ఐకమత్యంలోనే కాదు.. ఇంజనీరింగ్ నైపుణ్యంలోనూ చిట్టిచీమలు ఈ సమాజానికి స్ఫూర్తే.
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ అంటూ బద్దెన చెప్పిన లైన్స్.. చీమల ఐకమత్యాన్ని చాటిచెప్పేవైతే.. ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఓ వీడియో వాటి ఇంజనీరింగ్ కౌశల్యాన్ని పట్టిచూపించేది.

నేచర్ ఇంజనీరింగ్ గా అభివర్ణిస్తూ ఆ చీమలకు సంబంధించిన వీడియోపై భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నీటిని దాటడానికి వందాలది చీమలు కలిసి ఓ బ్రిడ్జ్ లాంటింది ఏర్పాటు చేసుకున్న ఆ వీడియో.. వాటి ఐకమత్యాన్ని, ఆ సూక్ష్మజీవుల పెద్దబుద్ధినీ చూపిస్తోంది. నెటిజన్స్ ను విస్మయానికి గురిచేసే ఆ వీడియో X(ట్విట్టర్) లో వైరల్ గా మారింది.
Nature is Amazing అనే X ఖాతాలో నీళ్లను దాటేందుకు చీమలు ఏర్పాటు చేసుకున్న బ్రిడ్జ్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో చిన్న కీటకాలైన చీమల కృషి, వాటి తెలివి, అవి ఎక్కడి నుంచి ఎక్కడి చేరుకోవాలో కచ్చితత్వంతో వాటిలో కనిపించే స్పష్టత, ఒక చీమతో మరొకటి సమన్వయం చేసుకునే తీరు, వంతెన నిర్మించిన విధానం ఇవన్నీ ఆశ్చర్యపరుస్తాయి. అదే సమయంలో స్ఫూర్తి నింపేలా ఉంది ఈ వీడియో.
ఆరులక్షల మంది వీక్షించిన ఈ వీడియో ఇంకా ఇంకా వైరలవుతూ ఉత్సుకతను రేకెత్తిస్తోంది. చీమలు జట్టుగా కృషి చేయడంలో నిష్ణాతులంటూ కొందరు వ్యాఖ్యానిస్తే, మరికొందరు ప్రకృతి ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇంకా కొందరు ఇంకో అడుగు ముందుకేసి.. మనుషుల ఇంజనీరింగ్ నైపుణ్యం కంటే కూడా ఆ చీమల వంతెన నిర్మాణాన్ని, వాటి కౌశల్యాన్ని కొనియాడుతున్నారు. అవి అంత పరిపూర్ణంగా ఒక్కటై అలా పనిచేయడం అసలు నమ్మలేకపోతున్నామంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చీమల ఐకమత్యాన్ని ఈ మానవ సమాజం కల్గి ఉంటే ఇంకెన్ని వండర్స్ సాధించొచ్చో ఆలోచించండంటూ కొందరు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలనే సూచనలు చేస్తున్నారు.
సూక్ష్మజీవుల చాతుర్యాన్ని, బుద్ధి కుశలతను పట్టి చూపే ఈ నేచర్ ఇంజనీరింగ్ వండర్ ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండింగ్ స్టోరీగా మారింది.



