మగ భానుమతి అనరెందుకు?
Hemachandar Kolipaka.. ✍🏻
సెప్టెంబర్ 7 భానుమతి జయంతి!
కర్తవ్యం సినిమా బ్లాక్‌బ్లస్టర్ తర్వాత నటి విజయశాంతిని లేడీ అమితాబ్ అని సినీ మీడియా పేర్కొంది. అటు నటనలోను, ఇటు దర్శక, నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన పురుష పుంగవులను ‘మగ భానుమతి’ అని సినీ జర్నలిస్టులు ఎందుకు రాయరు? పురుషాధిక్య భావజాలమే కారణమా?
వెండితెరపై నటిగా కనిపించిన భానుమతి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. వరవిక్రయంతో సినీరంగ ప్రవేశం చేసి, ఎన్టీఆర్, ఏఎన్నార్ల ముందు తరాల నుంచి తర్వాత తరాలతో కూడా నటించారు. పాత్రను పూర్తిగా అవగాహన చేసుకుని పరకాయ ప్రవేశం చేయడం ఆమె నటన రహస్యం. ఇతర నటులను డామినేట్ చేస్తారన్న ప్రచారం ఉన్నా, ఆమె కొట్టి పారేసారు.

14 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. తొలి చిత్రం చండీరాణి (1953). సుమారు ఏడు దశాబ్దాల ముందు విడుదలైన ‘చండీరాణి’ బహుభాషా చిత్రానికి దర్శకత్వం వహించమే కాకుండా, అందులో ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా కథ కూడా ఆమె సొంతం. భానుమతి ‘చండీరాణి’ రికార్డును ఇంతవరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. అన్నట్టు పెద్ద ఎన్టీయార్ నటించిన త్రిభాషా చిత్రం కూడా ఇదే. జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా గుణశేఖర్ దర్శకుడిగా రూపొందిన బాల రామాయణంలో అందరూ పిల్లలే. దానికి కొన్ని దశాబ్దాలకు పూర్వమే అందరూ బాల నటీనటులతో, రూపొందించిన ‘భక్త ధ్రువ – మార్కండేయ’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో పాటు కళా దర్శకత్వ, ఎడిటింగ్ శాఖలతో పాటు దర్శకత్వం వహించడం భానుమతికే చెల్లింది.
కథానాయికగానే కాదు, క్యారెక్టర్ యాక్టర్‌గా నటించినా ఆమెకు నచ్చిన విధంగా పాత్ర, సంభాషణలు మార్చుకునేందుకు నిర్మాత, దర్శకులు అంగీకరించేవారు. ఆమె చేసే మార్పులు ఆ పాత్రకు, సినిమాకు వన్నె తెస్తాయన్నది నిజం.
తెలుగు సినిమాల్లో 70వ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన కథానాయకుడు చలం. ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో చలంకు తల్లిగా భానుమతిని నటించాలని అడిగితే నిరాకరించారు. తల్లిపాత్రకు పరిమితులుంటాయని, వదినగా అయితే పాత్ర రాణిస్తుందని ఆమె చెప్పారట. ఆ సినిమా స్క్రిప్ట్ ఆమెకు ఇచ్చి నచ్చిన మార్పులు చేసుకోవాలని హీరో చలం చెప్పారట. ఆ విధంగా మార్పులు చేసుకుని నటించినట్లు భానుమతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లకన్నా సీనియర్ భానుమతి. అందుకని తొలి రోజుల్లో భానుమతితో నటించేటపుడు బెరుకుగా ఉండేదని స్వయంగా అక్కినేని చెప్పుకున్నారు.
పెద్దలంగీకారంతో ప్రేమపెళ్లి!
తాను నటిస్తున్న చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న
రామకృష్ణను ఆమె ప్రేమించారు. వారి వివాహానికి భానుమతి తండ్రి బొమ్మరాజు వేంకట సుబ్బయ్య పంతులు అంగీకరించలేదు. రామకృష్ణ బంధువురాలు కమలమ్మ గారి పెద్దరికంలో 1943లో వారి వివాహమైంది. రామకృష్ణతో వివాహమైన తర్వాత ‘భరణీ’ పతాకంపై 20 చిత్రాలు నిర్మించారు. భరణి వారి తొలి హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఈ బ్యానర్‌లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లే హీరోలు. ఎన్ని విజయాలు సాధించినా అవి తన సొంతమని ఆమె చెప్పుకోలేదు. సినిమా విజయం సమష్టి కృషిగా చెప్పుకోవడం ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
ఆత్మాభిమానం మెండు!
మిస్సమ్మ చిత్రషూటింగ్‌లో ఓ ఘటనతో అందులో అవకాశాన్ని కోల్పోయారు. అయితే, ఆమె ఆత్మాభిమానం పక్కన పెడితే ఆ చిత్రంలో ఆమె కొనసాగేవారు. మద్రాసులో పిఠాపురం రాజావారి బంగ్లాలో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫంక్షన్‌లో పలువురు గాయకులు పాడారు. ఆ కార్యక్రమంలో భానుమతిని పాట పాడమని నిర్వాహకులు కోరితే, తాను అప్పుడు పాడనని ఆమె తిరస్కరించారు.
సంగీత సంప్రదాయ కుటుంబానికి చెందిన భానుమతి చిత్రాల్లో త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఏదో ఒక సంప్రదాయ గీతం ఉంటుంది. సినిమాల్లో ఒక సంప్రదాయ గీతం ఉండేలా చూడాలన్న తన తండ్రి సూచనను పాటించినట్లు ఆమె తెలిపారు. సినిమాల్లో తాను పాడినన్ని త్యాగరాజ కీర్తనలు ఇంకెవరూ పాడలేదని చెప్పారు. స్వర్గసీమ సినిమాలో చిత్తూరు నాగయ్యగారు సంగీతంలో భానుమతి పాడిన ఓహోహో పావురమా పాట కోసమే పదుల సంఖ్యలో ఆ సినిమా చూసినట్లు గత తరం తమిళ నటుడు శివాజీగణేశన్ చెప్పారు. చక్రపాణి, చింతామణి చిత్రాలకు సంగీతదర్శకత్వం వహించారు.
ఓ ఉద్యోగం లాగే!
సుదీర్ఘ నటజీవితంలో ఎన్నో అవార్డులు వరించినా, భానుమతికి నటన ఇష్టం లేదు. నటి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత, రచయిత్రి ఇలా ఎన్నింటిని విజయవంతంగా నిర్వహించినా రచన తనకు ఇష్టమని చెప్పారు. ఆంధ్ర పత్రికకు ఆమె రాసిన కథకు ఆమెకు 20 రూపాయల పారితోషికం పంపించారు. సినిమాకు లక్ష రూపాయలు తీసుకునే భానుమతికి రూ.20 పంపించేందుకు ఆంధ్రపత్రిక యజమాని శంభుప్రసాద్ జంకారు. కానీ, ముళ్లపూడి రమణ ఒత్తిడితో పంపించారు. ఆ నగదు అందుకున్న తర్వాత ఆమె ఫోన్ చేసి, ఆ డబ్బు ఎలా ఖర్చుపెట్టారో చెప్పారట.
తాను నటన ఒక ఉద్యోగంలాగే చేసానని అంటారు. షూటింగ్ పూర్తయి ఇంటికి వచ్చాక, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన ఓ మధ్యతరగతి గృహిణి ఇంట్లో పనులు ఎలా చేసుకుంటుందో, తానూ అలాగే చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం సినీ, టీవీ నటీమణులు తెరపైనే బొట్టు, చీరతో నిండుగా కనిపిస్తారు. బయట కార్యక్రమాల్లో ఎక్కువ మంది మోకాలిపై దుస్తులతో జుట్టువిరబోసుకుని నుదుట బొట్టులేకుండా కనిపిస్తారు. కానీ తిరుగులేని స్టారిణిగా వెలిగిన రోజుల్లో కూడా భానుమతి శ్రావణ శుక్రవారాల్లో షూటింగ్‌కు కాళ్లకు, ముఖానికి పసుపు రాసుకుని వచ్చేవారట.
కాస్టింగ్ కౌచ్‌పై!
మహిళల వ్యక్తిత్వం, ఆత్మాభిమానం వంటి మాటలు భానుమతి చెప్పలేదు. ఎదుటి వారిని హద్దుల్లో ఎలా ఉంచాలో చేతల్లో చూపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులు కూడా ఆమె సమక్షంలో ఒద్దికగా ఉండేవారు. ప్రస్తుతం సినీరంగానికి మచ్చగా తయారైన క్యాస్టింగ్ కౌచ్‌ను కట్టడి చేయాలంటే భానుమతిలా ప్రవర్తించాలి. ప్రస్తుత సినిమాల్లో ఆడదాన్ని ఆటబొమ్మగా, వ్యాంప్‌గా చూపించడం బాధాకరమని భానుమతి ఆవేదన వ్యక్తం చేసారు. కథల్లేని సినిమాలు రావడం వల్లే మహిళలకు నటన చూపే పాత్రలు లభించడం లేదని అభిప్రాయపడ్డారు.
తమిళులు అష్టావధానిగా కీర్తించే భానుమతి మూడు సార్లు జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు, ఏయూ గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ, తమిళ ప్రభుత్వం నుంచి కలైమామణి బిరుదుతో పాటు, రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.
భారతీయ చలనచిత్ర శతవసంతాలు పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 50 పోస్టల్ స్టాంపుల్లో భానుమతి ఒకరు. సినీపరిశ్రమలో ఎంత గొప్పవారైనా ఆమె స్థాయిలో ప్రతిభ కనబర్చలేదు. మరి మగ భానుమతి అని ఎలా పిలవగలం? ఎవరినీ పిలవలేం. ఎందుకంటే, ఆ స్థాయి ఎవరికీ లేదు కాబట్టి!



