ఎలక్ట్రానిక్ మీడియాలో టెలివిజన్ జర్నలిజాన్నీ… పిల్లల కోసం రూపొందించే వినోదాత్మక కార్యక్రమాలను విప్లవాత్మకంగా మార్చినవాళ్లల్లో టెడ్ టర్నర్ పేరు తప్పకుండా చెప్పుకోవాలి. 87 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన టెడ్ టర్నర్… ప్రఖ్యాత టెలివిజన్ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు.
సీఎన్ఎన్ అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్. ప్రపంచ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న డైనమిక్స్ ను అందిపుచ్చుకుని ఒకవైపు న్యూస్ ఛానల్ తో పాటు.. మరోవైపు కార్టూన్ నెట్వర్క్ ను ఆరంభించారు టెడ్ టర్నర్. ప్రపంచంలోనే తొలి 24 గంటల ఇంగ్లీష్ వార్తా ఛానల్స్ లో ఒకటిగా నిలిపి… ఆ తర్వాత భారతీయ టెలివిజన్ రంగంలో 24 గంటల కార్టూన్ ఛానల్ ఏర్పాటు చేసి… టర్నర్ ప్రపంచ టెలివిజన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

భారతదేశంలో కార్టూన్ నెట్వర్క్ తో టెలివిజన్ పై పిల్లల్లో నెలకొన్న ఆసక్తి!
- 1995, మే 1వ తేదీన భారతదేశంలో కేవలం పిల్లల కోసమే ఉద్ధేశించిన తొలి కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఆరంభమైంది. అంతకుముందే ఈ నెట్వర్క్ ను 1992, అక్టోబర్ 1ననే ఈ కార్టూన్ ఛానల్ ను ఇతర దేశాల్లో ప్రారంభించారు టర్నర్. దాంతో ప్రపంచంలోనే తొలి కార్టూన్ నెట్వర్క్ ఛానల్ గా కూడా టర్నర్ కార్యక్రమం రికార్డుకెక్కింది.
కార్టూన్ నెట్వర్క్ ఇండియా ఆరంభ సమయంలో.. హన్నా బార్బెరా సంస్థ రూపొందించిన ప్రసిద్ధ కార్టూన్ షోస్.. ది యోగి బేర్ షో, టాప్ క్యాట్, ది ఫ్లింట్ స్టోన్స్, స్కూబీ డూ వంటి కార్యక్రమాలను ప్రసారం చేశారు. ఆ తర్వాత కాలంలో టామ్ అండ్ జెర్రీతో ఈ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ మరింత పాప్యులారిటీ సంపాదించుకుంది. అప్పుడప్పుడే టెలివిజన్ భారతదేశంలోని గ్రామాల బాట పట్టిన క్రమంలో.. టామ్ అండ్ జెర్రీ చూడ్డానికి పిల్లలు ఎగబడేవారు. ఆ తర్వాత ది పవర్ పఫ్ గర్ల్స్, డెక్స్టర్స్, లాబోరేటరీ, డ్రాగన్ బాల్ Z వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యానిమేటెడ్ సీరిసులను కూడా ఈ ఛానల్ ప్రసారం చేసింది. ఈ షోస్ అన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యేలా భారతీయ భాషల్లోకి అనువదించి ప్రసారం చేయడంతో… సీఎన్ఎన్ కార్టూన్ నెట్వర్క్ భారతీయ కుటుంబాలతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంది.
మరి సీఎన్ఎన్ 24 గంటల వార్తా ప్రసారాల కథేంటి..?
సీఎన్ఎన్ అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్ అని ముందే చెప్పుకున్నాం. ఇది ఒక అమెరికన్ వార్తా మీడియా సంస్థ. అలాగే, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన సీఎన్ఎన్ వరల్డ్ వైడ్ విభాగంలోని ఓ ఆస్తి. ఈ సంస్థను మీడియా వ్యాపారవేత్తైన టెడ్ టర్నర్.. రీస్ షోన్ ఫెల్ట్ తో కలిసి 1980లో జూన్ ఒకటో తారీఖున ఆరంభించారు. ప్రపంచంలోనే 24 గంటలపాటు ప్రత్యక్ష ప్రసారాలు అందించిన తొలి టెలివిజన్ ఛానల్స్ లో సీఎన్ఎన్ కూడా ఒకటిగా నిల్చింది.
గల్ఫ్ యుద్ధ సమయంలో సీఎన్ఎన్ కవరేజ్- దాని ప్రభావం!
1991 గల్ఫ్ యుద్ధ సమయంలో సీఎన్ఎన్ చేసిన ప్రత్యక్ష ప్రసారాలతో భారతదేశంలో ఈ ఛానల్ కు విపరీతమైన గుర్తింపు, ఆదరణ లభించింది. బాగ్ధాద్ నుంచి చేసిన రియల్ టైమ్ ప్రత్యక్ష ప్రసారాలతో.. భారతీయ వీక్షకులకు అంతర్జాతీయ లైవ్ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఆ అనుభూతి సీఎన్ఎన్ తో భారతీయ ప్రేక్షకులను కనెక్ట్ చేసింది. అప్పటివరకూ ఏ సాయంత్రం ఏడుగంటలతో, తొమ్మిది గంటలకో మాత్రమే పరిమితమైన బులెటిన్స్ లో వార్తలు, వార్తా కథనాల కోసమో వేచి చూసేవారికి.. ఆ సంప్రదాయ పద్ధతులను బ్రేక్ చేసి సమయపట్టికలను చెరిపేసింది సీఎన్ఎన్ లైవ్ కవరేజ్. ఉపగ్రహ ఆధారిత 24 గంటల వార్తా ప్రసారాల యుగానికి నాంది పలికి విప్లవాత్మకంగా నిల్చిన టెలివిజన్ గా సీఎన్ఎన్ ది ఓ చరిత్ర.
1990లలో సీఎన్ఎన్ ఆరంభానికి ముందు భారతీయ టెలివిజన్ ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలోని దూరదర్శన్ ఆధిపత్యంలోనే నడిచేది. సీఎన్ఎన్ ప్రత్యక్షంగా యుద్ధ కవరేజ్ ను ఉపగ్రహ టెలివిజన్ ద్వారా చూపించి… దాని ప్రభావం, విస్తృతి ఎంతో భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అసలు బ్రేకింగ్ న్యూస్ ను చూసే విధానాన్నే మార్చేసింది.
సీఎన్ఎన్ నుంచి స్టార్ వరకు.. భారత్ లో సాటిలైట్ విప్లవం!
భారతదేశంలో సీఎన్ఎన్ ప్రాచుర్యం పొందిన కొద్ది కాలానికే.. 1991 డిసెంబర్ లో స్టార్ టీవీ ఆరంభమైంది. ఇది దేశంలోని న్యూస్ ఛానల్, వినోద కార్యక్రమాల రంగంలో మరింత గణనీయంగా మార్చేసింది. మొదటిసారి అంతర్జాతీయ ప్రైవేట్ కార్యక్రమాలు పెద్దఎత్తున టీవీల్లో వీక్షించే అవకాశాన్ని భారతీయ పట్టణ గృహాల్లోకి చేర్చింది స్టార్ నెట్వర్క్.
ఆ తర్వాత భారతీయ మీడియా సంస్థల్లో ప్రధానమైన నెట్వర్క్ 18.. గ్లోబల్ బ్రాడ్ కాస్ట్ న్యూస్ లిమిటెడ్ ద్వారా సీఎన్ఎన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2005, డిసెంబర్ 18న సీఎన్ఎన్- ఐబీఎన్ ఛానల్ అలా ఆరంభమైంది. దీని ద్వారా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సీఎన్ఎన్ బ్రాండ్ నేరుగా భారతీయ టెలివిజన్ ప్రేక్షకుల ఇళ్లల్లో భాగమైపోయింది.
అందుకే ఆ టెడ్ టర్నర్ కు నివాళిగా ఈ రైటప్!



