అభిషేక్–వైభవ్ విధ్వంసం.. టీమిండియా సృష్టించిన టీ20 రికార్డుల సునామీ!
199 పరుగుల లక్ష్యం.. 13.2 ఓవర్లలోనే ఛేజ్!
తొలి ఆరు ఓవర్లలో 118 పరుగులు.. టీ20 చరిత్రలోనే సరికొత్త రికార్డులు
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.
వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. మ్యాచ్ భారత్ చేతుల్లోకి తీసుకొచ్చారు.
అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు బాదాడు. ఇందులో 11 సిక్సర్లు, 9 ఫోర్లు. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే 45 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఈ సీరిస్ లో తనకు దక్కిన ఓ అవకాశాన్ని చేజార్చుకున్నా… ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని తానేంటో చూపించాడు. వీరిద్దరి దూకుడుతో భారత్ పవర్‌ప్లేలోనే 118 పరుగులు సాధించింది . పురుషుల టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఆరు ఓవర్లలో ఇదే అత్యధిక జట్టు స్కోరు.

6 ఓవర్లు.. 118 పరుగులు!
టీ20లో పవర్‌ప్లే అంటే సాధారణంగా మొదటి ఆరు ఓవర్లను పరిగణిస్తారు. ఫీల్డింగ్ పరిమితుల కారణంగా ఈ సమయంలో బ్యాటర్లకు పరుగులు రాబట్టే అవకాశం ఎక్కువ. కానీ భారత్ ఆ అవకాశాన్ని ఏ స్థాయిలో ఉపయోగించుకుందంటే.. మొదటి ఓవర్ నుంచి చివరి పవర్‌ప్లే బంతి వరకు బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 2.2 ఓవర్లలో భారత్ 50 పరుగులు పూర్తి చేసింది. అలా వంద పరుగులు కేవలం ఐదు ఓవర్లలోనే బాదింది. ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 118/0.
పురుషుల టీ20ల్లో తొలి ఆరు ఓవర్లలో 100కుపైగా పరుగులు చేసిన అత్యుత్తమ స్కోరుగా ఇది రికార్డుల్లోకి వెళ్లింది. అంతేకాదు, టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో ఒక జట్టు 100 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన కొత్త రికార్డు కూడా ఈ మ్యాచుతో భారత్ సొంతమైంది.
అభిషేక్.. 35 బంతుల్లో సెంచరీ!
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మరో రికార్డుల పుస్తకాన్ని తెరిచింది. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అభిషేక్ కెరీర్‌లో నాలుగో టీ20 అంతర్జాతీయ సెంచరీ. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విశేషముంది. అభిషేక్ గతంలోనే టీ20 అంతర్జాతీయ మ్యాచులో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసినప్పటికీ, గతంలో తాను చేసిన స్వంత ప్రపంచ రికార్డును అధిగమించలేకపోయాడు. అయినా 38 బంతుల్లో 113 పరుగులతో అతను న్యూజిలాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు.
15 ఏళ్ల వైభవ్.. సీనియర్లతో పోటీ పడుతూ!
ఇక ఈ మ్యాచ్‌లో మరో ఆకర్షణ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వైభవ్.. అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చాడు. వయసులో ఇంకా టీనేజర్. కానీ బ్యాటింగ్‌లో మాత్రం అరివీరభయంకరుడు. కేవలం 18 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 133 పరుగులకు చేరింది. కేవలం ఏడు ఓవర్లలోనే 133 పరుగులు రావడమంటే… టీ20 క్రికెట్‌లో ఎంతటి దూకుడు, ఎలాంటి విధ్వంసమో చెప్పడానికి ఈ స్కోరొక్కటి చాలు.
అభిషేక్, సూర్యవంశీ భాగస్వామ్యం 100కు పైగా పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీల్లో అత్యధిక రన్‌రేట్‌తో నమోదైన భాగస్వామ్యంగా కూడా రికార్డు సృష్టించింది. వీరిద్దరి స్కోరింగ్ రేట్ ఓవర్‌కు 18.13 పరుగులు. గతంలో జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ పేరిట ఉన్న 16.08 రన్‌రేట్ రికార్డును.. అభిషేక్, సూర్యవంశీ భారత్ జోడీ అధిగమించింది.
న్యూజిలాండ్ 198.. భారత్ 199/4
అంతకుముందు న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 198/3 చేసింది. డారెల్ మిచెల్ 52 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 40 పరుగులు చేశాడు. అంటే భారత్ ముందు చిన్న లక్ష్యం ఏమీ లేదు. 199 పరుగులు భారీ లక్ష్యమే. కానీ భారత ఓపెనర్లు దాన్ని లక్ష్యంలా కాకుండా భావించి ఒత్తిడికి గురి కాలేదు. ఓ ఛాలెంజ్‌లా స్వీకరించారు. 13.2 ఓవర్లలోనే భారత్ నాల్గు వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించింది. ఇంకా 40 బంతులు మిగిలుండగానే భారత్ ఇంకా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని ముద్దాడింది.
సీరిస్ కూడా భారత్‌దే
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3–0తో కైవసం చేసుకుంది. అంటే ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ సిరీస్ విజేత ఎవరో తేలిపోయింది. కానీ వెల్లింగ్టన్‌లో భారత్ సాధించిన విజయం కేవలం సిరీస్ విజయం కాదు. టీ20 క్రికెట్ ఎంత వేగంగా మారిపోయిందో చూపించిన మరో ఉదాహరణ. ఒకప్పుడు 200 పరుగుల లక్ష్యం అంటే టీ20లో పెద్ద స్కోర్. ఇప్పుడు అదే 200 పరుగులను 14 ఓవర్లలోపే ఛేదించే దూకుడు కనిపిస్తోంది. అందులోనూ 15 ఏళ్ల కుర్రాడు ఒక వైపు.. తన బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అభిషేక్ శర్మ మరోవైపు.
రికార్డుల హోరు!
వెల్లింగ్టన్‌లో భారత్ సాధించిన ఈ విజయంలో ప్రధానంగా నిలిచిన రికార్డులు ఇవి:
తొలి 6 ఓవర్లలో 118/0 — పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు.
5 ఓవర్లలో 100 పరుగులు — టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యంత వేగవంతమైన జట్టు సెంచరీ.
2.2 ఓవర్లలో 50 పరుగులు — టీ20ల్లో అత్యంత వేగవంతమైన జట్టు ఫిఫ్టీల్లో సంయుక్త రికార్డు.
అభిషేక్ శర్మ — 35 బంతుల్లో సెంచరీ.
అభిషేక్–వైభవ్ — 100+ ఓపెనింగ్ భాగస్వామ్యంలో అత్యధిక రన్‌రేట్: 18.13.
199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో ఛేదించడం.
ఈ ఒక్క మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటింగ్ వేగం ఎక్కడికి చేరిందో ఈ రికార్డులే చెబుతున్నాయి.


