ఎస్కోబార్ ఎళ్లిపోయాడు.. వారసత్వం మాత్రం రచ్చ రాజేస్తోంది! ఏంటా ఆందోళన..?

కొలంబియాకు తలబొప్పి కట్టిస్తున్న ఎస్కోబార్ హిప్పోలు!

ఒకప్పుడు మాఫియా డాన్ ఎస్కోబార్ ప్రైవేట్ జూలో ముద్దుముద్దుగా పెరిగిన హిప్పో పోటామసులు… ఇప్పుడు కొలంబియా అడవుల్లో వందల సంఖ్యలో పెరిగిపోయి హడలెత్తిస్తున్నాయి. హిప్పో పోటామసులు సాధారణంగా ఆఫ్రికా నదులు, సరస్సుల వద్దే కనిపిస్తాయి. కానీ, దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మాత్రం అడవుల్లోనూ, పొలాల్లోనూ, నదుల్లోనూ ఎక్కడ చూసినా ఇప్పుడు హిప్పోల సంతతి పెరిగిపోయి విచ్చలవిడిగా కనిపిస్తుండటం ఆందోళకు కారణమవుతోంది.

ఈ హిప్పోల సంతతి అంతలా పెరగడం వెనుక… పరోక్షంగా ఓ మాఫియా డాన్ ఉన్నాడు. అతడే ప్రపంచాన్ని వణికించిన డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కో బార్.

1981లో ఎస్కోబార్ తన ప్రైవేట్ ఎస్టేట్ హడియెండా నాపోలెస్ లో ఓ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అమెరికాలోని ఓ జూ నుంచి నాల్గు హిప్పోలను కొలంబియాకు తీసుకొచ్చాడు. వాటిలో మూడు ఆడవి అయితే, ఒకటి మగ హిప్పో. ఎస్కోబార్ జూలో ఏనుగులు, జిరాఫీలు, జీబ్రాలు, ఆస్ట్రిచుల వంటి ఎన్నో అరుదైన జంతువులుండేవి. 1

1993లో ఎస్కోబార్ పోలీస్ కాల్పుల్లో మరణించిన తర్వాత సీన్ మారిపోయింది!

ఎస్కోబార్ జూలో పెరిగిన వివిధ రకాల జంతువులన్నింటినీ ఇతర జూలకు తరలించారు. కానీ, హిప్పోలను మాత్రం తరలించడం సాధ్యం కాలేదు. అప్పటికే అవి భారీ సంఖ్యలో ఉండటంతో వాటి తరలింపు సవాలుగా మారింది. దాంతో వాటిని అక్కడే వదిలేశారు. అదే నిర్ణయం ఇప్పుడు కొలంబియాకు ఓ పెద్ద పర్యావరణ సమస్యగా పరిణమించింది.

నాల్గు నుంచి వందల్లోకి!

ఎలాంటి నియంత్రణ చర్యల్లేకుండా హిప్పోలు అక్కడే పెరగడం మొదలుపెట్టాయి. పైగా సంతతి పెరుగుతూ పోతోంది. సహజంగానే హిప్పోలు వేగంగా సంతానోత్పత్తి చేసే జంతువులు. దాంతో కొలంబియాలోని నదులు, సరస్సులు, పొలాలు, కొత్త ప్రాంతాల్లోకీ హిప్పోల సంఖ్య విస్తరిస్తోంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం వీటి సంతతి ఏడాదికి సుమారు 9.6 శాతం చొప్పున పెరుగుతున్నట్టు అంచనా. ఈ సంఖ్యను ఇప్పుడు నియంత్రించకపోతే.. 2050 నాటికి వెయ్యికిపైగా హిప్పో పోటామసులు కొలంబియా అడవుల్లో హల్చల్ చేసే పరిస్థితులున్నట్టుగా కూడా పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలి లెక్కల ప్రకారం కొలంబియాలో ఎస్కోబార్ వారసత్వంగా వదిలిపెట్టిన హిప్పోల సంఖ్య సుమారు 170 నుంచి 200 వరకూ పెరిగిందట.

హిప్పోలతో అసలు సమస్యేంటి..?

చూడటానికి అవి అమాయకంగా కనిపించినా… హిప్పోలు భూమిపై ప్రపంచంలోనే అత్యంత పెద్ద సస్తన జంతువులుగా కూడా గుర్తింపు పొందాయి. అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువును సస్తన జంతువు అంటారు. వీటి సంఖ్య పెరిగినాకొద్దీ స్థానికంగా పర్యావరణ వ్యవస్థపై కూడా ఇవి ప్రభావం చూపుతాయి.

ఎలా..?

మంచి నీటి చెరువులు, సరస్సుల్లోకి వెళ్లడం, వాటి విసర్జిత అశుద్ధంతో పాడు చేయడం, పంట పొలాలపై పడటం, మొక్కలను తినడం వంటి చర్యలు స్థానికంగా జల, పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాదు, స్థానికంగా ఉండే ఇతర జంతువులతో ఆహారం, నివాసం, నీటి విషయంలో పోటీ ఏర్పడుతున్న ఉదంతాలూ ఇప్పుడు కొలంబియాలో దృశ్యమానమవుతున్నాయి. అందుకే కొలంబియా ప్రభుత్వం వీటిని ఇన్ వ్యాసివ్ స్పెషీస్ గా పరిగణిస్తోంది. అంటే, తమ సహజ సిద్ధమైన ప్రాంతం కాని చోటకు వచ్చి విస్తరించి, స్థానిక పర్యావరణ వ్యవస్థకు హాని కల్గించే జంతువులన్నమాట.

మానవజాతికీ ప్రమాదమా..?

మనుషులకు కూడా హిప్పోలతో ప్రమాదం పొంచి ఉంది. హిప్పోలు సాధారణంగా దూకుడుగా మారితే మాత్రం ప్రమాదకరమైన జంతువులు. ఇప్పటికే కొలంబియాలోని వ్యవసాయ భూములు, రహదారులు, నదుల సమీపంలో వీటి సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. మన దగ్గర కోతుల సంతతి పెరిగినట్టే… కొలంబియా ప్రభుత్వానికి ఇదో పెద్ద సామాజిక సమస్యగా మారింది.

చంపడమా..? తరలించడమా..? నియంత్రణా…?

ఇవన్నీ ఇప్పుడు కొలంబియా ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు. హిప్పోల సంఖ్యను తగ్గించేందుకు కొలంబియా అధికారులు వేట, శస్త్రచికిత్స ద్వారా స్టెరిలైజేషన్, కెమికల్ కాస్ట్రేషన్, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నారు. కానీ, ప్రతీ మార్గంలోనూ సమస్యలెదురవుతున్నాయి.

2009లో ఓ హిప్పోను చంపిన తర్వాత జంతు హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో హిప్పోలను చంపే చర్యలపై పెద్ద వివాదమే చెలరేగింది. మరోవైపు, హిప్పోలను ఇతర దేశాలకో, అడవులకో, జూలకో తరలించడమూ అంత సులభం కాదు. ఒక హిప్పోను తరలించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. దాని పెద్ద శరీరం, ప్రత్యేకమైన నీటి వసతుల ఏర్పాటు, నిర్వహణ అవసరాలు ఇవన్నీ హిప్పోల తరలింపును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్.. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సమాఖ్య కూడా దీన్ని తలకు మించిన భారంగా పేర్కొంది. దీంతో హిప్పోల నియంత్రణ ఎలా అనే ఓ పెద్ద ప్రశ్న ఇప్పుడు కొలంబియాను వేధిస్తోంది.

డ్రగ్ లార్డ్ గా ప్రపంచాన్ని వణికించిన ఎస్కోబార్ పోయినా.. ఇంకా అతడి హిప్పోల వారసత్వం అతడి పేరుతో కొలంబియాను వణికిస్తోంది. ప్రకృతిని తన ఇష్టానుసారం మార్చుకుని జూనే ఏర్పాటు చేసుకున్న ఎస్కోబార్ చర్యలు.. ఇవాళ నియంత్రణకు అందకుండా కొలంబియాకు తలబొప్పి కట్టిస్తున్నాయి.

ఇంతకీ ఎస్కోబార్ ఎవరు..?

కొలంబియాకు చెందిన పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా… ఈ పేరు ప్రపంచాన్ని వణికించింది. డ్రగ్ లార్డ్ గా పేరుమోసిన ఈ మాఫియా డాన్.. 1970-80వ దశకంలో మెడెలిన్ కార్టెల్ కు నాయకత్వం వహించాడు. కొలంబియాలోని మెడెలిన్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే సంస్థే మెడెలిన్ కార్టెల్. ముఖ్యంగా అమెరికాకు భారీగా కొకైన్ అక్రమ రవాణా చేసే సామ్రాజ్యాన్ని నిర్మించి.. ఆ దేశానికి నిద్ర లేకుండా చేశాడు. ఎస్కోబార్ సంపద బిలియన్ డాలర్స్ కు చేరింది. అదే సమయంలో మాఫియా డాన్ గా మారి కిడ్నాపులు, హత్యలు, బాంబు దాడులు, రాజకీయ హింస వంటివాటితో కొలంబియాలో అల్లకల్లోలం సృష్టించాడు. 1993లో మెడెలిన్ లో పోలీసుల చేతిలో మరణించడంతో.. ఎస్కోబార్ సామ్రాజ్యం పతనమైంది. అయితే, అతడు వదిలిన ఆస్తులు, హిప్పోల వంటి వారసత్వంతో.. ఇప్పటికీ కొలంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మరో అధ్యాయం నడుస్తూనే ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles