నినాదం నుంచి వివాదం వరకు! ఏంటి ఈ 150 ఏళ్ల జాతీయ గేయ కథ..?

వందేమాతరం జాతీయ గీతం ఎందుకు కాలేదు?

వందేమాతరం… ఈ జాతీయగేయం.. స్వాతంత్ర్య సమర నినాదం.. ఇప్పుడెందుకు వివాదమవుతోంది..? దీని వెనుక అసలు కథ ఏమిటి..? జాతీయగీతంగా కాకుండా.. జాతీయ గేయమెలా అయింది..?

రెండే పదాలు.. వందే మాతరం.. కానీ స్వాతంత్ర్యోద్యమాన్ని రగిలించాయి. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజల్ని ఒక్కతాటిపైకి తెచ్చాయి. నాటి విప్లవకారుల పెదవులు జపించిన మంత్రమిది. జైళ్ల గోడల మధ్య ప్రతిధ్వనించిన ధైర్యమిది. అయితే, ఇదే పాట స్వాతంత్ర్య భారతదేశంలో ఇప్పుడు ప్రశ్నల్ని కూడా ఎదుర్కొంటోంది.

దేశమాతను స్తుతించిన ఈ గేయంలో అభ్యంతరాలెందుకొచ్చాయి..? మొత్తం పాటకు కాకుండా.. తొలి రెండు చరణాలకే ప్రాధాన్యత ఎందుకు దక్కింది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనమోసారి 150 ఏళ్ల వెనక్కి వెళ్లిరావాలి.

ఓ పాట ఊపిరి పోసుకున్న కాలమది… ఓ దేశాన్ని మేల్కొల్పిన సమయమది!

బ్రిటీషర్స్ కాలంలో ఉన్నతాధికారిగా పనిచేశారు బంకించంద్ర ఛటోపాధ్యాయ. ఈయనే ఈ పాట రూపకర్త. భారతీయ సాహిత్యంలో జాతీయ చైతన్యానికి కొత్త భాషనిచ్చిన రచయిత.

వందేమాతరం 1875, నవంబర్ 7వ తేదీన ప్రచురితమైంది. ఆ తర్వాత దాన్నే బంకించంద్ర తన ప్రసిద్ధ నవల ఆనందమఠ్ లో భాగంగా చేర్చారు. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే.. వందేమాతరంను కేవలం ఓ దేశభక్తి గీతంలా పాడుకుంటే అది పూర్తి అర్థం కాదు. ఈ పాట వెనుక ఉన్న రాజకీయ, సాహిత్య నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

అసలు ఆనందమఠ్ లో వందేమాతరం స్థానం ఏమిటి..?

బంకించంద్ర ఆనందమఠ్ 18వ శతాబ్దంలో బెంగాల్ పరిస్థితులకు చిత్రిక పట్టిన నవల. ఆనాటి కరువు పరస్థితులు, అస్తవ్యస్థమైన రాజకీయాలు, తిరుగుబాట్ల నేపథ్యంలో దేశం కోసం పోరాడే యోధుల కథ. ఆ నవలలో ఆయన వాడిన తల్లి అనే పదం కేవలం ఓ వ్యక్తిగా కాదు.. మాతృభూమి అనే అర్థం. అలా బంకించంద్ర ఊహలో మాతృమూర్తి అంటే మూడు రకాలు.

ఒకప్పుడు సుసంపన్నంగా వెలిగిన తల్లి
బానిసత్వంతో బాధపడ్డ తల్లి
భవిష్యత్తులో శక్తివంతమై మేల్కొనే తల్లి.

అందుకే, వందే మాతరంలో ప్రకృతి వర్ణన కనిపిస్తుంది. పచ్చని పొలాలు, నదులు, స్వచ్ఛమైన గాలి, కొత్త ఆశలను చిగురించేలాంటి పుష్పాల వర్ణన ఇవన్నీ కనిపిస్తాయి. కానీ, చరణాలకు వచ్చేసరికి మాతృభూమి కాస్తా శక్తిగా, జ్ఞానంగా, దేవీ స్వరూపంగా మారిపోతుంది. అదే కొంత వివాదానికి దారితీసింది.

నినాదమై మోగిన పాట!

బంకించంద్ర రాసిన ఈ సాహిత్య గీతం రాజకీయ నినాదంగా మారడానికి మూడు దశాబ్దాలు పట్టింది. 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరం ఆలపించడం ఓ కీలక ఘట్టంగా మారింది. ఇప్పటికీ ప్రభుత్వ చారిత్రక రికార్డుల్లో కూడా ఈ ప్రస్తావన కనిపిస్తుంది.

1905 బెంగాల్ విభజనతో వందే మాతరంకు ఊపు వచ్చింది. బ్రిటీషర్స్ విభజన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ఉప్పొంగింది. అప్పటి జనానికి ఒక భావోద్వేగ భాష అవసరమైంది. అప్పుడు ప్రజల గొంతుల్లో నినదించిందే వందే మాతరం. అయితే, ఒక పాటగానే మిగిలిపోలేదు. సభల్లో, ఊరేగింపుల్లో నినాదమైంది. విద్యార్థుల ఉద్యమాల్లో ప్రతిధ్వనించింది. విప్లవకారులకు ఓ గుర్తింపుగా మారింది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే 1905 స్వదేశీ ఉద్యమం తర్వాత వందే మాతరం భారత జాతీయోద్యమానికి అత్యంత శక్తిమంతమైన సాంస్కృతిక ఆయుధాల్లో ఒకటిగా మారింది.

బ్రిటీషర్స్ ను గడగడలాడించిన గేయం!

పాటేం మనుషుల్ని చంపేసే ఆయుధం కాకపోవచ్చుగానీ… భావోద్వేగాల్ని రగిలించే శక్తి దాని సొంతం. ఇదే బ్రిటీషర్స్ ను భయపెట్టింది. అందుకే వందే మాతరంపై బ్రిటీష్ పాలకులు పలు ఆంక్షలు విధించారు. 1938లో హైదరాబాద్ సంస్థానంలోని విద్యార్థుల వందే మాతరం ఉద్యమం కూడా ఈ పాట రాజకీయ శక్తికి ఓ ఉదాహరణగా నిల్చింది.

మరి వివాదమెక్కడ మొదలైంది..?

పాటలోని తొలి రెండు చరణాలు మాతృభూమి ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తే… తర్వాత చరణాల్లో మాత్రం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి, సరస్వతీని తీసుకొచ్చే భావవ్యక్తీకరణే నాడు కొందరు ఇతర మతస్థులు, మేధావుల అభ్యంతరాలకు కారణమైంది. మాతృభూమిని, భారతమాతను ప్రేమించాలా, గౌరవించాలా అనేదాని చుట్టూ కాకుండా.. మతపరమైన ప్రతీకలపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దాంతో 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రెండు చరణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, నాటి 1937 నిర్ణయమే.. నేటి పాలకులకు వివాదానికి కేంద్రబిందువైంది.

మరి రెండు చరణాలకే ఎందుకు పరిమితం చేశారు..?

ఇది రాజకీయంగా పడ్డ రాజీ మాత్రమే కాదు. అప్పటి జాతీయోద్యమమే ఎదుర్కొన్న ఓ సవాల్. స్వాతంత్రోద్యమమంటే కేవలం బ్రిటీషర్స్ ను తరిమికొట్టడమే కాదు.. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైనులు ఇలా అందరినీ.. వందలాది భాషలు, ప్రాంతాలున్న దేశాన్ని ఒక్కతాటిపై నడిపించడం. ఓ రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడం. అందుకే, అప్పటి నాయకత్వం మధ్యే మార్గాన్నే అనుసరించింది. తొలి చరణాలకు మాత్రమే వందే మాతరం గేయాన్ని పరిమితం చేసింది.

నాటి నిర్ణయం సరైందేనా… లేక తప్పా..?

ఈ ప్రశ్నలపై ఇప్పటికీ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ, 1937లో చారిత్రకంగా ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నదీ ముఖ్యమే.

వందేమాతరం జాతీయగీతం ఎందుకు కాలేకపోయింది..?

1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందాక దేశానికి ఒక అధికారిక జాతీయ గీతం అవసరం పడింది. అప్పటికి వందే మాతరం.. అలాగే, జనగణమన ఈ రెండు పాటలే ప్రజల నోళ్లల్లో నానుతున్నాయి. ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయాయి. వందే మాతరంకు స్వాతంత్రోద్యమంలో విడదీయరాని అనుబంధముంది. కానీ, అదే సమయంలో ఆధునిక బహు మత, బహు భాషా దేశానికి అధికారిక జాతీయ గీతంగా ఏది ఉండాలన్న ప్రశ్నలో మాత్రం జవాబుగా జనగణమననే జాతీయ గీతంగా మారింది.

1950 జనవరి 24వ తేదీన రాజ్యాంగ సభలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ కీలక ప్రకటనతో జనగణమన జాతీయ గీతంగా ప్రకటించారు. దాంతో సరి సమాన స్థానాన్నిస్తూనే వందే మాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. ఇప్పటికీ రాజ్యాంగ సభ రికార్డుల్లో రాజేంద్ర ప్రసాద్ ప్రకటన స్పష్టంగా ఉంది. అంటే జనగణమన నేషనల్ ఆంథమ్.. వందే మాతరం నేషనల్ సాంగ్.

అయితే, వందే మాతరంను జాతీయ గీతంగా ఎంపిక చేయకపోవడమంటే దాని ప్రాధాన్యతను తగ్గించడమేమాత్రం కాదు. జనగణమన కంటే కూడా వందే మాతరం పాత్ర స్వాతంత్రోద్యమ సమయంలో గొప్పది. జనగణమన ఒక దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గీతమైతే.. వందే మాతరం దేశాన్ని ఉద్యమ కాలంలో మేల్కొల్పిన నినాదం. ఒకటి అధికారిక గుర్తింపైతే.. ఇంకొకటి, భారతదేశపు భావోద్వేగం.

2025 తర్వాత మళ్లీ ఎందుకు వందే మాతరం ఇంతగా చర్చల్లోకొచ్చింది..?

2025, నవంబర్ 7వ తేదీతో వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడపునా స్మారక కార్యక్రమాలను ఆరంభించింది. దాంతో పాట చరిత్ర, పూర్తి రూపం, తొలి రెండు చరణాలకే పరిమితమవ్వడం, జాతీయ గీతంగా కాకుండా గేయంగా ప్రకటించడం, జాతీయ గీతానికీ, గేయానికీ మధ్యనున్న తేడా.. ఇలా ఇవన్నీ చర్చల్లోకొచ్చాయి. పార్లమెంట్ చట్టసభల్లోనూ తాజాగా వందే మాతరం వివాదం పెద్ద దుమారాన్నే రేపింది.

చివరి మాట: వందేమాతరం గేయాన్ని కేవలం రెండు పదాలుగా మాత్రమే చూడలేం. వివాదాలకు కేరాఫ్ గా చేయాల్సిన పనీ లేదు. ఎందుకంటే, దీని వెనుక బెంగాల్ సాహిత్య చరిత్ర ఉంది, వలస పాలనకు వ్యతిరేక నిరసన ఉంది, స్వదేశీ ఉద్యమం ఉంది, విప్లవకారుల నినాదం ఉంది, మతపరమైన సున్నితత్వంపై చర్చ ఉంది, భారత జాతీయతను ఎలా నిర్వచించాలన్న పెద్ద ప్రశ్నా ఉంది.

అన్నింటికంటే ముఖ్యంగా వందే మాతరం భారతదేశం స్వాతంత్ర్యం పొందడంలో కీలకపాత్ర పోషించిన గేయమే కాదు.. ఒక దేశంగా ఎలా ఉండాలని ప్రయత్నించిందో చెప్పిన కథ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles