ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ.. అక్కడి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో కీలకపాత్ర పోషించిన ఓ అద్భుతమైన అణు భౌతిక శాస్త్రవేత్త గురించి కాస్త చెప్పుకోవాలి. ఆయన కేవలం ఓ భౌతిక శాస్త్రవేత్తే కాదు… ఓ సన్యాసి. హిమాలయాల్లోో జీవితాన్ని గడిపి.. ఆ తర్వాత అణు భౌతిక శాస్త్రవేత్తగా ప్రపంచాన్నే అబ్బురపర్చిన అనన్య సామాన్యుడు.
స్వామి జ్ఞానానంద… ఉరఫ్ భూపతిరాజు లక్ష్మీనరసింహ రాజు… హిమాలయాల్లో దశాబ్దం పాటు తపస్సు చేసిన ఓ సన్యాసి… ఆ తర్వాత తన అణు భౌతిక శాస్త్ర పరిశోధనలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చిన సైంటిస్ట్.

భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు మన తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్ వాసి. చిన్న వయస్సులోనే సాధారణ జీవితాన్ని త్యజించి.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. మౌంట్ అబు, రిషీకేశ్ తో పాటు.. హిమాలయ ప్రాంతాల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు మౌనంగా ధ్యానముద్రలో, కఠిన నియమాలతో ఒక తపస్సే చేశారని స్వామి జ్ఞాననంద గురించి చెబుతుంటారు. కానీ, ఒక ఎనిమిదేళ్ల తర్వాత తన గురువు సూచన మేరకు భౌతికశాస్త్ర అభ్యాసం కోసం స్వామి జ్ఞానానంద కాస్తా.. తిరిగి సాధారణ మనిషిగా భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజుగా మారిపోయారు.
ఆధ్యాత్మిక దశ అనంతరం ఆయన యూరప్ కు వెళ్లాడు. డ్రెస్డెన్ లో గణిత, భౌతిక శాస్త్రాలను అభ్యసించాడు. ఆ తర్వాత ఛార్లెస్ యూనివర్సిీలో ప్రొఫెసర్ డోల్షెక్ ఆధ్వర్యంలో హై టెన్షన్, ఎక్స్ రే వంటివాటిపై భౌతిక శాస్త్ర పరిశోధనలు చేశారు. ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ రంగంలో ఆయన చేసిన వినూత్న కృషికి 1936లో డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా కూడా భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజుకు దక్కింది.
ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన ఇంగ్లాండ్ కు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూర్ లో చేరాడు. అక్కడ నోబెల్ బహుమతచి గ్రహీత జేమ్స్ చాడ్విక్ ప్రభావం ఉన్న శాస్త్రీయ వాతావరణంలో ఆయన అణు భౌతికశాస్త్రం, బీటా కిరణాల స్పెక్ట్రోస్కోపీపై మళ్లీ పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలకుగాను ఆయనకు పీహెచ్డీ లభించింది.
తదననంతరం అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ లో బీటా రే స్పెక్ట్రోస్కోపీ, రేడియోధార్మిక ఐసోటోపులపై పరిశోధనలు చేశారు. అదే సమయంలో హై వాక్యూం టెక్నాలజీపైన ఓ పుస్తకాన్నీ రచించారు.
1947లో ఇండియాకు తిరిగొచ్చిన స్వామి జ్ఞానానంద.. నేషనల్ ఫిజికల్ లేబోరేటరీలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా పని చేశారు. కొన్నేళ్ల తర్వాత 1954లో అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆహ్వానం మేరకు యూనివర్సిటీలో చేరి అణు భౌతికశాస్త్ర పరిశోధనా సదుపాయల అభివృద్ధికి కృషి చేశారు.
స్వామి జ్ఞానానంద నాయకత్వంలోనే 1956, జూలై 1న ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని అధికారికంగా ఆరంభించారు. ప్రొఫెసర్ గా, విభాగాధిపతిగా ప్రయోగశాలలు నిర్మించారు. విద్యార్థులకు కావల్సిన ఆధునిక పరికరాలు సమకూర్చి, వారిని తీర్చిదిద్దారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను పెంపొందించారు. ఆయన విభాగం నుంచి వందకుపైగా పరిశోధనా పత్రాలు వెలువరించారు. 20 మందికి పైగా డాక్టరేట్ విద్యార్థులను తయారుచేశారు. దాంతో ఆంధ్రా యూనివర్సిటీ భారతదేశంలోనే అణుశక్తి విభాగంలో చురుకైన అణు భౌతిక శాస్త్ర కేంద్రాల్లో ఒకటిగా నిల్చింది.
ఆయన సేవలకుగాను.. ఆంధ్రా యూనివర్సిటీ తన పరిశోధనా కేంద్రానికి స్వామి జ్ఞానానంద లేబోరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అని పేరు పెట్టింది. 1965 వరకు ఆయన తన బాధ్యతల్లో కొనసాగి ఆంధ్రా యూనివర్సిటీకి భవనాలు, పరికరాలే కాకుండా ఒక చిరస్థాయి విద్యా వారసత్వాన్ని అందించారు.
స్వామి జ్ఞానానంద జీవితంల అత్యంత విశిష్ఠమైన అంశమేంటంటే… ఆధ్యాత్మికతను, శాస్త్రీయతను సమన్వయం చేసిన అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. హిమాలయాల్లో ధ్యానముద్ర నుంచి అణు భౌతిక శాస్త్రంలో అగ్రగామి పరిశోధనల వరకూ ఆయన ప్రయాణం… అంతర్ముఖ సాధన, మేథో క్రమశిక్షణ కలగలిస్తే ఎంత గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయో చూపించింది.
యోగా, వేదాంతం, శాస్త్రం – మత సంబంధాల నుంచి మొదలుకుని అణు భౌతికశాస్త్రం, హై వాక్యూం టెక్నాలజీ వరకు అనేక గ్రంథాలు రచించారు. జ్ఞానం అనేది విభాగాలుగా విడిపోయేది కాదని.. సమగ్రంగా అన్వేషించాల్సిందన్నది స్వామి జ్ఞానానంద నమ్మకం.



