పిల్లల సైకాలజీని పట్టిచూపే సినిమాలు.. క్లోజ్, మాన్ స్టర్!

rama sundari..✍🏼

ఇటీవల రెండు చిన్న పిల్లల సినిమాలు చూశాను. ఒకటి ‘Close’ అనే బెల్జియం సినిమా. రెండు ‘Monster’ అనే జపనిస్ మూవీ. రెండు సినిమాలు మగపిల్లల సెక్సువాలిటీ గురించి సున్నితంగా చర్చించాయి.

మగ పిల్లలు క్లోజ్ గా, స్నేహంగా ఉండటాన్ని మనం మామూలుగా చూస్తాం. ఇద్దరు స్నేహితులు ఒకే నులక మంచం మీద పడుకొని కబర్లు చెప్పుకొంటూ నిద్ర పోవటం చాలా సహజ మనోహరమైన దృశ్యం. ఆడుతూ పాడుతూ తోటల గట్ల మీద పరుగులు పెట్టే స్నేహం, పోటీ పడి సైకిళ్లు తొక్కే స్నేహం, స్కూల్ కు తెచ్చుకున్న అన్నాన్ని, స్నాక్స్ ను పంచుకొనే స్నేహం -ఆహ్లాదంగా ఉంటుంది. చమటలు కారుస్తూ గోళీలాట, గల్లీ క్రికెట్ ఆడుతున్న పిల్లల్ని పెద్దలు ముచ్చట పడుతూ చూస్తుంటారు.అసలు పిల్లలు తల్లిదండ్రుల నుండి కంటే స్నేహంలోనే చాలా నేర్చుకొంటారు. ఎదుగుతారు. వాళ్ల బయట ప్రపంచం స్నేహితులు, వాళ్ల ఇళ్లే కదా.

ఈ రెండు సినిమాలు చూసాక అలా ముచ్చట పడే రోజులు పోయాయని అనిపించింది. మొదటి సినిమా ‘క్లోజ్’ బెల్జియంలో ఒక రైతు కుటుంబం నుండి, ఒక ఉద్యోగ కుటుంబం నుండి వచ్చిన ఇద్దరు పిల్లల స్నేహానికి సంబంధించింది. పిల్లల తల్లిదండ్రులు కూడా స్నేహితులు అవటంతో వాళ్లు అడ్డూ ఆపు లేకుండా కలిసి తిరుగుతుంటారు. రాత్రుళ్లు ఇద్దరూ రెమీ ఇంట్లోనే పడుకొంటూ ఉన్నారు. కిలకిలలాడుతూ స్నేహించే ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్ లో బుల్లియింగ్ చేస్తారు. ‘మీరిద్దరూ లవర్సా?’ అని అడుగుతారు. ‘రెమీ నీ భుజం మీద ఇలా… తల వాల్చాడు కదా’ అని అడుగుతారు అమ్మాయిలు. మొదటి పిల్లవాడు లియో ఆ కామెంట్స్ కు ఇబ్బంది పడతాడు. కావాలని రెమీ కి దూరంగా ఉండటం మొదలు పెడతాడు. అమాయక ముఖంతో రెమీ -లియో వెంట పడుతుంటాడు. ఆ చిన్న మనసుకు తన తప్పేమిటో అర్థం కాదు. ప్రాణ స్నేహితుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. మనసును కలిచేసే విధంగా కథ నడుస్తుంది. ముగుస్తుంది.

రెండో సినిమా ‘మాంస్టర్’ ను మొదటి హర్రర్ సినిమా అనుకొంటాం. కానీ ఇది కూడా చైల్డ్ సైకాలజీకి సంబందించినదే. 5th క్లాస్ చదివే మినాటో, యోరిలు స్నేహితులు. ఒంటరి మహిళ పెంపకంలో మినాటో; తాగుబోతు, అబ్యూజివ్ తండ్రి ఉన్న యోరిలు సహజంగానే దగ్గర అవుతారు. టన్నల్స్ లో ఉండే పాడుబడ్డ ఇళ్లు, బస్సులు వాళ్లకు ఆడుకునే స్థావరాలు. స్నేహానికి, ప్రేమకు ఉన్న సన్నని తెర వాళ్లకు అర్థం అయ్యే వయసు కాదది. ఇతర పిల్లలు, యోరి తండ్రి -యోరి ‘నార్మల్’ గా లేడని ఏడిపిస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో వాళ్లకు అర్థం అయ్యే వయసు వాళ్లది కాదు. చివరకు ఇద్దరూ స్వేచ్ఛా ప్రపంచంలోకి పారిపోతున్నట్లు సింబాలిక్ గా చూపిస్తారు.

రెండు సినిమాల దర్శకులు సబ్జెక్ట్ ను చాలా జాగ్రత్తగా, సున్నితంగా డీల్ చేసారు. అయినా కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. ఎందుకు ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని. వెస్ట్ లో, వెస్టర్నైజ్ అయిన ఈస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా ఈ అంశాలని సినిమాల్లో, సిరీసుల్లో చూపిస్తున్నారు. సమాజాన్ని ఈ విషయంలో సెన్సిటైజ్ చేయటానికి అయి ఉంటుంది. అయితే అంత చిన్న వయసు పిల్లలు తమ సెక్సువాలిటీ గురించి పొరపాటు పడితే? మళ్లీ వెనక్కి రాగలరా? ఏమో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles