ఆదిత్య ధర్ ఇప్పుడో సంచలనం… బాలీవుడ్ రిజెక్ట్ చేసిన చోట 1500 కోట్ల రూపాయల వసూళ్లతో బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన దర్శకుడు. తన సత్తా ఏంటో చాటిన మొనగాడు.
క్రికెట్ నెట్స్ నుంచి కెమెరా వెనక్కి!
క్రికెటర్ కావాలనుకున్నాడు. వానాకాలపు చదువులు చదివాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అటు తాను కలలు కన్న క్రికెట్ లోగానీ… ఇటు, తాను ఉవ్వెత్తున ఎగిసిపడిన సినీ ప్రపంచంలోగానీ గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేని సామాన్యుడు. ఎలాంటి బ్యాక్ అప్ లేకపోయినా తన కలను వదల్లేదు. అయితే, ఆదిత్యకు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన ఆయన తండ్రి మద్దతుగా నిల్చాడు.

ఢిల్లీ యూనివర్సిటీకి క్రికెటర్ గా ఆడి ఎడమచేతి వాటం స్పిన్నర్ గా పేరు సంపాదించాడు. ఒకప్పుడు భారత జట్టులో బ్లూ జెర్సీ ధరించి స్టేడియంలో అభిమానుల కేకలు వినాలని కలలు గన్నాడు. 2002 న్యూజిలాండ్ ఐసీసీ వరల్డ్ కప్ ముందు సెలక్షన్ కమిటీ కాల్ లిస్టులో ఆదిత్య పేరు మిస్ కావడంతో క్రికెట్ ను వదిలేసి… ఆ కేకలతో పాటే, ఇప్పుడు సినిమా థియేటర్లలో ఈలలు కూడా వినే స్థాయికెదిగాడు.
క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఆదిత్య ధర్ కు అనుకున్న అవకాశం రాకపోవడంతో.. కొంత నైరాశ్యంలో సినిమాలవైపు మళ్లాడు. ఢిల్లీలోని థియేటర్లకు వెళ్లుతూ లవ్ స్టోరీస్ చూస్తూ ఓ ఏడాదంతా గడిపాడు. అప్పుడే సినిమాపై మోజు పెంచుకున్నాడు. 2006లో ముంబైకి వెళ్లి బాలీవుడ్ అవకాశాల కోసం యత్నించాడు. ఆరంభ శూరత్వంలా ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఆశపెట్టడం ఆ తర్వాత చేజారిపోవడం.. ఇలా సవాళ్లు, కష్టాలతో ఎందరో ఎదుర్కొనే సినీ కష్టాలకూ ఆదిత్య కూడా అతీతుడేం కాదు. అలా సుమారు దశాబ్దన్నం కష్టం తర్వాత విజయాన్ని ముద్దాడాడు ఆదిత్య ధర్.
దశాబ్దంన్నర నిరీక్షణ!
రాజస్థాన్ ఎడారిలో నీటి కష్టాలపై తీసిన షార్ట్ ఫిల్మ్ బూంద్ కు జాతీయ అవార్డ్ వచ్చినా.. మెయిన్ స్ట్రీమ్ సినీ ఇండస్ట్రీలో నిలబడటానికి ఆ తర్వాత మరో దశాబ్దకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
హీరా ఫేరీ, భూల్ భులాయియా వంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో.. మంచి అనుభవాన్ని సంపాదించాడు. ఎన్నో తిరస్కరణల తర్వాత పట్టువదలని విక్రమార్కుడై యత్నిస్తున్న ఆదిత్యకు యూరి ఒక భారీ విజయాన్నందించింది. దాంతో నేషనల్ అవార్డ్ కొట్టేశాడు. ఆ విజయ పరంపరలో భాగమే.. తాజాగా విడుదలైన దురంధర్ 2- ది రివేంజ్ అయినా.. అంతకుముందు వచ్చిన మొదటి పార్ట్ దురంధర్ అయినా.

ఇవాళ ఆదిత్య ధర్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రముఖుల విషెస్ తో తాను ఇంతకాలం పడ్డ కష్టాలకు ఒక సంతృప్తికర ఫలితాల్ని రుచిచూశాడు. తను వెయిట్ చేసిన కాలం నుంచి… ఆ కాలం గిర్రున తిరిగి ఇప్పుడు బడా బడా నిర్మాతలే ఆదిత్య ముందు తమకో సినిమా చేసి పెట్టాలని నిల్చునే స్టేజ్ కు ఎదగిన ఓ సక్సెస్ స్టోరీ ఆదిత్యది.
దురంధర్ సినిమా కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది. దురంధర్ టేకింగ్ పైనా.. కథపైనా… స్టోరీ లెంగ్త్ పైనా భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ, మెజార్టీ దురంధర్ కు బ్రహ్మరథం పట్టింది. 13 వందల కోట్ల సినీ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. వాస్తవానికి యూరి – ది సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఆదిత్యను చాలామంది వన్ హిట్ వండర్ గా కొట్టిపారేశారు. అది తప్పని నిరూపించేందుకు ఆరేళ్ల సమయం తీసుకున్నాడు. ఆరేళ్ల తర్వాత రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ తో చరిత్రను తిరగరాసి తన సామర్థ్యాన్ని నిరూపించాడు. ఇప్పుడు దురంధర్ 2 కూడా దూసుకుపోతుండటంతో ఆదిత్య ధర్ లైఫ్ స్టోరీపై కూడా ఇంటర్నెట్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఆదిత్య ధర్ ఆస్తుల విలువ!
ప్రస్తుతం నివేదికల ప్రకారం ఆదిత్య ధర్ నెట్ వర్త్ సుమారు 25 కోట్ల రూపాయలైతే.. బాలీవుడ్ నటి, చివరగా ఈమధ్య హక్ అనే సినిమాలో నటించిన యామీ గౌతమి ఆస్తి వంద కోట్లు. దీంతో ఈ ఇద్దరు భార్యాభర్తల ఆస్తి విలువ 125 కోట్ల రూపాయలు. సాదాసీదా జీవనశైలిని ఇష్టపడే జంట వీరిద్దరూ. ఎలాంటి మీడియా హడావిడి కూడా లేకుండానే సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుని దంపతులయ్యారు.
ఆదిత్య ధర్ ఆస్తుల్లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఒకటి ముంబై బాంద్రాలో ఉంది. ఆ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువే సుమారు 20 కోట్లు ఉంటుందట. బాంద్రా వెస్ట్ లోని మిలియనీర్స్ లేన్ లో హోమ్ థియేటర్, జిమ్ ఫెసిలిటీస్ వంటి సకల సౌకర్యాలతో నిర్మించారు ఆ అపార్ట్మెంట్ ను. అలాగే, చండీగఢ్ లోని ఓ పోష్ కాలనీలో ఈ జంటకు 4 బీహెచ్కే డూప్లెక్స్ ఇల్లు కూడా ఉంది. ఉత్తర భారతీయ మూలాలను ప్రతిబింబించేలా మినిమలిస్ట్ డెకరేషన్ తో చండీగఢ్ ఇల్లు ప్రత్యేకమైంది. ఆర్టికల్ 370 విజయం తర్వాత వీరిద్దరూ చండీగఢ్ లోనే ఎక్కువ గడిపారు.
అలాగే, హిమాచల్ ప్రదేశ్ పర్వతసానువుల్లో ఉన్న పూర్వీకుల ఇల్లు కూడా ఆదిత్య ధర్ ఆస్తుల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతి మధ్య ఉన్న ఇంటిలో వీరు తమ కుమార్తె వృందాతో కలిసి సమయం గడుపుతూ ఉంటారు.
అలాగే కార్ల విషయంలోనూ స్పెషల్ టేస్ట్ కల్గి ఉన్న ఈ జంటకు బీఎండబ్ల్యూ, ఆడీ Q7 వంటి వాహనాలున్నాయి. వీటితో పాటు 3 కోట్ల రూపాయల విలువ కల్గిన బిజినెస్ ఆపరేషనల్ పర్పస్ ఫ్లీట్ వెహికల్ కూడా వీరి సొంతం.



