ఎచ్చోట కర్మ అచ్చోటే అనే సిద్ధాంతానికీ… చర్యకు, ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ థర్డ్ లాకు ముడిపెట్టి ఒక సినిమా తీయాలన్న ఆలోచన.. దాన్ని అంతే బాగా స్క్రీన్ ప్రెజెంట్ చేయడం NEWTON’S 3RD LAW సినిమా ప్రత్యేకత. సబ్జెక్ట్ ఎంపికతోనే.. రైటర్ కూడా అయిన రాజేశ్ కర్ణ సక్సెస్ మార్కులు సాధించాడు.
సాధారణంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఎవ్వరైనా ఆసక్తి చూపుతారు. కానీ, కొన్ని సినిమాలు పోస్టర్ అలరించినంతగా.. ఆరంభించాక ఆ లోతుల్లోకి తీసుకెళ్లవు. రిమోట్ పట్టుకున్న ప్రేక్షకుడిని మరో ఆప్షన్ వైపు మళ్లిస్తాయి. మరికొన్ని పోస్టర్ చూశాక బాగా అనిపించినా.. నటీనటులు, కొత్తవారు ఉండటంతో చూద్దామా, వద్దా అనే మీమాంసను ముందుంచుతాయి. సరే ఎందుకైనా మంచిది ఓసారి ఆరంభిద్దాం.. బాగా లేకుంటే స్కిప్ కొట్టేద్దామనుకుని స్టార్ట్ చేస్తే సినిమా అయ్యే వరకూ లేవకుండా కూర్చోబెడతాయి. అంత బిగితో ఉందని చెప్పలేను కానీ.. దాదాపు, ఆ రేంజులో మాత్రం సినిమా కాన్సెప్ట్ ను ఒక మెటాఫర్ గా తీసిన రాజేశ్ కర్ణ శైలి నచ్చింది.
ఎందుకంటే, కాస్త సినిమా స్లో మోషన్ విసుగెత్తించినా… క్యారెక్టర్స్ కు ఎంచుకున్నవారంతా సినిమాకు న్యాయం చేశారు. అలాంటివారినే రాజేశ్ ఎంచుకున్నారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, సంగీతమూ ఇలాంటి క్రాఫ్ట్స్… ఒక సినిమా కథను డామినేట్ చేసినా… ఆయా రంగాలవారికి మంచి పేరు తెచ్చి పెట్టవచ్చుగానీ.. ఏ పర్పస్ తోనైతే సినిమా తీశారో ఆ పర్పస్ నెరవేరనట్టే. అలా కాకుండా సినిమాతో మిళితమయ్యే సంగీతం, బీజీఎం, సినిమాటోగ్రఫీ ఉంటే ఆ సినిమా ముఖ్యమైన క్రాఫ్ట్సులో మంచి సమతుల్యత సాధించినట్టు. అది న్యూటన్స్ థర్డ్ లాలో మనకు కనిపిస్తుంది.

ఎవర్నో చంపాలనో, బెదిరించాలనో లోడ్ చేసిన బుల్లెట్… తననే చంపేసిన ఘటనతో పాటు.. రెండు మూడు అలాంటి ఇన్సిడెంట్స్ నే బేస్ చేసుకుని చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో చూపించే యత్నం చేశారు రాజేశ్ కర్ణ.
సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, షెల్లి, త్రినాథ్ వర్మ, గౌతమ్ పండిట్ వంటివారందరూ ఈ సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. అవసరాల శ్రీనివాస్ తన పాత్రను మిగిలిన అందరితో పోలిస్తే మరింత బాగా చేశాడనిపించింది. చాలాకాలం తర్వాత సుమంత్ ను ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చూడటం బాగుంది.
ఎంతో కష్టమవుతుందనుకున్నాంకానీ.. మీరు ఈ పరిశోధనను త్వరగానే పూర్తి చేశారంటూ పోలీస్ ఆఫీసరైన సుమంత్ కు చివర్లో కితాబిస్తారు ఆయన సబార్జినేట్స్. అక్కడ ఆ పోలీస్ అధికారి వేసే ప్రశ్నలే.. మళ్లీ సినిమా సెకండ్ పార్ట్ ఉందనే ముగింపును కూడా ప్రతీకలా చెప్పి మొదటి అంకానికి శుభం కార్డ్ వేశాడు దర్శకుడు. ముఖ్యంగా ఏ సినిమా అయినా.. ప్రత్యేకంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ కు స్క్రీన్ ప్లేనే ప్లస్. అలాంటి స్క్రీన్ ప్లేతో… డార్క్ నైట్ లైటింగ్ సినిమాటోగ్రఫీతో ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రాజేశ్ కర్ణ ఈ సినిమాతో ఆకట్టుకున్నారు.
ఈటీవీ విన్ లో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ఫాంలో ఉంది.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేమికులు చూడొచ్చు.



