గంగాధరిని నమ్మిన లింగధారి! చూపులో చల్లదనం.. రూపులో ఆత్మానందం!!

లింగం.. ఆత్మగతం

డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి..

ఈ తమ్ముడు లింగధారి.
గంగధారిని నమ్మిన భక్తుడు.
ఆ చూపులో ఎంతటి చల్లదనం.
ఆ రూపులో ఎంతటి ఆత్మానందం.

ఆత్మలోపల బంధించినా..
అవస్థలోపల నిందించినా..
అర్థనారీశ్వరుడొకడే, తమకు చుట్టం.

నర్సంపేట,పరకాల,తొర్రూరు మీదంగ
హన్మకొండ నుండి వేములవాడకు పోయే
బస్సులల్ల ఈ తమ్ముడివంటివాళ్లు కోకొల్లలు.
అన్నదమ్ములనాల్నా అక్కజెల్లెండ్లనుకోవాల్నా
ఒక చిన్నపరిచయంతోటి, అది తేలే ముచ్చట కాదు.
కిందమీదజూసి అర్థంజేస్కునే ముచ్చట అంతకన్నగాదు.
ఇది కండ్లతోటిగాదు, మనసుతో తడుమవలసిన ముచ్చట.

వేళ్లకు పిల్లెండ్లు, కాళ్లకు కడియాలు, మెడకు పెద్దగొలుసు,
చేతులకు ఉంగురాలు, పసుపుకుంకుమ, కండ్లకు కాటుక,
ఇచ్ఛాపూర్వకంగ ధరించే వస్త్రాలు.రుద్రాక్ష లేదా లింగధారణ.
ఇవి వీళ్లను గుర్తింపజేసుకునుటానికి, తమవైన ఆధారుకార్ఢులు.

ప్రకృతి ఇచ్చిన లింగవైవిధ్యాన్ని,సమాజవికృతంగా మార్చరు.
తమ లింగపు భేదాన్ని దైవాంకితం చేసి, నిర్వికారంగ జీవిస్తరు.
ఆత్మహత్యలు చేసుకోరు, ఆరాచకాలకు అంతకన్న పాల్పడరు.
అవమానాలను పట్టించుకోరు, ఆత్మాభిమానంతోనే ప్రవర్తిస్తరు.
నేర్చిన వృత్తిని నమ్ముకుని, నలుగురు నచ్చేవిధంగ బతుకుతరు.
వీళ్లకు ఆడమగ తేడాలేదు. ఊరంతా కలివిడే. అందరితో గలగలే.
ఆపదసంపతిల ఆరాటంకొద్ది అందట్లకు ముందట నిలవడుతరు.

ఇప్పుడు అందరు మారినట్టే, వీళ్లు మారుతున్నరేమొ చెప్పలేము.
చిన్నప్పటిసంది చూస్తున్నదేగద,ఊరంతటికి ఉమ్మడి బంధువులు.
కనికరం కలవాళ్లు, కుక్కపేగులవాళ్లు, మనసునిండ మాట్లాడేవాళ్లు.
వింతచూపులుదప్ప వీళ్లమనసెరిగి మసులుడు మనకు చాతగాదు.

సమాజం అక్కున చేర్చుకున్నా, కాదుకుదురదని పక్కకు జరిపినా
వేములవాడ ఆలయం, వీళ్లను ఆలింగనం చేసుకునే అమ్మగారిల్లు.
ఇక్కడ లింగైక్యం తప్ప లింగంతో పనిలేదు. అసలు ఆ భేదమే లేదు.
దేవుడొక్కడే పురుషుడు. తతిమ్మా సమాజమంతా స్త్రీత్వరూపమే.
లింగంతోటి లొల్లిలేదు. ఇముడని జన్మలేదు, మురువని ఆత్మలేదు.
ఇది తెలంగాణం సాధించుకున్న ఒక అనాది ఆధ్యాత్మిక సంస్కరణ.
అందుకే ఎక్కడెక్కడివాళ్లో, గుడి తంతెలెక్కి రాజన్నకు మొక్కుతరు.
ఆత్మకు శరీరానికి కల్లలులేని ఎల్లలులేని, గౌరవం ప్రసాదించే చోటిది.

యూనివర్సిటీల్ల మొగోళ్లు ఆడోళ్లలెక్క చీరలుగట్టి చింగులు పోసిన,
మొగమోడళ్లు పదారుమూరల గోచిచీరజుట్టి, కొసకంటితో చూసిన,
తమ్మన్నజక్కమ్మ గ్రూపుగట్టి రాతకోతలు రాసిన, మైకులు మోసిన,
పుట్టువన్నె పుట్టువన్నే – పెట్టువన్నె పెట్టువన్నేనని తెలువక పొర్లాడే
ఆ నడుమంత్రపోళ్లు, వీళ్లముందట తూటుపైసమందం పనికస్తరా.. !

ఇది.. మన సమాజం – నానా జనసమూహం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles