దురంధర్ 2 సినిమా ఇప్పుడు దుమ్ము రేపుతోంది. అది నచ్చని వాళ్ల సంఖ్య కన్నా.. వేలంవెర్రిగా చూస్తున్నవారి సంఖ్యే ఎక్కువ. దీంతో ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దురంధర్ ను మించి వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దురంధర్ : ది రివేంజ్ సినిమాకు ప్రేరణైన ఓ గ్యాంగ్ స్టర్ గురించి కాస్త తెలుసుకుందాం.
ఎవరా గ్యాంగ్ స్టర్..?
దురంధర్ 2 సినిమాతో మళ్లీ ఈ ఆతీక్ అహ్మద్ అనే గ్యాంగ్ స్టర్ గురించి కాస్త ఆసక్తి పెరిగింది. సినిమాలో ఆతీక్ అహ్మద్ పాత్రను ఆతీఫ్ అహ్మద్ గా మార్చినప్పటికీ… పాత్ర ఆతీక్ అహ్మద్ క్యారెక్టర్ కు దగ్గరగా పోలి ఉండటంతో ఈ క్యూరియాసిటీ కనిపిస్తోంది.
దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన దురంధర్ 2లో ఆతీఫ్ అహ్మద్ ను నకిలీ కరెన్సీ చలామణి చేసే క్యారెక్టర్ గానూ, ఎన్నికల్లో మోసాలకు పాల్పడే కుట్రదారుడిగాను చూపించారు. కథ ప్రకారం, ఎన్నికల సమయంలో పాకిస్థాన్ నుంచి నకిలీ నోట్లను చలామణి చేసే పాత్ర ఆతీఫ్ అహ్మద్ ది. ఆ ప్రణాళిక అమలు కాకముందే ఆతీఫ్ ను హతమారుస్తారు. ఈ కల్పిత కథకు యూపీకి చెందిన ఆతీక్ అహ్మదే ప్రేరణ. సినిమాలో ఆతీఫ్ అహ్మద్ పాత్రను సలీం సిద్ధిఖీ పోషించారు.

ఎవరీ ఆతీక్ అహ్మద్..?
1962లో అలహాబాద్ లో పుట్టిన ఆతీక్ అహ్మద్ చిన్నవయస్సులోనే నేరప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కేవలం 17 ఏళ్లకే ఆతీక్ అహ్మద్ పై మొట్టమొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత కరడుగట్టిన నేరగాడిగా మారిన ఆతీక్ పైన ఏకంగా వందకుపైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో హత్యలు, కిడ్నాపులు, భూదందాలు, ఆక్రమణలు, బెదిరింపులు వంటివాటితో ఈస్టర్న్ యూపీలో ఆతీక్ అహ్మద్ కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా పేరుబడ్డాడు.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు రాజకీయాల్లోకొచ్చాక ఆతీక్ అహ్మద్… 1989లో అలహాబాద్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెల్చాడు. రాజకీయాల్లోకొచ్చాక తనదైన ముద్రతో ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల్చాడు. 2004లో పుల్పూర్ నుంచి ఎంపీగా కూడా గెల్చి లోక్ సభలో అడుగుపెట్టాడు. నేరసామ్రాజ్యంలో ఎదిగి కరడుగట్టిన నేరగాడు.. ఆ తర్వాత ఓ ప్రజాప్రతినిధిగా ఎలా ఎదగగలడో ఆతీక్ అహ్మద్ రాజకీయ ప్రస్థానం మనకు చెబుతుంది.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య అనేది ఆతీక్ అహ్మద్ క్రూరత్వానికి పరాకాష్ఠ. మిట్ట మధ్యాహ్నం కిలోమీటర్ల మేర వెంటాడి వేటాడి రాజ్ పాల్ ను కాల్చిచంపిన ఘటన దేశంలో నాడు సంచలనం రేపింది. మరో ఘటనలో తన కుమారుడిపై కళాశాల యాజమాన్యం తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా ఆతీక్ తన అనుచరులతో కలిసి విశ్వవిద్యాలయంలోకి ఆయుధాలతో దూసుకెళ్లి, సిబ్బందిని బెదిరించడం కూడా నాడు ఆతీక్ అహ్మద్ దుందుడుకుతనాన్ని సమాజం ముందుంచింది.
నేరాలు, అరెస్టులు ఆతీక్ అహ్మద్ జీవితంలో సర్వసాధారణమైపోయాయి. ఆ క్రమంలో జైలుకెళ్లినా అక్కడి నుంచే తన కనుసన్నల్లో రాష్ట్రంలో జరిగేవాటిని నడిపించగల సమర్థ నేరగాడిగా ఆతీక్ అహ్మద్ కు పేరుండేంది. అలాంటి నెట్వర్క్ ఆతీక్ యూపీలో ఏర్పాటు చేసుకున్నాడు. తన నేరాలతో పాటే, ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా విస్తరించాడు. పదకొండు వేల కోట్ల ఆస్తులున్నాయని నాడే అంచనా వేశారు. 200కు పైగా బ్యాంక్ ఖాతాలతో పాటు, అనేక షెల్ కంపెనీలతో ఆతీక్ కార్యకాలాపాల విస్తృతి యావత్ దేశాన్ని ఆశ్చర్యపర్చింది.
బుల్లెట్ తో బెదిరించి.. అదే బుల్లెట్ కు బలయ్యాడు!
2023 ఏప్రిల్ 15న ఆతీక్ అహ్మద్ జీవితం సంచలనాత్మకంగా ముగిసింది. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్న సమయంలో జర్నలిస్టుల వేషంలో వచ్చిన దుండగులు ఆతీక్ అహ్మద్ తో పాటు, అతడి సోదరుడైన అష్రాఫ్ ను కాల్చి చంపారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా టీవీల్లో మారుమ్రోగడంతో సంచలనం సృష్టించింది. ఆ ఆతీక్ అహ్మద్ పాత్రనే.. ఆతీఫ్ అహ్మద్ గా మార్చి దురంధర్ 2లో చూపించారు.



