రొటీన్ కు భిన్నంగా.. ఓ ఐఐటీయన్ వైవిధ్య ప్రయాణం!

సమాజంలో ఓ గుర్తింపు కోసం… ఇంత గౌరవం కోసం.. అలాగే, ఆర్భాటాలు, దర్పం కోసం బతికేవారే ఎక్కువ. కానీ, మనసు మాట విని.. ఆ సమాజమే అబ్బురపడేలా బతకేవారి సంఖ్య తక్కువే. అందులో ఒకడు మనం చెప్పుకోబోతున్న ఐఐటీయన్. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇన్ స్టా పేజీలో ఆ భారతీయుడి లైఫ్ జర్నీ… ఇప్పుడు ట్రెండింగ్ స్టోరీ. ఎవరతను..?

షేక్ మోయెస్ట్ అనే ఐఐటీయన్.. కోలంబస్ లాగా కొత్త ప్రదేశాలకు వెతుక్కుంటూ బహుదూరపు బాటసారై బయల్దేరాడు. 38 ఏళ్ల వయస్సులో ఏ వేతనమైతే కోరుకుంటారో ఆ స్థాయిలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న షేక్ మోయెస్ట్… ఇక తన ఉద్యోగ జీవితం చాలని తృణప్రాయంగా వదిలేశాడు.

కార్పోరేట్ కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకున్నా.. గత పదేళ్లుగా ఒకే చక్రంలో తిరుగుతూ ఓ చట్రంలో ఇరుక్కుపోయినట్టుగా అనిపించింది షేక్ మోయెస్ట్ కి. తన మనసుకు నచ్చని పదవిని ఎంతకాలమని చేయాలనుకున్న షేక్.. ఏకంగా ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్రీకుడిగా మారిపోయాడు. కార్పోరేట్ స్ప్రెడ్ షీట్స్ కు అందని కళాత్మకమైన జీవితాన్ని అనుభవించాలని.. అంత: ప్రేరణాత్మకమైన జీవితాన్ని అన్వేషించేందుకు బయల్దేరాడు. అందుకోసం తనకున్న నాల్గు డబుల్ బెడ్రూమ్స్ ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బంతా పోగు చేసి.. IN TO THE WILD సినిమాలో Chris McCandless అవతారమెత్తాడు.

షేక్ మోయెస్ట్ 2013లోనే జీవితాన్నే మార్చే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అధిక వేతనాన్ని కాదనుకుని సాధారణ జీవితాన్ని ఎంచుకుని బ్యాంక్ జాబ్ కు రిజైన్ చేసి గుడ్ బై చెప్పాడు. కేవలం అవసరమైన వస్తువులు మాత్రమే వెంట బెట్టుకుని ప్రపంచయాత్రను ఆరంభించాడు. అలా 18 నెలల్లో 35 దేశాలు తిరిగాడు. వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకుని కొత్త అనుభూతి పొందాడు.

రష్యా పర్వతాల నుంచి ఈజిప్ట్ ఎడారుల వరకు సుదూర ప్రయాణం సాగుతూనే ఉంది. ఎక్కడా ఎవ్వరూ తెలిసినవాళ్లేం లేరు. కానీ, తనను తాను తెలుసుకోవడానికి పయనాన్ని ప్రారంభించాడు.

అలాంటి ప్రయాణంలోనే మోంటెనెగ్రోలో షేక్ మోయెస్ట్ జీవితం మరో మలుపు తీసుకుంది. ఆస్ట్రియా దేశానికి చెందిన ఓ సామాజిక సేవకురాలు క్యాథీని కలిశాక వారి పది నిమిషాల సంభాషణ.. పది రోజుల అనుంబంధంగా మారింది. ఆ తర్వాత బలమైన బంధమై ఇద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు.

ముగ్గురు పిల్లలతో కలిసి ఈ ఇద్దరు దంపతులూ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఓ కుగ్రామంగా మార్చేసి గ్లోబ్ చుట్టూ గుండ్రంగా తిరిగేస్తున్నారు. కుటుంబ బాంధవ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఐదుగురు సభ్యుల ఫ్యామిలీకి ఓ ఇల్లు లేదు. కారు లేదు. ఎక్కడ వీలైతే అక్కడ హోమ్ స్టేస్ చేస్తుంటారు. హోటల్స్ లో ఉంటారు. భారత్ లో తనకున్న ఆస్తులు, ఇతర పెట్టుబడులతో వీరి జీవనం సాగిపోతోంది. పిల్లలకు ఎన్సీఈఆర్టీ బుక్స్ తో ఎక్కడుంటే అక్కడ్నుంచే హోంస్కూలింగ్ చేస్తున్నారు.

కంఫర్ట్ జోన్ కు పరిమితం కాకుండా మొత్తమ్మీద ముగ్గురు పిల్లలను కూడా రోడ్డుపైనే పెంచుతూ వైవిధ్యమైన జీవిత పయనాన్ని అలవాటు చేశారు. జీవితంలో ఏమవుతావన్నది కాదు.. నువ్వెవ్వరో నిన్ను నువ్వు తెలుసుకో అన్నట్టుగా పెంచుతూ కాస్త వైవిధ్యంగా సాగుతోంది మన భారతీయ షేక్ మోయెస్ట్ కుటుంబ ప్రయాణం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles