ఒళ్లో పాప… కళ్లల్లో కల! భారత్ తొలి మహిళా ఇంజనీర్ జీవన ప్రయాణమిది!

15 ఏళ్లకే పెళ్లి… 18 ఏళ్లకే భర్త మృతి: ఒడిలో పసిబిడ్డతో భారత్ తొలి మహిళా ఇంజనీర్‌గా ఎదిగిన ఓ లలిత కథ!

15 ఏళ్లకే బాల్యవివాహం. అసలు పెళ్లిముచ్చటంటే ఏంటో తెలుసుకునేలోపే.. 18 ఏళ్లకే భర్త మరణం. అప్పటికే ఓ నాల్గు నెలల పసిబిడ్డ. ఆ కాలంలో సమాజం విధించిన అపరిమితమైన పరిమితుల్లో… ఓ యువ వితంతువుకు ఎదురైన ఓ సవాల్ ఇది. కానీ, నాడు ఆ యువతి ఆ సవాళ్లకు తలవంచలేదు. పొంగుకొస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని.. వాటినే తన బలంగా మార్చుకుంది. చదువొక్కటే వాటన్నింటినీ ఎదిరించే సాధనం, ఆయుధమని భావించింది. అలా ఆమే భారతదేశ తొలి మహిళా ఇంజనీర్ గా చరిత్ర సృష్టించింది. ఆ పేరు అయ్యల సోమయాజుల లలిత.

A. LALITHA

1919 ఆగస్ట్ 27వ తేదీన మద్రాస్ లోని ఓ మధ్యతరగతి తెలుగు కుటుంబంలో పుట్టింది ఈ లలితమ్మ. చిన్నప్పట్నుంచే చదువంటే ఆసక్తి. తండ్రి సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫెసర్. అయినప్పటికీ నాటి కాలపు ఆచారాలు, సంప్రదాయాల ప్రకారమే లలితకు 15 ఏళ్లకే పెళ్లి చేశాడు ఆ పెద్ద మనిషి.

పెళ్లైన ఏడాదికే 1937లో ఆమెకు ఓ కూతురు పుట్టింది. శ్యామల అనే పేరు పెట్టింది. కానీ, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బిడ్డకు కేవలం నాల్గు నెలల వయస్సున్నప్పుడే భర్త మరణించాడు. 18 ఏళ్లకే లలిత జీవితం ఊహించని విషాదాన్నెదుర్కొంది. కానీ, తండ్రి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అలా అర్ధాంతరంగా తన కూతురు జీవితం నాశమైపోకూడదని మథనపడ్డాడు. లలిత తన బాధలు మర్చిపోయి తిరిగి మామూలు మనిషి కావాలంటే ఆమెకు ఆసక్తి ఉన్న చదువల్లో ప్రోత్సహించాలనుకున్నాడు. లలితకు కూడా తండ్రి ఆలోచన నచ్చింది. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలనుకుంది. నాటి పురుషాధిక్య సమాజంలో ఇంజనీరింగ్ చదువాలని నిర్ణయించుకుంది.

1940లో మద్రాస్ లోని సుప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరింది. వందలాది మంది యువకులు, విద్యార్థుల మధ్యలో ఒకే ఒక్క విద్యార్థినిగా లలిత చదువుకుంది. 1943లో ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతదేశ తొలి మహిళా ఇంజనీర్ గా నిల్చింది.

తర్వాత రైల్వే వర్క్ షాప్ లో శిక్షణ పొందిన లలిత.. పరిశోధనా రంగంలో పనిచేశారు. కోల్ కత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో చేరి పలు కీలక ప్రాజెక్టుల్లో భాగమైంది. భాక్రానంగల్ డ్యామ్ వంటి పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ ఆమె భాగస్వామ్యురాలుగా సేవలందించింది.

1964లో న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సులో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించింది.

నాటి సమాజ ధోరణుల్లో ఇంకొంకరికైతే తమ జీవితానికి ఎదురైన సవాళ్లు ఫుల్ స్టాప్ పెట్టేవి. కానీ, లలిత ఆ సవాల్ ను కామాగా మార్చుకుంది. ఓ యువ వితంతువుగా పనైపోయిందనుకున్న దశ నుంచి దేశ తొలి మహిళా ఇంజనీర్ గా ఎదిగిన లలిత ప్రయాణం నేటికీ ప్రతీ మహిళకు ధైర్యం చెప్పే ఓ అసాధారణ గాధ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles