అతను ఇప్పుడు వెస్ట్ ఇండీస్ టీం హోపే కాదు… జనం అందరి నోళ్లల్లో నానుతున్న తోపు!
పేరుకు తగ్గ ప్రదర్శన!
70-80ల నాటి గత కాలపు వైభవాన్ని మినహాయిస్తే… సమకాలీన క్రికెట్ లో వెస్ట్ ఇండీస్ అంటే గట్టిగా గుర్తొచ్చే పేరు క్రిస్ గేల్స్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆటగాడు. ముఖ్యంగా టీ 20ల్లో అరివీర భయంకరుడిగా అదరగొట్టిన తన రికార్డ్సే ఆ విషయం చెబుతాయి. వాస్తవానికి నాటి గ్యారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, లారా నుంచి మొదలు అలాంటి బ్యాటర్స్ కు వెస్ట్ ఇండీస్ లో కొదవేం లేదు. కానీ, నాటి ప్రాభవాన్ని వెస్ట్ ఇండీస్ ఈమధ్య కోల్పోతూ వస్తోంది. ఈ సమయంలో వెస్ట్ ఇండీస్ కు కెప్టెన్ గా వచ్చిన షాయ్ హోప్… బాపూరే బాప్ అనే తన పెర్ఫార్మెన్స్ తో జనంలో నాలుకలపైకొచ్చి కూర్చున్న తోపయ్యాడు.
షాయ్ హోప్… ఇప్పుడితడే వెస్ట్ ఇండీస్ ఆశ. భారత్ తో జరుగుతున్న సీరిస్ లో అదరగొడుతూ ఓ చర్చయ్యాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన నాల్గో టీ ట్వంటీలో హోప్ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం హాఫ్ సెంచరీ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 102 పరుగులతో నాటౌట్ గా నిల్చాడు. నాల్గు ఫోర్లతో పాటు… ఒక్కో సిక్సును విధ్వంసకరంగా తొమ్మిదిసార్లు బాది.. తొమ్మిది సిక్సులతో కళ్లు చెదిరేలా ఆడిన హోప్ ఆట కచ్చితంగా వెస్ట్ ఇండీస్ వంటి ప్రస్తుత టీంకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిచ్చేది.

ఆడుతుంటే రికార్డులు వాటంతట అవే వస్తాయి!
ఈ విషయాన్ని వెస్ట్ ఇండీస్ కెప్టెన్ హోప్ ఆట నిరూపిస్తోంది. హెప్ నిన్నటి హైదరాబాద్ సెంచరీతో టీ ట్వంటీలో అంతర్జాతీయ క్రికెట్ లో వెస్ట్ ఇండీస్ తరపున మూడు వరుస సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిల్చాడు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ క్రిస్ గేల్స్, ఎవిన్ లూయిస్ పేరిట ఉండేది. అంటే వెస్ట్ ఇండీస్ టీ ట్వంటీ సెంచరీల రికార్డును హోప్ తిరగరాశాడు.
విశేషమైన ఓ యాదృచ్ఛిక రికార్డ్!
హోప్ మూడుసార్లూ సాధించిన టీ ట్వంటీ సెంచరీల్లో.. మూడుసార్లూ 102 నాటౌట్ గా మిగలడం మరో విశేషం. 2025లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ చేసినప్పుడూ 102 నాటౌట్… 2026లో భారత్ పై రాంచీలో రెండో సెంచరీ చేసినప్పుడూ అప్పుడూ 102 నాటౌట్… ఇప్పుడు హైదరాబాద్ లో మూడో సెంచరీలోనూ 102 నాటౌట్.
టీ ట్వంటీల్లో సెంచరీలు చేయడమే గొప్ప.. కానీ, యాదృచ్ఛికంగా ఒకే స్కోరుతో నాటౌట్ గా మూడు టీ ట్వంటీ సెంచరీల్లోనూ నిలవడం మాత్రం ఓ అరుదైన గణాంకం. అంతేకాదు, భారత పర్యటనలో హోప్ కు ఇది నాల్గో అంతర్జాతీయ సెంచరీ. వన్డేల్లోనూ రెండు శతకాలు బాదిన హోప్.. టీ ట్వంటీల్లోనూ అదే దూకుడుతో ఆకట్టుకుంటున్నాడు.
రాంచీలో మొదలైన దూకుడు!
భారత పర్యటనకొచ్చిన వెస్ట్ ఇండీస్ దూకుడు రెండో టీ 20 నుంచి మరింత మొదలైంది. రాంచీలో భారత్ నిర్దేశించిన 249 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్ట్ ఇండీస్ ఉఫ్ అని ఊదేయడంలో… 45 బంతుల్లో 102 నాటౌట్ గా హోప్ చేసిన సెంచరీనే కీలకం. అలా వెస్ట్ ఇండీస్ కు టీ ట్వంటీల్లోనూ అత్యధిక విజయవంతమైన ఛేజ్ గా మరో రికార్డునూ రాసిపెట్టాడు హోప్.
హోప్ బ్యాటింగ్ విధానంలో గమనించాల్సిందేంటంటే..?
ఒకప్పుడు హోప్ ను నిలకడైన బ్యాట్స్ మన్ గానే చూసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితికి తగ్గట్టుగా గేర్ మార్చడం హోప్ ఆటలో కనిపించే ప్రధాన లక్షణం. అవసరమైనప్పుడు బౌలర్లపై విరుచుకుపడుతూ వారిని మానసికంగా తుత్తునియలు చేసే విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ లా హోప్ కనిపిస్తున్నాడు. పూర్తి స్వేచ్ఛగా ఆడుతూ వెస్ట్ ఇండీస్ నేటి తరం క్రికెటర్స్ కు.. తానో న్యూ హోప్ లా నిరూపిస్తున్నాడు.
2 వేల పరుగుల క్లబ్బులోకి కూడా!
హైదరాబాద్ సెంచరీతో హోప్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ ట్వంటీల్లో అంతర్జాతీయ క్రికెట్ లో రెండు వేల పరుగులు పూర్తి చేసిన నాల్గో వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మన్ గా నిల్చాడు. రోవ్ మన్ పావెల్, నికోలస్ పూరన్, బ్రాండన్ కింగ్ తర్వాత.. ఆ ఘనత సాధించిన నాల్గో వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్.
వ్యక్తిగత రికార్డులను మించి హోప్ పరిణతి!
వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు కోసం ఆడే తీరే హోప్ కు మరింత పేరు తెస్తోంది. ఇండియా టూర్ లో అతడి బాధ్యతాయుతమైన ప్రదర్శన… తన వ్యక్తిగత బ్యాటింగ్ తో పాటు, బాధ్యతాయుతమైన ఆట.. బౌలింగ్, ఫీల్డింగ్ లో కెప్టెన్ గా తీసుకునే నిర్ణయాలు… ఇవన్నీ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ కు పునర్వైభవం తీసుకొస్తున్న కొత్త హోప్ ను ముందుంచుతున్నాయి.


