Vamsy Krishna…✍️
ఏవి శంకర్ ? నిరుడు తీసిన చిత్ర సమూహములు
గేమ్ ఛేంజర్ సినిమా చూస్తుంటే నా కెందుకో తెలియదు కానీ తెలుగు మహా కవి శ్రీశ్రీ గుర్తుకొచ్చాడు. శ్రీశ్రీ తన సిప్రాలిలో
కుర్చీలు విరిగిపోతే
కూర్చోవడం మాననట్లు
గొప్ప రచనలు కూర్పు శక్తి నశిస్తే
కూర్చెద నొకింత చెత్త సిరిసిరి మువ్వా అన్నాడు .

జెంటిల్మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు, రోబో లాంటి గొప్ప ప్రజారంజక సినిమాలు తీసిన శంకర్ భారతీయుడు 2 తోనే పాతాళానికి జారిపోతే ఇంకా దిగజారడానికి లోతులేవీ లేని విధంగా గేమ్ ఛేంజర్ తో కూరుకునిపోయాడు.శంకర్ పాత సినిమాల లోని కొన్ని సన్నివేశాలు, కొంత బోయపాటి మార్క్ టేకింగ్ , మరికొన్ని శంకర్ మెరుపులు కలిపి ఒక మిక్సీ లో వేసి రుచీ, పచీ లేని జ్యుస్ తయారు చేసి పైపైన బాదాం తో గార్నిష్ చేసి ప్రేక్షకుడికి అందించినట్టు వుంది.చాలా పాత రొటీన్ కథ . రామ్ నందన్ అనే ఒక ఐ ఏ యస్ అధికారి, చుట్టూ తిరుగుతూ యాంగర్ మేనేజ్ మెంట్ గురించీ, డబ్బు లేని రాజకీయాల గురించీ, ఎన్నికల గురించీ చాలా మాట్లాడుతుంది సినిమా . కానీ ఏదీ ప్రేక్షకుడిని ఆకట్టుకోదు. ఎప్పుడో జెంటిల్మెన్ తీసినప్పుడలా, భారతీయడు 1 లా ప్రేక్షకుడిని మసిపూసి మారేడుకాయ చేయాలి అనుకుంటే కుదరదు. 2025 ప్రేక్షకుడు చాలా దూరం వచ్చేసాడు , కానీ శంకర్ మాత్రం ఇంకా 1990 దశకం లోనే ఉండి అవుట్ డేటెడ్ చెక్ లా మిగిలిపోయాడు .
రంగస్థలం లో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు గా చరణ్ ఆకట్టుకున్నట్టే ఇందులోనూ నత్తి ఉన్న అప్పన్న గా చరణ్ ఆకట్టుకుంటాడు, సినిమాలో బాగున్న అంశం ఏదైనా ఉన్నదా అంటే కేవలం ఆ పది పదిహేను నిమిషాల ఎపిసోడ్ మాత్రమే. ఒక బహిరంగ సభలో ఒక కలెక్టర్, ఒక మంత్రిని చెంపదెబ్బ కొట్టాడు అంటే ఎంత ఎమోషన్ ఉండాలి? ఎంత హైప్ ఉండాలి? నిజానికి ఆ సీన్ సినిమాకి ప్రాణం కావాలి. కానీ శంకర్ చాలా సాదా సీదా గా తీయడం వలన దూది పింజలా తేలిపోయింది. జయరామ్ ఎంత మంచి నటుడు ? అతడికి పాత్ర కి ఏమాత్రం ప్రాధాన్యత లేక కేవలం ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు . వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మనందం , సముద్ర ఖని,సునీల్. నవీన చంద్ర, రాజీవ్ కనకాల , అంజలి, అబ్బో ఎంతమంది నటులో . ఎవరికీ సరి అయిన ప్రాధాన్యత లేదు
కథ రాసిన కార్తీక్ సుబ్బరాజు కాస్త పొలిటికల్ సైన్స్ చదువుకుంటే బావుంటుంది. ఒక జిల్లా కలెక్టర్, మరొక జిల్లా లో అడుగు పెట్టాలి అంటే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి అట. ఏదైనా శాసన సభ లేదా లోక్ సభ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల లోపల ఎన్నికల కమీషన్ ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలి . కానీ ఒక రాష్ట్రానికి ఆరు నెలల కాలం ఉండగానే, ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని అసెంబ్లీ రద్దుకాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు ప్రకటించేసి, కోడ్ అమలు లోకి వచ్చింది అని చెపుతుందా ? ఒక చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫిసర్ లేదా ఎలక్షన్ కమీషనర్ ముఖ్యమంత్రిని ఒక జోకర్ లా చేసి ఆడుకోగలడా ? ఇలాంటి ప్రశ్నలు ఏవైనా సినిమా చూస్తున్నప్పుడు మీకు వస్తాయేమో థియేటర్ కి వెళ్ళేటప్పుడు మెదడు తీసి ఫ్రిజ్ లో పెట్టుకుని వెళ్ళండి
ఒక రామ్ చరణ్ కి నత్తి, మరొక రామ్ చరణ్ కి ఇంటర్మీటెంట్ ఎక్సప్లోజివ్ డిస్ ఆర్డర్, సునీల్ మనిషి స్ట్రెయిట్ గా ఉంటాడు కానీ స్ట్రెయిట్ గా నడవలేడు. ఎప్పుడూ పక్క పక్కగా నడుస్తాడు. అంజలి పక్క చూపులు తప్పిస్తే స్ట్రెయిట్ గా చూడలేదు. ఇలా విభిన్నంగా ఉండటమే సినిమాలో వైవిధ్యం అని శంకర్ అనుకున్నట్టుంది.
ఇంతోటి సినిమా తీయడానికి మూడేళ్ళ సమయం , 350 నుండి 400 కోట్ల బడ్జెట్ . ఈ ఖర్చు రాబట్టుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు
టికెట్ ధరలు పెంచడం. ఆహా తెలుగు సినిమా
నేను సినిమా చూసి బయటకు వస్తుంటే ఏవో రెండు న్యూస్ ఛానెల్స్ వాళ్ళు దగ్గరకు వచ్చి కెమెరాలు “సినిమా ఎలా ఉంది సర్” అని అడిగారు. నేను చెప్పడానికి మొహమాట పడుతుంటే నా పక్కనే ఉన్న కుర్రాడు మైక్ అందుకుని ” సినిమా సూపర్. లక్ష కోట్లు వసూళ్లు గ్యారంటీ ” అని గట్టిగా అరచి రెండడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి నా వంక చూస్తూ కన్ను కొట్టి నవ్వేశాడు..🤣



