తాళి కడితే చాలు హక్కుదార్లనుకునే మగానుభావులకు.. చెంపపెట్టు ఆ సినిమా!

Shanthi ishaan.. ✍🏻

భర్త భార్యని కొడితే శరీరానికి తగిలిన దెబ్బ రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మరి మనసుకు తగిలిన దెబ్బ? ఏం పర్లేదు పోను పోను అదే అలవాటైపోతుంది. కానీ మొగుడు కొడితే తిరిగి కొట్టాలన్న కసి, పిల్లల కోసమో, పరువు కోసమో రాజీపడిపోయి సిగ్గు లేని బతుకీడుస్తున్నానన్న అసహ్యం, తన దృష్టిలో తనే దిగజారిపోతుండడం నుంచి పుట్టిన ఆత్మ న్యూనత, అన్యాయాన్ని ఎదురించలేకపోతున్నానన్న అపరాధ భావం– వీటి మాటేంటి? చాల్లేమ్మా పెద్ద చొప్పొచ్చావు, ఇలాంటివి కూడా ఉంటాయా? మొగుడన్నాక ఓ దెబ్బ వేస్తాడు దానికే ఇంత గగ్గోలా అనే “మగానుభావులు”, వాళ్ళకు వంతపాడే ఆడవాళ్ళు ఈ సినిమా తప్పకుండా చూడాలి. చాలా ఇళ్ళల్లో చాలా మామూలుగా కనిపించే గృహహింస ఆడదాన్ని ఎంతగా కుంగదీస్తుందో అర్థం కావాలంటే మగవాళ్ళ వైపు నుంచో, సమాజం వైపు నుంచో కాదు ఆ బాధను అనుభవిస్తున్న ఆడదాని కోణం నుంచి చూడాలి. అప్పుడే ఆ గాయం ఎంత భయంకరంగా సలుపుతుందో కొంతైనా అవగాహనకొస్తుంది. డైరెక్టర్ చారుకేశ్ శేఖర్ చేసిందదే.

“అమ్మా! రవి నన్ను కొట్టాడు” అంటుంది అమ్ము తల్లితో. వెంటనే ఆ తల్లి “నువ్వేం చేశావ్” అని అడుగుతుంది. రవి కూడా ఓ సందర్భంలో నువ్వు నన్ను విసిగించినందుకే కొట్టాల్సి వచ్చింది అంటాడు. “అంటే తప్పు చేస్తే కొట్టేస్తారా?” ఈ ప్రశ్న అమ్ము మనసును తొలిచేస్తుంటుంది. నిజానికి అమ్ము కొట్టేంత తప్పులేమీ చేయలేదు. ఓ రోజు లంచ్ తేవాలన్న విషయం మర్చిపోతుంది, ఇంకోసారి భర్తకి మాటకి మాట సమాధానం చెబుతుంది. మరోసారి కాస్త పని అందుకోమంటుంది. ఇక్కడ రవి కొట్టడానికి కారణం అమ్ము చేసే “తప్పులు” కాదు, తాళి కడితే చాలు సర్వ హక్కులూ నావే అన్న అహంకారం, సంపాదించి పెడుతున్నాను కదా అన్న ధీమా.

“మగాడు బయట సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ చిరాకులో ఏదో ఓ దెబ్బ వేస్తాడు. మనం సర్దుకుపోవాలంతే. నిన్ను బానే చూసుకుంటున్నాడు కదా” అంటుంది అమ్ము తల్లి. నిజానికి ఆ మాటలు ఆమెవి కావు, దశాబ్దాల క్రితం ఆమె తల్లి చెప్పినవి. అవే మాటలు కూతురికి చెప్పి తరతరాలుగా గృహహింస మన ఇళ్ళల్లో ఎంతగా పేరుకుపోయిందో చెప్పకనే చెబుతుంది. ఇంతా చెప్పి చివరలో ఓ ట్విస్ట్ ఇస్తుంది. “నువ్వు మాత్రం అలా చేయకు, భర్త కొడితే అతణ్ణి వదిలేయడమే కరెక్టు” అని కూతురిని ఆశ్చర్యపరుస్తుంది. పైగా “నా మాటే కాదు ఇంకెవరి మాటా వినకు. నీ నిర్ణయం నువ్వే తీసుకో” అంటుంది.

నిజంగానే ఓ రోజు అమ్ము తనకై తనే నిర్ణయం తీసేసుకుని పుట్టింటికెళ్ళడానికి బస్ స్టేషన్ కొస్తుంది. అక్కడ తారసపడిన బిచ్చగాడు (రఘుబాబు)తో తన గోడు వెళ్ళబోసుకుంటుంది. కానీ కాసేపటికే పట్టుదల కరిగిపోతుంది. తన ప్రేమలోనే లోపముందని భ్రమపడుతుంది. భర్తను మరింతగా ప్రేమిస్తే పరిస్థితి చక్కబడుతుందని ఆశపడుతుంది. అంతే! వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. ఒక్క అమ్మునే కాదు చిత్రహింసలు పడుతున్న భార్యలందరి మానసిక పరిస్థితీ దాదాపు ఇంతే. ఒక రకంగా వీళ్ళ ఈ బలహీనతే వేధించే భర్తలకు బలం. Demoralize చేసేసి పబ్బం గడుపుకుంటుంటారు. మొత్తానికి స్వేచ్ఛ వైపు అడుగులేస్తుందనుకున్న అమ్ము మళ్ళీ పంజరంలోకే వెళ్ళడం చూసి బిచ్చగాడు నిరాశపడతాడు. కానీ ఏమీ మాట్లాడడు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలనుకుంటాడు. అమ్ము తల్లి character, బిచ్చగాడి character రెండూ దాదాపు ఒకే విషయాన్ని చెబుతాయి. రెండు పాత్రలూ రెండు సీన్లకు మించి లేకపోయినా తమదైన ముద్ర వేస్తాయి.

First Half వరకు realisticగా అనిపించిన సినిమా ఆ తర్వాత cinematic turn తీసుకుంటుంది. భర్త మీద అమ్ము పకడ్బందీగా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇంత రిస్కు తీసుకునే బదులు భర్త మీద కేసు పెట్టేసి వచ్చేస్తే సరిపోయేది కదా అనేది కొందరి వాదన. కేసు పెట్టడానికి వెళ్తే ఏం జరిగిందో వీళ్ళు మర్చిపోయినట్లున్నారు. అతని నిజ స్వరూపం అందరికీ తెలియాలంటే ఇంకేదో చేయాలనుకుంటుంది అమ్ము. అందుకే పెద్ద స్కెచ్చేస్తుంది. ఇది కొందరికి convincingగా అనిపించలేదు. భర్త కొట్టినంత మాత్రాన ఇంతలా పగ తీర్చుకుంటుందా అని పెదవి విరిచేవాళ్ళున్నారు. “కొట్టినంత మాత్రాన” అనేది చిన్న మాట కాదు. అది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, ఎప్పటికీ మానని గాయం. అమ్ము తనకు తోచింది చేసింది. ఇదే పరిష్కారం అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ పరిష్కారం కాదు ముఖ్యం, మనలో చాలా మంది అసలే మాత్రం సీరియస్ గా తీసుకోని ఒక సమస్యను లేవనెత్తడం, దాని తీవ్రతను తెలియజేయడమే సినిమా అసలు ఉద్దేశం. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయినట్లే కనపడతారు. ఆడదాని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆమెను అమ్మను చేయాలనుకునే భర్త తీరును, సమాజపు వైఖరిని ఎండగడతారు.

భార్యను వంట మనిషిగానో, పని మనిషిగానో, పిల్లల్ని కనే యంత్రగానో చూస్తే తన మీద కోపం రాగానే ఆటోమేటిక్ గా చెయ్యి లేస్తుంది. అదే తను నీలో సగం, నీ జీవితంలో సగం అనుకుంటే ఆ చెయ్యే తనకి చైతనైనంత సాయం చేస్తుంది. చాలా మంది మగాళ్ళు ఎందుకనో ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంటారు.

అమ్ముగా ఐశ్యర్య లక్ష్మి జీవించేసింది. నవీన్ చంద్ర రవి characterలోని shades చాలా బాగా పలికించాడు. కథను మలుపు తిప్పిన బాబీ సింహ చాలా supportiveగా, హుషారుగా కనిపించాడు. పద్మావతి మల్లాది డైలాగ్స్ ఆలోచింపజేశాయి. Second halfలో story telling ఇంకొంత కన్విన్సింగ్ గా ఉండాలనిపించింది. అమ్ము, ప్రభు పాత్రల మధ్య బంధాన్ని మరికాస్త define చేసి ఉండాల్సింది. ఒకరికొకరు సాయం చేసుకోవడం వెనక motiveని ఇంకా గట్టిగా establish చేసి ఉండాల్సింది. ఈ లోపాలు పక్కనబెడితే “అమ్ము” ఓ మంచి ప్రయత్నం. Taking, theme, ambience పరంగా మలయాళంలో వచ్చిన “The Great Indian Kitchen”ని తలపిస్తుందీ సినిమా. ఈమధ్య కాలంలో తెలుగులో అర్థవంతమైన సినిమాలు రావట్లేదన్న దిగులు దీంతో కొంత తీరిందనే చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles