సంగీతం వినటానికే కాదు.. చూడటానికీ ఇంపు అని నిరూపించాడు!

వర్డ్స్ ఆర్ బ్రిక్ వర్క్… ఫోటోస్ ఆర్ విండోస్ ఇదీ రఘురాయ్ మోటో!

విషాదమైనా, విచిత్రమైనా, వివేకమైనా, క్రీడలైనా… వాటిని తన ఫోటోలతో శాశ్వతం చేసిన థర్డ్ ఐ రఘురాయ్. అలాంటి రఘురాయ్ సంగీతానికి అభిమాని. ఓ మంచి శ్రోత. ఆ శ్రోతకు.. తనలోని ఫోటోగ్రాఫర్ ను జోడించి.. సంగీతజ్ఞులనూ శాశ్వతం చేశాడు.

దివంగతులైన సంగీత కళాకారులు వెళ్లిపోయినా వారి సంగీతాన్ని ఆడియో, వీడియో రూపాల్లో మనం వింటూ, చూస్తూ తల్చుకుంటూనే ఉంటాం. కానీ, వాటిని కెమెరా పెట్టెతో బంధించి.. అందమైన ఫోటోలుగా ప్రపంచం ముందుంచి వాటికి శాశ్వతత్వమిచ్చారు రఘురాయ్.

రఘురాయ్ కి స్వతహాగా సంగీతకారుడిగా కావాలనే కోరికా ఉండేదంటూ కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. కానీ, ఆయన కెమెరాతో తన క్రియేటివ్ థర్డ్ ఐకి పనిచెప్పారు. అయినా, ఆయన్ను సంగీతం వీడలేదు.. ఆయన సంగీతాన్నీ విడిచిపెట్టలేదు. 1960ల కాలం నుంచి మొదలుకుని.. ముఖ్యంగా 1980ల్లో ఇండియా టుడేలో పనిచేస్తున్న సందర్భంలో ఆయన ఓ పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అదేంటంటే 20వ శతాబ్దంలో సంగీతాన్ని భుజానికెత్తుకున్న హిందుస్థానీ, కర్నాటక క్లాసికల్ మ్యూజిషియన్స్ అందరినీ తన కెమెరాతో బంధించి వారికి తన ఫోటోలతో కూడా మరింత శాశ్వతత్వం ఇవ్వాలన్నదే ఆ తలంపు.

అలా పండిట్ రవిశంకర్ నుంచి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, అలీ అక్బర్ ఖాన్, బిస్మిల్లా ఖాన్, విలాయత్ ఖాన్, కిషోరీ అమోంకర్, భీమ్ సేన్ జోషి, పండిట్ జస్రాజ్, కుమార్ గంధర్వ, మల్లికార్జున్ మన్సూర్, ఎస్. బాలచందర్, హరిప్రసాద్ చౌరాసియా, అల్లారఖా ఖాన్, జాకీర్ హుస్సేన్ వంటివారెందరినో ఛాయాచిత్రాలుగా నిక్షిప్తం చేశాడు. వేదికలపైనే కాదు.. మనం కొన్ని ఫోటోలు చూస్తుంటే అల్లారఖా ఖాన్, జాకీర్ హుస్సేన్ తో కలిసి తబలా వాయిస్తూ మైమర్చిపోయే స్టిల్ అయినా… ఎం.ఎస్ అమ్మ తన్మయత్వపు ఫోటోలైనా వాళ్ల ఇళ్లల్లోనూ.. వారు వారి గురువులతో ఉన్నప్పుడూ కెమెరాకెక్కించి.. వారి ఆలాపనలు, వారి సరదా ముచ్చట్లు, నవ్వుల పువ్వులనూ ఫోటోలుగా మల్చాడు.

మనం చెప్పుకుంటున్న సంగీతకారులు చాలామంది ఇవాళ లేరు. కానీ, వారందించిన సంగీతం ఆడియోలు, వీడియోల రూపంలో వింటున్నాం. అలాగే, వారి ఫోటోలనూ చూస్తున్నప్పుడు అందులో టాప్ మోస్ట్ ఫోటోస్ ఎక్కువలో ఎక్కువ రఘు రాయ్ టేకింగే.

రంగుల కలలు కనే ఓ రసికుడైన శ్రోతకు… నలుపు, తెలుపుల విలువ కూడా తెలిసినప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుందో.. ఆ ఎఫెక్ట్సే రఘురాయ్ సంగీతకారులను బంధించిన ఫోటోల్లో మనకు కనిపిస్తుంది.

కర్నాటక, హిందుస్థానీ సంగీతకారులకు సంబంధించి రఘురాయ్ తీసిన ప్రతీ ఫోటో ఆకట్టుకుంటుంది. ఒక శిష్యుడు ఒక గురువును ఎలా ఆరాధిస్తాడో ఆ విధంగా దివంగత గొప్ప సంగీత కళాకారుల చిత్రాలను ఆయన బంధించి వాటిని శాశ్వతం చేశారు. అందుకే, రఘురాయ్ కెమెరాకెక్కిన మనం చెప్పుకున్న సంగీతకారుల ఫోటోలన్నీ ఎంతో ఆత్మీయంగా మనల్ని పలకరిస్తాయి. కాస్సేపు దృష్టిని తదేకంగా తమవైపు ఆకర్షిస్తాయి. అందులోని స్టోరీ ఎంటో ఆలోచించేలా చేస్తాయి.

బయటకు వినిపించాల్సిన తనలోని సంగీతాన్ని… కెమెరాలో బంధించి ఫోటోల్లో చూపించిన నేర్పరి రఘురాయ్. ఎందరో గొప్ప సంగీతకారులను ఫోటోలతో శాశ్వతం చేసిన రఘురాయ్.. ఇప్పుడు వారివద్దకే చేరుకోవడం విధి ప్రక్రియలో ఓ భాగం. శాశ్వతత్వమిచ్చిన ఫోటోలతో తానూ ఆ ఫోటోలు చూసినప్పుడల్లా గుర్తొచ్చే శాశ్వతత్వాన్ని పొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles