చీనాబ్ బ్రిడ్జ్ విషయంలో ప్రొఫెసర్ మాధవీ లత అనే ఇంజనీర్ ను ఆకాశానికెత్తేస్తూ ఈమధ్య చాలా వార్తలు వైరలైపోయాయి. ఎక్కడ చూసినా ఆమె పేరే ట్రెండైంది. వాస్తవానికి చీనాబ్ వంటి నదిపై రైల్వే వంతెన నిర్మాణమంటే అదే ఏ ఒక్కరి పనో అసలే కాదు. సమిష్ఠి కృషి. కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంతో 17 ఏళ్ల పాటు పడ్డ కష్టానికి.. అదీ ప్రపంచంలోనే ఎత్తైన వంతెన కావడంతో మాధవీ లత పేరు మార్మోగింది.

కానీ, ఇప్పుడు మాధవీలతే తనను ఆకాశానికెత్తుద్దంటూ కోరుతోంది. చీనాబ్ వంతెన నిర్మాణంలో తన పాత్రను పొగుడ్తూ వస్తున్న వార్తా కథనాలతో చాలామంది తనకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని.. వారి కూతుళ్లు కూడా తనలాగా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెబుతున్నారన్నారు. ఇక కొందరు యవతులు కూడా కాల్ చేసి తనలాగే సివిల్ ఇంజనీరింగ్ వైపు రావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు.
కానీ, చీనాబ్ వంతెన నిర్మాణం కేవలం తన ఒక్క తన వల్ల మాత్రమే సాధ్యపడలేదంటున్నారు మాధవీలత. అందుకు ఆ వంతెన నిర్మాణంలో భాగస్వాములైన వేలాది మంది అర్హులని.. తాను కేవలం ఆఫ్కాన్ అనే కన్సల్టెన్సీకి జియోటెక్నికల్ కన్సల్టెంట్ ను మాత్రమేనంటూ ఆమె తనపై వస్తున్న కథనాలు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. వంతెనను వాలుగా నిర్మించే చోట బలంగా స్థిరంగా ఉండేలా చూడటమే తన పని ఆమె వెల్లడించారు.
లింక్డ్ ఇన్ ద్వారా ఆమె తన మనసులో మాటలను పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక చీనాబ్ వంతెనను ప్రారంభించినందుకు ప్రధాని మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన మాధవీ లత… చీనాబ్ ను ఓ ఇంజనీరింగ్ మార్వెల్ గా అభివర్ణించారు. పక్కా ప్రణాళిక, రూపకల్పన, అద్భుతమైన నిర్మాణ కౌశలంతో భారతీయ రైల్వే, ఆఫ్కాన్ కీర్తి గడించాయని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
చీనాబ్ నిర్మాణం వెనుక ఎందరో అన్ సంగ్ హీరోస్ ఉన్నారని.. వేలాది మంది కష్టంతో ఆ వంతెన సాధ్యమైందని.. వారందరికీ తాను వందనం చేస్తున్నానన్నారు మాధవీ లత.
జస్ట్ జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న తన పాత్రను… అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది… మిషన్ వెనుక ఉన్న మహిళ ఎవరో తెలుసా.. అంటూ రకరకాల కథనాలు మీడియాలో హైలైట్ కావడం ఆమెకు ఎందుకోగానీ నచ్చినట్టుగా లేదు. ఎందుకంటే, సమిష్ఠి కృషికి నిదర్శనంలా నిల్చోబెట్టిన వంతెన విషయంలో ఆ క్రెడిట్స్ ఒక్క తనకే అంటగట్టడం సమంజసం కాదనే విషయాన్ని సవినయంగా, మృదువుగా తెలియపర్చే ప్రయత్నాన్ని ఆమె తన పోస్ట్ ద్వారా చేశారు. తనలాగా సివిల్ ఇంజనీరింగ్ ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్టు చాలా మంది ఫోన్ కాల్స్ చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్న మాధవీలత.. తనకు అభినందనలు తెలిపినవారికీ ధన్యవాదాలు తెలుపుతూనే… బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసిన వేల మందిలో తానూ ఒకరినంటూ తన పాత్రను తేలికపర్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం తాను స్పెయిన్ లో ఉన్నానని.. కాబట్టి, అనవసరంగా తనను ఆకాశానికెత్తుతూ కథనాలు వండి వార్చొద్దని.. తన ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూడాలని.. అలాగే, భారతీయ రైల్వేకు ఆ ఘనతను ఆపాదించాలన్న వినమ్రతతో ఆమె పోస్ట్ కనిపించింది.


