అరవింద్ స్వామి మబ్బున్నే ఊర్లోని వీధుల్లో చెప్పులు కూడా పడేసి ఉరికే సీన్ బంధాల గాఢతను తెలుపుతుంది. సత్యం సుందరంలో ఇలాంటి సీన్స్ మనల్ని అక్కడక్కడా కట్టిపడేస్తాయి.

కన్నతల్లి లాంటి ఉన్న ఊరుతో విడదీయలేని బంధమే… మెయ్యళగన్.. అదే సత్యం సుందరం!

పుట్టిన ఊరు, సొంత ఇల్లు… భౌతిక బంధాలు మాత్రమే కాదు, భావోద్వేగాల కలబోత!

కలుపుకుపోతే సామాజిక బంధాలెంత అల్లుకుపోతాయి.. జీవితమెంత బాగుంటుందో తెలియజేప్పే ఓ గొప్ప ప్రయత్నం!

నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెతా ఇందులో కనిపిస్తుంది.

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల్లో ఉన్న ఊళ్లో ఇల్లు కోల్పోయి.. ఎవ్వరినీ పల్లెత్తు మాటనకుండా మరో ఊరికి వలస వెళ్లే ఓ పెద్దమనిషి కుటుంబ కథ. పుట్టిన గడ్డతో, జన్మనిచ్చిన ఇంటితో, సామాజిక స్పృహను కల్పించిన మనుషులతో బంధాలన్నీ తెంచుకుని… కేవలం జ్ఞాపకాలు మాత్రమే పోగు చేసుకుని వెళ్లిపోయే ఆ ఇంట్లో మనుషులు నా అన్నవన్నీ కోల్పోయినప్పుడు పడే బాధకు ప్రతిరూపం. అలాంటి ఓ మంచి కుటుంబం దూరమయ్యారనే ఊళ్లోవాళ్ల బాధకు తెరరూపం.. సత్యం సుందరం.

వాస్తవానికి సినిమా అంటే ఇలా ఉండాలనే ఒకే మూస ఫ్రేమ్స్ చూస్తుంటాం. కొన్ని ఫైట్స్, ఇంకొన్ని డ్యాన్సులు, థియేటర్ లో కూర్చోబెట్టి, డ్యాన్సులేయించే మ్యూజిక్, కథ మధ్యలో అవసరం లేని సన్నివేశాలతో ముడిపెడుతూ వచ్చే కామెడీ సీన్స్… ఇలా అసందర్భోచిత నిర్మాణశైలికి, వయెలేన్స్ లేందే సినిమా రక్తి కట్టని ధోరణికి కేరాఫ్ గా మారిన ఎన్నో చిత్రాల మధ్య ఓ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేకుండా.. ఓ కుటుంబానికి, ఉన్న ఊరుతో పెనవేసుకున్న బంధాన్ని మాత్రమే చూపిస్తూ.. సినిమా చూస్తున్న ప్రేక్షకులను కదలనివ్వని బిగి సడలని స్క్రీన్ ప్లేను సత్యం సుందరంలో చూడొచ్చు.

అందుకేనేమో సత్యం సుందరం చూస్తుంటే… కచ్చితంగా పల్లె వదిలి పట్నం బాట పట్టిన ఎందరో కనెక్టైపోతారు. అప్పుడెప్పుడో సీతారాముడు చెప్పినట్టు.. ఈ గాలి ఈనేల ఈ ఊరు సెలయేరు… ననుగన్న నావాళ్లు కౌగిళ్ల లోగిళ్లని పాడుకుంటూ తమ ఊరి సిరివెన్నెల్లోకలా తొంగిచూస్తారు.

ఈ కాలంలో పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. పట్టణాలు నిండిపోతున్నాయి. ఈడు వచ్చిన పక్షులన్నీ ఉద్యోగాల వేటలో… కెరీర్ డెవలప్ మెంట్ పేరిట వలస వెళ్లిపోతున్నాయి. వలసెళ్లిన పక్షులన్నీ దేశ, విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్సైపోయి… తమ పెరుగుదలకు ఆవాసమైన చల్లని చెట్టు వంటి ఉన్న ఊరిని, కన్నతల్లినీ, పుట్టినింటిని మర్చిపోతున్నాయి. మెకానికల్ లైవ్స్ తో.. వీకెండ్ విలాసాలే జీవితమనుకుని.. అక్కడే స్థిరపడుతున్నాయి. అలాంటి పక్షులన్నీ చూడాల్సిన సినిమా సత్యం సుందరం!

ఇప్పటికీ ఊళ్లు వదిలి.. ఉద్యోగాల్లో ఉన్న కొడుకుల వద్ద ఉండలేని తల్లిదండ్రులు ఊరిబాట పడతామని పదే పదే ఎందుకు గొడవ చేస్తుంటారో తెలుసుకోలేని సంతానం ఎవరైనా ఉంటే… సత్యం సుందరం సినిమా చూసైనా ఆ భావోద్వేగాల సున్నితత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతర్లీనంగా ఆ విషయాన్నీ మనకు చెబుతుంది ఈ సినిమా.

అంతెందుకు మా ఊరితో, మా ఇంటితో ఉన్న అనుబంధాన్ని నాకు గుర్తు చేసినట్టే… ఉన్న ఊరిపై మమకారమున్న ప్రతీ జీవిని అలరించే సినిమా సత్యం సుందరం!

ఉళ్లో గోదారి ఒడ్డు, చిన్నగడి, పెద్దగడి, సత్యవతి, బ్రహ్మగుండాల జలకాలాటలు, ఠంఛన్ గా కరెంట్ పోయే రోజుల్లో విశ్రాంతి వరకు మాత్రమే సాయిబాబా టాకీస్ లో చూసిన పులిబెబ్బులి సినిమా, శివుణి గుడిపై బొయ్యారంలో దాగుడుమూతలాట, అక్కపెల్లి రాజేశుడి గుడి వెనుక చేళ్లలో పెసరగాయ దొంగతనం, సాయంత్రమైందంటే గుళ్ళో ఘంటసాల గొంతు నుంచి జాలువారే భగవద్గీత, చిన్న సరిగెత్తు, పెద్ద పరిగెత్తు పేరిట మా ఇంటి ముందర తిరిగే పీరీలు, లాలీసాబులు.. ఇలా ఒకటా, రెండా ఒక తరం మొత్తం గుర్తుచేసుకున్నోళ్లకు గుర్తు చేసుకున్నన్ని జ్ఞాపకాల మూట ఊరంటే!

అలా హర్ గావ్ కీ ఏక్ కహానీ ఎలాగూ ఉంటుందో.. దాన్నే కళ్లకు కట్టే యత్నం చేసింది సత్యం సుందరం!

తనకు ఊరిపై మమకారమున్నా… చిన్నప్పటి ఆనవాళ్లను చాలావరకూ మర్చిపోయిన సత్యం పాత్రలో అరవింద్ స్వామి… బావ బావ అంటూ తన పేరే గుర్తులేని బావతో గడిపే సమయంలో అమితమైన ఆనందానుభూతిని పొందే బామ్మర్ది సుందరం పాత్రలో కార్తీ.. ఇద్దరూ అదరగొట్టేశారు.

అసందర్భోచిత అంశాలకు తావివ్వకుండా… కేవలం ఓ ఊరు, ఓ కుటుంబం, ఆ ఊళ్లోని తమ చుట్టాలు, పక్కాలతో ఉన్న బంధాల్ని మాత్రమే తన క్యాన్వాస్ కు వస్తువుగా చేసుకుని.. ఎక్కడా సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా చక్కగా రాసుకుని… దర్శకుడిగా తెరకెక్కించడంలో ప్రేమ్ కుమార్ మరింత సక్సెస్ అయిన సినిమా సత్యం సుందరం!

నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమా ఇంటిల్లిపాది సకుటుంబ సపరివారంగా ఆనందంగా ఎంజాయ్ చేసే ఓ ఫీల్ గుడ్ మూవీ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles