నిజాం దర్పపు దర్పణం.. ఆ మ్యూజియం!

నిజాం_మ్యూజియమ్‌

యాసీన్‌..,✍🏻

అసలు కథలోకి వెళ్లేముందు ఓ చిన్న పిట్టకథ…
ఓ బిట్రిష్‌ రెసిడెంటు ఫ్రెండుగారి ఓ పిల్లచేష్ట కథ…

అప్పట్లో దాదాపు పాలనంతా బ్రిటన్‌ వారిదే అయినప్పటికీ… ఇక్కడ ఉండే బ్రిటిష్‌ రెసిడెంట్‌గారు… సకల రాజలాంఛనాలతో విలసిల్లే నవాబుగారి పట్ల గౌరవపురస్సరంగా అప్పుడప్పుడూ ఆయనను సందర్శించి వస్తుండటం ఓ లాంఛనం… ఓ మర్యాద.

అలాంటి సందర్భాల్లో…
టీ ఆఫర్‌ చేయడం నవాబుగారి ఆనవాయితీ…
కాదనకుండా తాగి రావడం రెసిడెంట్లకు రివాజు.

ఇలా టీ ఆఫర్‌ చేసే సమయంలోనే… తన బొడ్డునున్న తాళాల గుత్తిలోంచి ఎంచీ ఎంచీ, ఎట్టకేలకు ఓ తాళం చెవిని గుర్తించి, దాంతో అక్కడి అలమరాను తెరచి, అందులో ఉన్న ఓ అద్దాల జాడీలోంచి ‘ఒక్కటంటే ఒక్క ఉస్మానియా బిస్కెట్టు’ను ఆఫర్‌ చేస్తారట ఘనతవహించిన నిజామ్‌ బహద్దరు వారు.

ఆ తర్వాత ‘మరోటి తింటారా’ అంటూ మర్యాద కోసం అడుగుతారు మర్యాదరామన్న నిజాం గారు. కానీ కావాలనడం పాడిగాదు. బిస్కెట్టు బాగుందని మెచ్చుకోవడం మాత్రం గౌరవపూర్వకమైన ఓ జెశ్చరు.

ఓరోజు బ్రిటిష్‌ రెసిడెంట్‌ గారి వెంట ఆయన ఫ్రెండొకరు వెళ్లారు. నవాబుగారు టీతో పాటు చెరో బిస్కెట్‌ ఆఫర్‌ చేస్తూ, మరోటి తింటారా అంటూ అడగనే అడిగారు.

రాజుగారి కోసం చేసే బిస్కెట్లు కదా… బహురుచిగా యమ పసందుగా ఉంటాయట అవి. రెసిడెంటు గారి ఫ్రెండు ఊర్కున్నవాడు ఊర్కోకుండా… ‘‘చాలా బాగున్నాయ్‌ నవాబుగారూ… మరోటి దయచేయించండి’’ అంటూ అడిగాడట.

ఆయనైతే అడిగారు గానీ… నిజామ్‌గారు ఇవ్వనే ఇవ్వలేదట.

నిజా(మ్‌)నిజాలేవో మనకు తెలియదుగానీ… ఓ చరిత్రకారుడు చెప్పిన కథ ఇది.

ఉస్మానియా బిస్కెట్‌కు అంత పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు చేసినాయన… ఎంతెంతో విలువైన వస్తువుల సముదాయాలకు రక్షణగా ఉండడా మరి?!

అక్కడ ఏర్పాటు చేసిన నిజాం నవాబుగారి విగ్రహం… కాపలా కాస్తున్నట్టు నిల్చుని చూపరులు ఏ వైపునుంచి చూసినా అది తమవైపే చూస్తున్నట్టుగా ఉంటుందట.

ఆ చిత్తరువెక్కడో… దాని అసలు కథలోకి వెళ్లి చూద్దాం.


ఎవరో కవి అన్నట్టుగా… కాలం చెక్కిలి మీద ఘనీభవించిన గతకాలపు వైభవాల నీటిచుక్కలన్నీ… మంచుముక్కలై…

అవి ఇంద్రనీలాలై, ముత్యాలై, పగడాలై, రత్నమాణిక్యాలై, అద్భుత వస్తు సంచయ సముదాయాలై, అనన్య ప్రాచీన మణిమయ మంజూషాల్లోకి ఒదిగిపోయి… నిజాముకు సమర్పిత నూలుపోగులై…

సామాన్యులకు పోజుకొట్టేందుకు ఒకేచోట పోగై… ఓ ఠీవిౖయెన ప్రదర్శనశాలలో నిలుచున్న అద్భుత వస్తు ప్రదర్శనశాలే నిలువెత్తు ‘నిజాం మ్యూజియమ్‌’ అవుతుంది.


నిజాం మ్యూజియమ్‌ ఏర్పాటైన విధంబు సైతం రాజసంతో కూడినదై పోజుకొట్టేదే. నిజాముల దర్పాన్ని దర్పణంలో చూసినట్టుగా కనిపింపజేసేదే.

దీనికంటే ముందు… ప్రస్తుత మన రాష్ట్రప్రభుత్వ ఎగువసభగా ఎమ్మెల్సీల సమావేశాల ఏర్పాటు కోసం ఉపయోగపడుతున్న ఆ ‘జూబిలీ హాల్‌’ కథ తెలుసా? కాస్త తెలుసుకుందాం రండి.


ఆరో నిజామ్‌ నవాబైన తన తండ్రి మహబూబ్‌ అలీ ఖాన్‌ మరణించడంతో ‘మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌’ 1911 ఆగష్టు 29న ఏడో నిజాంగా పాలన బాధ్యతలను చేపట్టాడు. తాను సింహాసనాన్ని అధిష్టించి 25 ఏళ్లు కావడంతో 1936లో తన పాలనా రజతోత్సవ వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించదలచాడు. అందుకు నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌ వేదికగా ఖరారైంది. ఆ వేడుకల నిర్వహణకోసం ప్రత్యేకంగా నిర్మితమైన భవనమే… ఇవ్వాళ్టి మన ఎమ్మెల్సీల ఎగువ సభ భవనం. పాలన తాలూకు సిల్వర్‌ ‘జూబిలీ’ ఉత్సవాల కోసం రూపొందింది కాబట్టో ఏమో దాని పేరు ‘జూబిలీ హాల్‌’!


అంగరంగవైభవంగా నిర్వహితమైన ఆనాటి వేడుకలకు ఎందెందరో దేశవిదేశ విఖ్యాతులూ, ప్రముఖులూ, ప్రఖ్యాతులు, విదుషీమణులూ, విదేశీయులూ హాజరయ్యారు.

అసలే రాజదర్శనం… ఉత్తచేతుల్తో వస్తారా ఎవరైనా? అందుకే… వెలలేని, తులలేని, ఇతరులు ఇలనైనా వినలేని, కలనైనా కనలేని… విలువైన తమ సంపదాసంచయంతో హాజరై… నిజామ్‌కు నజరానాలుగా సమర్పించారు.


అప్పుడంతటి విలువైన వస్తువులు ఉంచడానికి ఓ భవనం అవసరమైంది. అప్పటి పురానీ హవేలీకి దగ్గరగా, దుర్రెషవార్‌ హాస్పిటల్‌ సమీపంలో నిజాం అధికారిక నివాసం ఉండేది. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులందించిన ఆ వస్తువులనూ, అద్భుత కళాఖండాలనూ, వాళ్ల జ్ఞాపకాల్నీ, జ్ఞాపికల్ని అప్పటికి ఆ భవనంలోనే తాత్కాలికంగా భద్రపరిచారు.

ఆ తర్వాత నిజాం మనవడు ముఫఖం జాహ్‌… తన తాత అందుకున్న కాన్కలన్నింటినీ అపురూపంగా ఎంచి… ఆ భవనాన్నే నిజామ్‌ మ్యూజియమ్‌గా మలచాడూ… మార్చాడు. తానే స్వయంగా ఆ మ్యూజియానికి ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరించాడు.


ఇందులోని అద్భుత వస్తు వైభవాలు వైనవైనాలు. ఉదాహరణకు హైదరాబాద్‌కు ఐకన్స్‌గా చెప్పే అద్భుత భవనాలైన ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, మోజంజాహీ మార్కెట్, హైకోర్ట్, నీలోఫర్‌ హాస్పిటల్‌ల వెండి నమూనాలు ఇందులో ఉన్నాయి.

అంతేనా… కొన్ని అద్భుత వస్తువుల వైభవం చెప్పనలవి కాదు. చివరి నిజాం అయిన ఉస్మాన్‌ అలీఖాన్‌ రజతోత్సవ వేడుకల్లో కూర్చున్న బంగారు సింహాసనం, వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌బాక్స్, ఆనాటి పాల్వంచరాజు బహూకరించిన మదర్‌ ఆఫ్‌ పెరల్‌ వజ్రం, షాహీ అత్తరు మంజూషాలూ, బాహాబాహీల కోసం బంగారు కత్తులు, వేడిపానీయాల కోసం వెండి సీసాలూ, కమ్మని కాఫీ సేవనం కోసం వెండి కప్పులు… ఒకటని ఏమిటి… రకరకాల విలువైన వస్తువులనిక్కడ అబ్బురంగా అవలోకించవచ్చు.

వింటేజీ వాహనాలైన రోల్సురాయిసు కార్లూ, ప్యాకర్డు ల్లాంటి అలనాటి రాజస బ్రాండెడ్‌ కార్లక్కడ ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్దదైన అలమర అక్కడ కొలువుదీరి ఉంది. బర్మాటేకుతో చేసిన 176 అడుగుల పొడవైన ఈ అల్మారాను ఆరో నిజామ్‌ ఉపయోగించేవాడు.

ఆనాటి నవాబులు ఉపయోగించిన దుస్తులూ, వారు తినే ప్లేట్లూ, తాగే గ్లాసులూ అన్న ఇక్కడ అమరి ఉన్నాయి.

శుక్రవారం మినహా ప్రతిరోజూ ఈ వస్తువులను చూసేందుకు ప్రజలను మ్యూజియమ్‌లోకి అనుమతిస్తారు. ఇదిగో ఇల్లిదిగో… ఇదేనండీ నిజాం మ్యూజియమ్‌! చూడదలచుకున్నవారంతా వచ్చేయండీ…!! ఆ వచ్చినవారంతా అద్భుతాల్ని చూస్తూ అబ్బురపడండి!!! ఇచ్చటి ఇచ్చంతరాలు చూసి అచ్చెరవొందండీ!!!!


ఇప్పుడు అసలు కథ వదిలి మళ్లీ ఓసారి మొదట చెప్పుకున్న పిట్ట కథ దగ్గరికి వెళ్దాం…

ఏడో నవాబు ఎంతో పిసినారి అన్నది సాక్షాత్తూ నిజామ్‌ నవాబుగారికి ఉన్న ప్రఖ్యాతి కదా. అందుకేనేమో.. ఆ విలువైన వస్తుసంచయానికి తానే స్వయంగా కాపలాగా నిల్చున్నట్లుగా నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నిలువెత్తు తైలవర్ణ చిత్రపటం అక్కడ ఏర్పాటై ఉంది. మరి కావలి కాస్తున్నప్పుడు ఉన్నప్పుడు కనులు అన్నివైపులకూ తిప్పాలి కదా… అందుకే చూసేవారు చేష్టలుడిగి చిత్తరువులైపోయేలా… ఎవరేమూల నుంచి చూసినా… తాను వాళ్లనే స్వయంగా తదేకంగా చూస్తున్నట్లుగా చిత్తభ్రమ కలిగించేలా ఉంటుందంట ఆ చిత్తరువు!

#hyderabad_is_an_emotion

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles