గారాబం
……………………………………
పుల్లూరి సంపత్ రావు.. ✍️
చాలా సంధార్భాలలో గారాబం ప్రేమ పేరుతో పిలువబడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కనపరిచేది ప్రేమ కాకపోవచ్చు.

గారాబం వలన పిల్లలు మొండిగా తయారవుతారు. మంకు పట్టుపట్టి అనుకున్నది సాధిస్తారు. దేనినైనా కాదంటే ఏమైనా చేసుకుంటారో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. పేరెంట్స్ లో ఒకరు గారాబం చేస్తూ మరొకరు కచ్చితంగా ఉండాలనుకునే ఒప్పందాలు తరచుగా విఫలమవుతాయి.
గారాబానికి అలవాటు పడితే ఇక జీవితాంతం అందులోనుంచి బయటకు రాలేరు. ఈ లోగా అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. హోమ్ వర్క్ చేయకపోవడం, సమయానికి రెడీ కాలేకపోవడం, ఫలానా కూరలు/పదార్థాలు మాత్రమే తింటానని మారాం చెయ్యడంతో మొదలయ్యి కొంతకాలానికి వాళ్ళ ప్రవర్తన బయట చెల్లుబాటు కాకపోవడంతో ఇంటికే పరిమితం అవడానికి ఇష్టపడుతారు. కొందరు స్కూలు ఎగ్గొట్టడం, క్రమంగా స్కూలు/కాలేజీ మానేయడం వరకు పోతారు. పెళ్లీడుకొచ్చినా అతిగారాబ ప్రవర్తనతో చదువు/ఉద్యోగం లేక రోజూ ఇంట్లోనే కూర్చునే వాళ్లూ ఉన్నారు.
చాలా మంది తల్లిదండ్రుల తమ ఆర్థిక స్థితిగతులకు సంబంధం లేకుండానే పిల్లల విషయంలో ఖర్చు చేస్తారు. గారాబం ద్వారా పనులు/వస్తువులు సమకూర్చుకున్న పిల్లలు పెద్దయ్యాక అలాంటివి పొందలేక నిరాశకు లోనవుతారు. ఇలాంటి వారు ఉద్యోగాలు చేసినా, పెళ్లిళ్లు చేసుకున్నా అవతలివారితో పొసగదు.
ఎవరైనా నేను మా పిల్లలతో ఫ్రెండ్ లాగా ఉంటాను అంటే అది సరైనది కాదనే చెప్పాలి. అవసరమైన చోట ప్రవర్తనను సరిచేయ్యవలిసిన భాధ్యత తీసుకోవాలి కాబట్టి పిల్లలతో పేరెంట్ లాగే ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమకు మధ్య ఒక సరిహద్దు రేఖ ఉండాలి. దానికి భద్ధులై ఉండాలి. తల్లిదండ్రులు భావోద్వేగాలకు బదులు విచక్షణకు ప్రాధాన్యత ఇవాలి. పిల్లల పనులు తల్లిదండ్రులు చేయకూడదు. కొందరు హోమ్ వర్క్ నుంచి అప్ప్లికేషన్ వరకు తల్లిదండ్రులే చేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళే స్వయంగా చేసుకునేలా అలవాటు చెయ్యాలి. పిల్లలు పనులు చెయ్యడంలో తప్పులు తెలుసుకోవాలి. బాధను, ఓటమిని, నష్టాన్ని అనుభవించనీయాలి. తద్వారా తమ శక్తి సామర్ధ్యాలేమిటో తాము దేనికి అర్హులో పిల్లలు తెలుసుకుంటారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రయత్నాలను పొగడాలి గాని పిల్లలను కాదు.



