స్వాతంత్ర్యానంతరం పశ్చిమబెంగాల్ లో మొట్టమొదటిసారి కాషాయజెండా ఎగురడంతో పాటు… మమతతో కలిసి నడిచి.. విభేదాలతో ఆమెనే ఎదిరించిన సువేందు అధికారి ముఖ్యమంత్రి కాబోవడం ఆ రాష్ట్ర చరిత్రలో ఓ విశేషం.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు సువేందు అధికారిని పశ్చిమబెంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. పార్టీ లెజిస్లేచరీ సమావేశంలో అధికారిని శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత షా నుంచి ఆ ప్రకటన చూశాం.

ఇక మిగిలింది మే 9న రేపు శనివారం రోజు బ్రిగేడ్ గ్రౌండ్ లో సువేందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే. కాంగ్రెస్ కంచుకోట బద్ధలై.. వామపక్షాల పుట్టిల్లైపోయిన పశ్చిమబెంగాల్ లో… స్ట్రీట్ ఫైట్స్ తో మమత తరిమేస్తే… 15 ఏళ్లుగా పాలిస్తున్న మమతను ఇప్పుడు కాషాయపార్టీ తరిమేసి 294 స్థానాల్లో 206 సీట్లు గెల్చుకుని.. టీఎంసీని కేవలం 80 సీట్లకు పరిమితం చేసింది.
ఆసక్తికరంగా భవానీపూర్ నియోజకవర్గ ఎన్నిక!
ప్రత్యేకంగా భవానీపూర్ నియోజకవర్గం ఈసారి మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై.. ఆమెతో ప్రయాణించి.. ఆ తర్వాత విభేదించి కాషాయ కండువా కప్పుకున్న సువేందు అధికారి 15 వేల మెజార్టీతో గెలుపొంది రికార్డ్ సృష్టించాడు. గత 2021 ఎన్నికల్లోనూ నందిగ్రామ్ లో మమతపై తలపడి గెల్చిన చరిత్ర సువేందు అధికారిది. నాటి పరిణామమే తృణమూల్ కాంగ్రెస్ కు ఓ పెద్ద ఎదురుదెబ్బైంది. అదే బీజేపీకి ప్లస్ అయింది. నాటి నుంచి సువేందు అధికారి బీజేపీకి ఫేస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గా నిల్చాడు.
పశ్చిమబెంగాల్ లో శ్యామప్రసాద్ ముఖర్జీ కల నెరవేర్చుకునే క్రమంలో బీజేపీ.. సువేందు అధికారినే కీలక పాత్రధారుణ్ని చేసింది. మమతను ఎదిరించి బయటకొచ్చిన సువేందు అధికారే బీజేపీని నిలబెట్టేందుకు సరైనవాడని నమ్మింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతను ఓడించిన తర్వాత ఆ నమ్మకం ఇంకా బలపడింది. అనుకున్నట్టే సువేందు అధికార నేతృత్వంలో బీజేపీ ఈ ఎన్నికల్లో 206 సీట్లతో మేజిక్ ఫిగర్ ను దాటి అతి పెద్ద పార్టీగా అవతరించింది.
సువేందు అధికారి రాజకీయ ప్రయాణం!
మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్లోజ్ అసోసియేట్స్ లో సువేందు అధికారి కీలకమైన నాయకుడు. రాజకీయంగా బలమైన కుటుంబ నేపథ్యముంది. ఈయన తండ్రి శిశిర్ అధికారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. తండ్రిలాగే సువేందు కూడా 1995లో కాంగ్రెస్ పార్టీ నుంచే తన అధికార ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆ తర్వాత 1998లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2006లో కాంతి దక్షిణ్ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.
తృణమూల్ లో సువేందు ఎదుగుదల!
కాలక్రమేణా సువేందు అధికారి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా మారారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమ కాలంలో కీలక నిర్వాహకుడిగా పార్టీ నిర్మించిన ఉద్యమాన్ని నడిపించారు. ఆ ఉద్యమ ఫలితమే 2011లో టీఎంసీని పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి తీసుకొచ్చింది.
2011 టీఎంసీ విజయం సాధించడంతో అధికారి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆయన 2009, 2014 ఎన్నికల్లో తామ్లుక్ నియోకవర్గం నుంచి పోటీ చేసి రెండసార్లు ఎంపీగా గెల్చారు. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక మమత.. సువేందును తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అప్పుడు కూడా నందిగ్రామ్ నుంచే సువేందు ఎన్నికయ్యారు. బెంగాల్ రవాణా మంత్రిగా, మరికొన్ని శాఖల బాధ్యతలను కూడా సువేందు చూశారు. 2017లో ముకుల్ రాయ్ పార్టీని వీడటంతో సువేందు ప్రాధాన్యత మరింత పెరిగింది.
సువేందు టీఎంసీని ఎందుకు వీడాడు..? బీజేపీలో ఎందుకు చేరాడు..?
ఒకప్పుడు మమత వారసుడిగా భావించిన సువేందు అధికారి.. 2020 డిసెంబర్ లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి టీఎంసీని వీడాడు. రెండు రోజులు తిరక్కుండానే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నాడు. మమత అల్లుడైన అభిషేక్ బెనర్జీ ఆధిపత్య ధోరణులతో సువేందు విభేదించాడు. మమత కూడా అల్లుడికే ప్రాధాన్యతనివ్వడం కూడా సువేందుకు ఇక నచ్చలేదు. దాంతో పాటే పశ్చిమబెంగాల్ లో కలకలం రేపిన ఓ హత్య కేసు కూడా జోడవ్వటం… శారదా కేసులో తాను కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడంతో ..మొత్తంగా సువేందు తృణమూల్ ను వీడటానికి ప్రధాన కారణాలయ్యాయి.
కొద్ది నెలలు తిరక్కుండానే వచ్చిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అప్పటికే ఫేస్ ఆఫ్ బీజేపీగా మారిపోయాడు. మమతా బెనర్జీపైనే పోటీకి దిగి నందిగ్రామ్ లో విజయం సాధించాడు. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ తృణమూల్ ను వణికించే స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించకపోయినప్పటికీ.. 77 సీట్లతో ఓటు శాతం కూడా అనూహ్యంగా పెంచుకుంది. అదే సమయంలో నందిగ్రామ్ లో స్వయానా ముఖ్యమంత్రి మమతపైనే గెలవడంతో.. సువేందు బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. అనంతరం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించాడు.
దీంతో సువేందు అధికారిని మించి పశ్చిమబెంగాల్ లో మరొకరిని ముఖ్యమంత్రి పదవిలో యావత్ దేశమే ఊహించలేని అనివార్య పరిస్థితేర్పడింది. అదే బీజేపీ అగ్ర నాయకత్వం కూడా సువేందునే పశ్చిమబెంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ప్రకటించేందుకు కారణమైంది.



