చంపారన్ సత్యాగ్రహం వెనుక మరుగునపడిన ఓ కలం!
స్వాతంత్రోద్యమంలో చంపారన్ సత్యాగ్రహం ఓ కీలక ఘట్టం. 1917లో బీహార్ లోని చంపారన్ ప్రాంతంలో రైతుల కోసం జరిగిన ఉద్యమమిది. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తొలి సత్యాగ్రహ ఉద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఉద్యమమిది.
అయితే ఓ జర్నలిస్ట్ రాసిన కథనమే.. గాంధీ చంపారన్ సత్యాగ్రహానికి బాటలు వేసింది. ఆ రెబల్ జర్నలిస్టే పీర్ మహమ్మద్ మునిస్!

రైతు కష్టాల్ని రాసిన కలం!
పీర్ మహమ్మద్ మునీస్ గాంధీకి సన్నిహితుడైన జర్నలిస్ట్. ఈయనే తన కలంతో చంపారన్ రైతు సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. చివరకు ఆయన రాసిన లేఖలతో కదిలిన గాంధీ చంపారన్ బాట పట్టాడు.
1916 కాలంలో భారతీయ రైతాంగం బ్రిటీష్ పాలనలో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న రోజులవి. చంపారన్ లో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. ఆహార పంటలు పండించుకోవాల్సిన చోట.. నీలిమందు (ఇండిగో) సాగు చేయాలనే ఒత్తిడి రైతులపై పెరిగింది. విదేశీ మార్కెట్ లో ఇండిగోకు మంచి డిమాండ్ ఉండటంతో.. అది బ్రిటీష్ పాలకులకు లాభదాయకమైన వాణిజ్య పంటగా మారిపోయింది. కానీ, రైతులకు మాత్రం ఆహార పంటలు పండించుకునే అవకాశం తగ్గిపోయింది. దాంతో రైతుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఆ సమయంలో ఆ అన్నదాతల సమస్యలను తన కలం ద్వారా ప్రభావవంతంగా బయటకు తీసుకొచ్చిన జర్నలిస్టుల్లో పీర్ మహమ్మద్ మునిస్ ఒకరు.
ఆనాడు ఉన్నతవర్గాల్లో ఉర్ధూ, పర్షియన్, ఇంగ్లీష్ భాషలకే ఎక్కువ ప్రాధాన్యముండేది. కానీ, పీర్ మహమ్మద్ మాత్రం హిందీలోనే రైతుల సమస్యలను రాసేవారి. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలన్నదే తన భావన. తన కాలమ్స్ అన్నీ ప్రతాప్ వంటి హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. తర్వాత హిందీని ప్రజల్లోకి మరింత విస్తరించేందుకు కూడా ఆయన కృషి చేశారు. గాంధీతో పరిచయమేర్పడ్డాక కూడా హిందీ విస్తరణ విషయంలో గాంధీతో చర్చించేవారట.

బ్రిటీషర్స్ ను గడగడలాడించిన జర్నలిస్ట్!
రైతు సమస్యలపై మునిస్ నిరంతరం రాస్తుండం బ్రిటీష్ అధికారులకు నచ్చేది కాదు. నొటోరియన్, బిట్టర్, డేంజరస్ వంటి పదాలతో పాటే.. బద్మాష్ పాత్రికేయుడనే ముద్ర కూడా వేశారు.
రెడ్ ఫోర్ట్ లోని ఆజాదీ కే దీవానే మ్యూజియంలో ఉన్న బ్రిటీష్ పోలీస్ పత్రంలో కూడా మునిస్ గురించి పేర్కొన్నారట. చంపారన్ రైతుల బాధలను తన ఆర్టికల్స్ ద్వారానే బయటపెట్టిన జర్నలిస్టుగా బ్రిటీషర్స్ పేర్కొన్నట్టుగా కూడా ఆధారాలున్నాయి.
బ్రిటీషర్స్ తనను ఎంత కట్టడి చేయాలనుకున్నా మునిస్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
మరి గాంధీకి ఏమని లేఖ రాశారు..?
మునిస్ జీవితంలోనే కాదు.. చంపారన్ ఉద్యమ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన గాంధీకి రాసిన లేఖ. స్థానిక రైతు నాయకుడు రాజ్ కుమార్ శుక్లాతో కలిసి మునిస్ 1917, ఫిబ్రవరి 27న గాంధీకి ఆ లేఖ రాశారు. రైతుల బాధలను శుక్లా వివరిస్తుంటే.. వాటిని ప్రభావవంతమైన పదాలతో హిందీలో గాంధీ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను మునిస్ కలం తీసుకుంది.
ఆ లేఖలో చంపారన్ రైతుల పరిస్థితిని… దక్షిణాఫ్రికాలో గాంధీ, ఆయన సహచరులు ఎదుర్కొన్న కష్టాలతో పోలుస్తూ.. తమ బాధలు అంతకంటే దారుణంగా ఉన్నాయన్నదే ఆ లేఖ సారాంశం. అంతటితో ఆగకుండా మళ్లీ మార్చి 22న మరో లేఖ కూడా సంధించారు. చంపారన్ రైతుల పరిస్థితిని స్వయంగా కళ్లతో చూసేందుకు ఒక్కసారి రావాలని కోరుతూ ఆ లేఖ రాశాడు మునిస్. చివరకు మునిస్ లేఖలకు స్పందించిన గాంధీ 1917, ఏప్రిలో పదో తేదీన చంపారన్ కు వచ్చారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి, రైతు సమస్యలపై ఉద్యమాన్ని ఆరంభించారు.
చంపారన్ లో గాంధీ అడుగుతో ఏమైంది..?
గాంధీ అక్కడే పాఠశాలలను ఏర్పాటు చేయడం, స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించడం, గ్రామాల పరిస్థితిపై సర్వేలు నిర్వహించడం, రైతు సమస్యలను నమోదు చేయడం వంటివి మొదలుపెట్టారు. రైతుల హక్కుల కోసం నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. పంటల అమ్మకాలపై రైతులకు మరింత నియంత్రణ ఉండాలని డిమాండ్స్ తెరపైకొచ్చాయి. ఆ ఉద్యమంలో మునిస్ కూడా గాంధీతో కలిసి పనిచేశారు. అది బ్రిటీష్ అధికారులకు సహజంగానే ఇబ్బందిగా మారింది. అప్పటి అధికారుల లేఖల్లో కూడా మునిస్ ను గాంధీకి స్థానికంగా సాయం అందించిన ముఖ్యవ్యక్తిగా పేర్కొన్నట్టు పలు కథనాలు చెబుతున్నాయి.
రైతులకు ఉపశమనం ఎలా కల్గింది?
చంపారన్ ఉద్యమ ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం 1918 చంపారన్ అగ్రేరియన్ యాక్ట్ తీసుకొచ్చింది. బలవంతపు ఇండిగో సాగును రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు. చంపారన్ లో అమలైన టింకాథియా వ్యవస్థ కూడా రద్దైంది. ఈ వ్యవస్థ వల్ల రైతులు తమ భూమిలో ఒక నిర్ధిష్ఠ భాగంలో ఇండిగో తప్పనిసరిగా సాగు చేయాల్సి వచ్చేది. అయితే, ఇండిగో సాగు రద్దుతోనే మునిస్ పోరాటం ఆపలేదు. రైతుల హక్కుల కోసం రైయతి సభ ఏర్పాటు చేశాడు. అందుకు ఆయన ఆరునెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మరోసారి కూడా అరెస్ట్ అయి పాట్నా క్యాంప్ జైలులో మూడు నెలలు గడిపారు మునిస్.
ప్రజల కోసం పనిచేసిన జర్నలిస్ట్!
1937లో చెరకు రైతులు మధ్యవర్తుల ఆగడాలపై ఆందోళనకు దిగినప్పుడు కూడా మునిస్ వారికి నాయకత్వం వహించారు. మధ్యవర్తులు రైతుల ఆదాయంలో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నారనే ఆరోపణలతో పెద్ద ఎత్తున నిరసలకు దిగారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తరపున చంపారన్ జిల్లా బోర్డ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బెట్టియా లోకల్ బోర్డ్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు మునిస్.
గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక పాఠశాలల్లో హిందీ ప్రాచుర్యం, రైతు హక్కులు వంటి అనేక అంశాల కోసం జీవితాంతం పనిచేసిన మునిస్.. 1949, సెప్టెంబర్ 23న మరణించారు.
ఆయన మరణం తర్వాత ప్రతాప్ పత్రిక సంపాదకుడు గణేష్ శంకర్ విద్యార్థి.. మునిస్ సేవలను గుర్తు చేసుకుంటూ, చంపారన్ రైతుల బాధలను గాంధీకి వివరించడంలోనూ, ఆయనను చంపారన్ కు తీసుకురావడంలో మునిస్ కృషిని ప్రశంసించారు.
చరిత్రలో కొన్ని పెద్ద పేర్లే మనకు గుర్తుంటాయి. కానీ, ఆ చరిత్ర నిర్మాణంలో కీలక భాగస్వాములైన కొందరి పేర్లు మాత్రం అలా మరుగున పడిపోతాయి. చంపారన్ రైతుల గళాన్ని గాంధీ వరకు చేర్చిన పీర్ మహమ్మద్ మునిస్ అలాంటి మరుగున పడిపోయిన స్వాతంత్ర సమరయోధుడే.
అందుకే చంపారన్ సత్యాగ్రహమంటే గాంధీనే కాదు… ఆయన సత్యాగ్రహానికి కారణమైన పీర్ మహమ్మద్ మునిస్ వంటివారెందరో!


