K.N. MURTHY..✍🏻
అక్కడ గాలి సుమధురమై వీస్తుంది. ఆ పరిమళాల నడుమ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పయనమో అద్భుతమైన అనుభూతి. ఆ అద్భుత వనానికే.. దేవతల ఉద్యానవనమని పేరు. అక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు.. ఆ ప్రాంతన్నంతా సుగంధభరితంగా మారుస్తాయి. జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే తెరిచి ఉండే.. ఆ ఉద్యానవనాన్ని ఓసారి చూసొద్దామా… ఇంత దూరం నుంచి ఆ సువాసలన గుబాళింపును ఎలాగూ ఆస్వాదించలేనందుకు.. కనీసం అక్షరాల్లో తెలుసుకుందామా..?

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి అంటే.. కేరాఫ్ చలి. అయితేనేం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఇదిగో ఈ జాతీయ ఉద్యనవనాన్ని చూసేందుకు ఆ మాత్రం చలిని తట్టుకోవాల్సిందే. హిమాలయ సానువుల్లో వుండే ఈ పుష్పలోయకు సమీపంలోనే.. హేమకుండ్ సాహిబ్ గురు ద్వారా ఉంది. సిక్కు యాత్రీకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. దీని పరిసరాల్లో బ్రహ్మకమలం, నాగపుష్పం వంటి అరుదైన పూలు విస్తారంగా పూస్తాయి. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది. ఎండాకాలంలోనూ విపరీతమైన చలి, నిరంతర వర్షాన్ని చూడాలంటే.. ఇదిగో ఈ పువ్వలతోటకు రావాల్సిందే మరి.
మేఘం కురిస్తే వర్షమని తెలిసిన మనల్ని.. నేరుగా ఓ మేఘమే ముద్దాడితే…? ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే.. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు ర్యాలీ కట్టాల్సిందే మరి. మనం నడుస్తుంటే మనల్ని తాకూతూ వెళ్లిపోయే మేఘాల నడుమ.. సువాసనల ఈ పూదోట.. ఓ కొత్త బంగారులోకం. సముద్ర మట్టానికి సుమారు నాల్గు వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పూల లోయ.. తూర్పు, పశ్చిమ హిమాలయాల పూల జాతులకు మధ్య ఓ వారధిగా నిలుస్తోంది. ఈ పూల వనం నందాదేవి జీవారణ్య రిజర్వ్ లో భాగం. ఈ ప్రాంతమంతా వ్యాపించిన పూల పరిమళాలు ఏదో మత్తుకు గురిచేస్తాయి. తెలియని తన్మయత్వం మనల్ని ఆవహిస్తుంది
విస్తారంగా ఉన్న పచ్చిక మైదానాల్లో గడ్డి పూల సౌందర్యాన్ని సూర్యకాంతిలో తిలకించడం ఒక అరుదైన అనుభవం, నయనానందకరం. మంచు ముత్యాలతో మిల మిల మెరిసే పర్వత సానువుల అందాలు మాటలకందనివి. తిలకిస్తేనేగానీ అనుభూతి పొందలేనివి. ఆ పూల గుండా వీచే మలయ మారుతాలు మనసుని ఉయ్యాలలూపుతాయి.
జీవితంలో ఒక్కసారైనా చూడదగిన ప్రదేశాల్లో ఈ ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉద్యానవనమొకటి. ఈ వ్యాలీకి చేరుకోవాలంటే.. కొంత శ్రమకోర్వాలి. డెహ్రాడూన్ నుండి జోషిమఠ్ కు రోడ్డు మార్గాన 11 గంటల ప్రయాణం చేసి.. ఆపై గోవింద్‌ఘాట్‌కు మరో గంట ప్రయాణం చేయాలి. లేదా, రిషికేష్ నుంచి కూడా గోవింద్ ఘాట్ కు వెళ్లొచ్చు. గోవింద్‌ఘాట్ నుండి ఘంగారియా వద్ద బేస్ క్యాంప్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి పర్వత మార్గంలో 13-కిలోమీటర్ల (8.1 మైళ్ళు) ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అయితే, అక్కడికి చేరిన క్షణం.. అంతకుముందు గంటలపాటు ఇబ్బంది పెట్టిన ప్రయాణిక బడలిక మంత్రదండం వేసినట్టే మాయమవుతుంది పలు రకాల ప్యాకేజీల్లో వసతి, ఫుడ్ వంటివి అందుబాటులో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పర్యాటకులకు ఓ స్వర్గధామం.



