చేతిరాత బాగున్నంత మాత్రాన.. తలరాత బాగుండాలనేం లేదు. తలరాత బాగుంటే.. చేతిరాతా బాగుండే అవకాశాలూ లేకపోలేదు. అలాంటి చేతిరాతతో… తన తలరాత మార్చుకుని ఇప్పుడు బాగా పాప్యులరైపోతున్న రైటింగ్ ఎక్సర్ట్ ను కలవాలనుంటే ఓసారి నేపాల్ వరకూ వెళ్లిరావాల్సిందే మరి.

జస్ట్ 14 ఈయర్స్. కంప్యూటర్ డీటీపీ అక్షరాలు ఆమె చేతిరాత చూసి అసూయ పడితే ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. గతంలో వాడిన టైప్ మిషన్స్ అక్కడో ఇక్కడో ఉండి ఉంటే.. అవీ కుళ్లుకుంటే అవాక్కైపోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆమె చేతిరాత ఇప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ గా గుర్తింపబడింది.
ఆమె పేరు ప్రకృతి మల్లా. నేపాలీ. సరిగ్గా 14 ఏళ్ల వయస్సులో ఆమె అసైన్ మెంట్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆమె కాలిగ్రఫీ రైటింగ్ చూసినవారంతా అభినందించలేకుండా ఉండలేకపోయారు. ఇక అప్పటినుంచి ఆమె కాలిగ్రఫీ వార్తల్లో పతాకశీర్షికైంది. ఆ తర్వాత నేపాలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి గత ఏడాది ప్రకృతి అవార్డ్ కూడా స్వీకరించింది.
నేపాల్ ఖాట్మండులోని సైనిక్ ఆవాసియా మహా విద్యాలయాలో 8వ తరగతి చదువుతోంది ప్రకృతి. డాక్టర్ కిర్ స్టెన్ ఫెర్గూసెన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ప్రకృతి కాలీగ్రఫీని షేర్ చేయడంతో… ప్రకృతి పేరు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ లో ఓ ప్రభంజంగా మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ హ్యాండ్ రైటర్స్ లో ప్రకృతి పేరు కూడా చేరిపోయింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 51వ స్పిరిట్ ఆఫ్ యూనియన్ సందర్భంగా.. ఆమె యూఏఈ రాయబార కార్యాలయానికి అభినందనలు తెలుపుతూ రాసిన లేఖ నచ్చిన రాయబార కార్యాలయ అధికార బృందం ఆమె లేఖను ట్వీట్ చేయడంతో… ప్రకృతి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్… ఆమె కాలీగ్రఫీ వెలుగులోకొచ్చాయి.
2022లో ప్రకృతి లేఖ వైరల్ గా మారడంతో… ఆమెకు యూఏఈలో స్పిరిట్ ఆఫ్ యూనియన్ వేడుకను పురస్కరించుకుని వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డును అందించారు.
అయితే, ప్రస్తుత కాలమంతా.. తలరాతను మార్చుకునేందుకు కంప్యూటర్ ను నమ్ముకుని… చేతిరాత కూడా కరువై డీటీపీనే శరణ్యమైన పరిస్థితి. ఇలాంటి రోజుల్లో కంప్యూటర్ రాతతో పోటీ పడుతూ.. ప్రకృతి మల్లా రాత ఇప్పుడు నెటిజనాన్ని ఆకట్టుకోవడంతో పాటు.. బెస్ట్ హ్యాండ్ రైటింగ్ గర్ల్ గా ఆమె ఖ్యాతినొందడంతో… చాలామంది ఆమె హ్యాండ్ రైటింగ్ ను మైక్రోసాఫ్ట్ ఓ ఫాంట్ గా గుర్తించి ఆమెకు సముచిత గౌరవాన్ని కల్పించాలని కోరుతున్నారు.
మొత్తంగా కంప్యూటర్ కాలాన డీటీపీనే నమ్ముకుని హ్యాండ్ రైటింగ్ ను మర్చిపోయినవారు… అసలు కంప్యూటర్ ఉండగా ఇంకా హ్యాండ్ రైటింగ్ తో పనేముందనుకునేవారు.. అసలు నల్గురికి ఎంతో కొంత నేర్పాల్సిన వయస్సు వచ్చినా తమ చేతిరాతను మార్చుకోనివారు… కచ్చితంగా ఓసారి ప్రకృతి మల్లా కథలోకి వెళ్లితే ఒకింత స్ఫూర్తి మరి!



