వినోద్ ఖన్నా.. బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యంత అందగాడు. మంచి పీక్ టైంలో తన కెరీర్ నుంచి పక్కకు జరిగాడు. బాలీవుడ్ ను వదిలేశాడు. ఓషో ఆశ్రమానికెళ్లాడు. ఎందుకు..?
అది 1982.. వినోద్ ఖన్నా బాలీవుడ్ కెరీర్ ఉచ్ఛస్థితిలో కొనసాగుతోంది. కానీ, ఎందుకో ఉన్నట్టుండి వినోద్ ఖన్నా తన సినిమా ఫీల్డ్ నే వదులుకుని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లాడు. ఖన్నా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చింది. హిందీ సినీ పరిశ్రమలో ఆ వేళ వినోద్ ఖన్నా వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న కాలమది. వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్నాడు. మరోవైపు అపారమైన అభిమానగణం. కానీ, ఆయన చిత్తం మాత్రం ఆధ్యాత్మిక గురువు ఓషోకు చెందిన అమెరికాలోని రజనీష్ పురం ఆశ్రమంపై పడింది. దాంతో ఉన్నపళంగా బాలీవుడ్ వదిలిపెట్టి ఒరెగాన్ కు పయనమయ్యాడు. అక్కడ ధ్యానముద్రలో, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపాడు. వినోద్ ఖన్నా కాస్తా వినోద్ భారతిగా అవతరించాడు.
ఆయన అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులు, కుటుంబీకులు, స్నేహితులందరినీ షాక్ కు గురి చేసింది. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మొదటి భార్యతో విడాకులకూ దారితీసింది. ఆయన కెరీర్ దిశనూ మార్చేసింది.

మరి తన నిర్ణయం వెనుక ఏం కారణం చెప్పారు ఖన్నా..?
కెరీర్ పీక్స్ లో ఒక సూపర్ స్టార్ దశలో కొనసాగుతున్న ఖన్నా.. తన నిర్ణయంపై నిలకడగా ఉన్నారు. ఆ సమయంలో అందరి అనుమానాలనూ, ఆశ్చర్యాలను పటాపంచలు చేసేలా ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సినిమాలను వదిలి, తను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు వెల్లడించారు. తనకు నచ్చిన మార్గంలో పయనించడం తనకిష్టమని.. అందుకు నిబద్ధతతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలో తన ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ ను ఫాలో అయ్యాడు.
జీవితం, మరణం వంటివాటిపై ఓషో బోధనలు వినోద్ ఖన్నాపై లోతైన ప్రభావం చూపాయి. అదే సమయంలో ఓషో ఆశ్రమం బాట పట్టడంతో తన మొదటి భార్య గీతాంజలితో ఖన్నాకు విడాకులయ్యాయి. వినోద్ ఖన్నా, గీతాంజలి కుమారులే అక్షయ్ ఖన్నా, రాహూల్ ఖన్నా. ఆ తర్వాత ఓషో ఆశ్రమం నుంచి తిరిగి వచ్చాక ఆయన కవితా దఫ్తరీని పెళ్లాడాడు. ఖన్నా, కవితలకూ ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
అయితే, అదే ఖన్నా సిమీగరేవాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ తర్వాత మాట మార్చారు. తన నిర్ణయం పూర్తిగా స్వార్థపూరితమైందన్నారు. అది తన అంతరంగ వికాసానికి మాత్రమే అవసరమన్నారు. తన వల్ల తన కుటుంబం పడిన బాధ, వారు పడిన మానసిక వేదన ప్రభావాన్నీ ఆయనే ఒప్పుకున్నారు.
అయితే, వినోద్ ఖన్నా ఏమంటారంటే..?
అవునూ, ఎవరైనా స్వార్థపరులు కాకుంటే ఇలాంటివి చేయలేరు. ఎందుకంటే, మీలోని ఆత్మే మిమ్మల్ని ఆ పరమస్థితిని వెతికేందుకు సిద్ధం చేస్తుంది. ప్రతీ ఒక్కరూ ఇక్కడికి ఒంటరిగానే వస్తారు. ఒంటరిగానే వెళ్తారు. కాబట్టి, ఎవరి ప్రయాణం వారు ఒంటరిగానే చేయాలి.
నేను నా కుటుంబంతో పూర్తి బంధాన్నేం తెంచుకోలేదు. పారిపోనూలేదు. వారికి అన్నీ సమకూర్చేవాణ్ని.
సుడిగుండాలైన ఆలోచనలే ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపాయి!
తన నిర్ణయానికి కారణాలను కూడా చెప్పిన ఖన్నా.. తన మనసే తన దిశ మార్చుకునేందుకు కారణమన్నాడు. బాగా ఎక్కువ ఆలోచించేవాడిని. హైపర్ గా ఉండేవాడిని. ఆలోచనలన్నీ చెల్లాచెదురుగా ఉండటంతో.. ఊరికెనే కోపానికి వచ్చేవాడిని. ఒక సాచురేషన్ పాయింట్ దాటిపోయింది. ఎవ్వరేం మాట్లాడినా నెగటివ్ ఫీలింగ్స్. నా ఆలోచనలు నా నియంత్రణలో లేకుండా పోయాయి. కానీ, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రం అవేమీ నన్ను ప్రభావితం చేయలేవని తెలుసుకున్నాడు. సంపాదించింది చాలు. బానే కూడబెట్టాను. ఇక మనసును అదుపులోకి తెచ్చుకోవాలంటే ధ్యానమొక్కటే మార్గం. అందుకు పూర్తి సమయం కేటాయించాలి. ఆశ్రమంలో ఉండాలి. గురువు పాదాల చెంత జీవించాలి. ఆ అవసరముందనిపించడంతోనే పీక్ కెరీరీ ను కూడా వదులుకోవాల్సి వచ్చింది.

తండ్రి గురించి కొడుకు అక్షయ్ ఏమన్నాడంటే..?
అక్షయ్ ఖన్నా కూడా సిమేగర్వాల్ ఇంటర్వ్యూలోనే తన అభిప్రాయాల్ని చెప్పాడు. వినోద్ ఖన్నా తను ఉన్నతస్థాయిలో ఉండి కెరీర్ నుంచి పక్కకు జరిగినప్పుడు.. అక్షయ్ ఖన్నా వయస్సు కేవలం ఐదేళ్లు. అది తనకేమీ అర్థం కాని వయస్సు. కానీ, ఏదో జరుగుతుందనేది మాత్రం చూచాయగా అర్థమయ్యేది. అప్పుడెవరైనా నాన్న ఇంటి నుంచి వెళ్లిపోతున్నాడని నాకెవ్వరైనా చెప్పారా, లేదా నాకు గుర్తు లేదు. నాన్న చేసింది తప్పని నేను భావించలేను. ఆ సమయానికి ఇంట్లో పరిస్థితులు కావచ్చు.. నాన్న మానసిక స్థితి కావచ్చు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు.. ఇంకొకరి కోసం త్యాగం చేస్తూ వాటిని భరించాల్సిన అవసరమైతే ఏం లేదు.
అందుకే మా నాన్న స్వార్థాన్ని నేను సమర్థిస్తున్నాను. కొంత స్వార్థం ఎవ్వరికైనా అవసరమే. మీరు సంతోషంగా లేనప్పుడు మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా సంతోషంగా ఉంచలేరు. మీరు అబద్ధపు జీవితాన్ని గడుపుతూ ఎంతో కాలం ఉండలేరు. ప్రతీ ఒక్కరూ తమ కోసం జీవించాలి. ఆ జీవించడానికి ధైర్యం కావాలి.
వినోద్ ఖన్నా రెండో భార్య ఏమంటారంటే..?
వినోద్ చాలాకాలం క్రితం నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లుతున్నట్టనిపించేది. ఆ ఆసక్తి ఆయనలో కనిపించేది. సరిగ్గా వినోద్ తన 17 ఏళ్ల వయస్సులోనే ముంబైలోని స్ట్రాండ్ బుక్ స్టాల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకం కొని రాత్రంతా మేల్కొని చదివాడు. అలాగే, జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలు వినడానికి షూటింగ్స్ కు కూడా సెలవు తీసుకునేవాడు.
కలిచివేసిన ఐదుగురు బంధువుల మరణం!
వినోద్ ఖన్నా జీవితంపై.. ఐదుగురు బంధువుల మరణం తీవ్ర ప్రభావం చూపింది. వారంతా ఆయనకు అత్యంత సన్నిహితులు. ముఖ్యంగా తల్లి మరణం తర్వాత ఆయన ఆశ్రమానికి బయల్దేరి సన్యాసం పుచ్చుకున్నాడు. అక్కడి నుంచే ఆ ప్రయాణానికి బీజం పడింది. అలా ఆశ్రమంలో ఉంటూనే కొంతకాలం సినిమాల్లోనూ పనిచేశాడు.
అప్పటికే సైన్ చేసిన సినిమాలన్నింటినీ ఓవైపు ఆశ్రమంలో ఉంటూనే.. మరోవైపు వచ్చి పూర్తి చేశాడు. అందులో హేరా ఫేరీ, కుర్బానీ వంటి సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి.
ఆశ్రమంలో కూడా చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు ఖన్నా. పూణేలోని ఆశ్రమంలో ఆయనకు కేవలం నాల్గు అడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవుతో ఓ చిన్న గది మాత్రమే ఉండేది. ఓ పక్క చిన్న మంచం.. వంగి పడుకోవాల్సి వచ్చేంత రూమ్ అది. ఆ తర్వాత ఒరెగాన్ కు వెళ్లిపోయారు.
కెమెరా ముందు యాక్షన్.. కెమెరా వెనుక ధ్యానం!
డైరెక్టర్ కట్ చెప్పి రెడీ వన్ టూ త్రీ అనగానే… కెమెరా ముందు యాక్టింగ్ చేసేవాడు. కెమెరా వెనక్కి రాగానే మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయి.. ధ్యానం చేసేవాడు. ఆశ్రమంలో ఓషో వద్ద మొక్కలకు నీళ్లు పెట్టి.. మొక్కలు నాటే తోటమాలిగా కూడా పనిచేశాడు ఖన్నా.
ఆ తర్వాత ఆశ్రమాన్ని మళ్లీ ఎందుకు వదిలేశాడు..?
తాను అనుకున్నది లభించింది. ఇంకా ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఎప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించాలని కాదు.. తన మనసుకు శాంతి కోసం మాత్రమే ఆశ్రమ బాట పట్టాడు ఖన్నా. అంతర్గత వికాసం కోసం వెళ్లాడు. కోలాహలంగా కనిపించే అంగట్లో కూడా బుద్ధుడిలా ప్రశాంత వదనంతో ఉండగల్గే స్థితప్రజ్ఞతే ఆధ్యాత్మికత అన్నది ఖన్నా మాట.
ఖన్నా స్నేహితుడు కబీర్ బేడీ ఏం చెప్పాడు..?
కబీర్ బేడీ ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓసారి ఈ విషయాలు పంచుకున్నారు. వినోద్ ది తాత్విక స్వభావం. ఓషో అంటే గొప్ప భక్తి. నాకు కూడా ఓషోపై అపారమైన గౌరవం. కానీ, నేను మాత్రం ఎప్పుడూ వెళ్లి కలవలేదు. అప్పుడప్పుడూ బాధపడుతుంటాను.
ఆ సందర్భంలో వైల్డ్ వైల్డ్ కంట్రీ అనే డాక్యుమెంటరీ గురించి కూడా కబీర్ బేడీ మాట్లాడారు. ఆ డాక్యుమెంటరీ ఓషో జీవితంలోని ఓ దశను మాత్రమే చూపించింది. ఆయన్ని గురువుగా,. తత్వవేత్తగా పూర్తిగా చూపించలేదు. అందుకు, ఆశ్రమంలో చోటుచేసుకున్న కొన్ని దురదృష్టకర ఘటనలు కూడా కారణమే. ఈ డాక్యుమెంటరీ మొత్తం ఓషో ఆశ్రమంలో జరుగుతున్న ఆకృత్యాలను వెలుగులోకి తీసుకురావడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.
ఐదేళ్ల విరామం తర్వాత ఆశ్రమం వదిలి బాలీవుడ్ కు రీ ఎంట్రీ!
ఐదేళ్ల తర్వాత తిరిగి వినోద్ ఖన్నా ఆశ్రమాన్ని పూర్తిగా వదిలేసి వచ్చేశాడు. 1987లో ఇన్సాఫ్ సినిమాతో తిరిగి బాలీవుడ్ వెండితెరపై మళ్లీ మెరిశాడు. ఆ తర్వాత సూర్య, చాందినీ వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత వాంటెడ్, దంబాంగ్, దబాంగ్ 2, దిల్వాలే వంటి సినిమాల్లోనూ తండ్రి పాత్రల్లో మెరిసి ప్రశంసలందుకున్నాడు.
ఖన్నా గురించి కాస్తా!
2017, ఏప్రిల్ 27న క్యాన్సర్ తో పోరాడుతూ వినోద్ ఖన్నా కన్నుమూశారు. 1946, అక్టోబర్ 6న పెషావర్ లో పుట్టిన ఖన్నా కుటుంబం ముంబైకి వలస వచ్చింది. ఆయన విద్యాభ్యాసం ముంబై, నాసిక్ లో సాగింది. మొట్టమొదట క్రికెటర్ కావాలనుకున్నా.. ఆపై నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నటుడిగా వెళ్తానన్నప్పుడు తన తండ్రి కృష్ణచంద్ తో తీవ్రంగా విభేదించాడు. సునీల్ దత్ చొరవతో 1968లో మన్ కా మీట్ తో సినీ రంగానికి పరిచయమయ్యాడు.
వినోద్ ఖన్నా కెరీర్ లోనే అచానక్ ఓ స్పెషల్ మూవీ. కే.ఎమ్. నానావతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మేజర్ రణజీత్ గా ఖన్నా ప్రేమ, మోసం, విమోచన మధ్య నడిచే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ కాలంలోనే పాటల్లేకుండా వచ్చిన అరుదైన భారతీయ చిత్రమిది.
హిందీ చిత్రసీమలో 1960-70 మధ్య పూర్తిగా మారుతున్న కాలమది. దేవానంద్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ త్రయం ప్రధాన హీరోల నుంచి ఇతర పాత్రలకు మారుతున్న సమయమది. అప్పటికే రాజేంద్రకుమార్, షమ్మీకపూర్, మనోజ్ కుమార్ కూడా తమ పాత మాయాజాలాన్ని సృష్టించలేకపోతున్న కాలం. అలాంటి సమయంలో జితేంద్ర, రాజేశ్ ఖన్నా, ఫిరోజ్ ఖన్నా నిలదొక్కుకుంటున్నారు. అదే సమయంలో ధర్మేంద్ర, శశికపూర్ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. అప్పుడే మెల్లిగా రంగప్రవేశం చేసిన భవిష్యత్ సూపర్ స్టార్సే.. అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా, అందగాడైన వినోద్ ఖన్నా. వీరు ముగ్గురూ కలిసి ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు బాక్సాఫీసును, ప్రేక్షకుల హృదయాలను ఏలారు. శత్రఘ్ను సిన్హాతో పాటు.. వినోద్ ఖన్నా కూడా ముందు విలన్ పాత్రలతో ఎంటరై.. ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డాడు. ఆయన మరణానంతరం చిత్రసీమలో గొప్పగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వినోద్ ఖన్నాకు దక్కింది.
జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ప్రెడిక్ట్ చేయడం కూడా ఒక్కోసారి కష్టమేనన్నది వినోద్ ఖన్నా లైఫ్ స్టోరీ చెప్పే పాఠం
ఏప్రిల్ 27 వినోద్ ఖన్నా పుట్టినరోజు!.



