ఏదైనా బిగ్ ఈవెంట్ కో.. కార్యక్రమానికో వెళ్తే కనీసం కర్ఛీఫైనా కానుకగా రాకపోతుందా అని కక్కుర్తిగా చూసే రోజుల్లో.. ఓ నైతికత గురించి.. అందులో దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఓ చెక్కు కథ గురించి మనమోసారి చెప్పుకుందాం. అప్పుడెప్పుడో తమిళనాడులో ఆయన బతికున్న కాలంలో జరిగిందీ ఘటన. ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఐడియల్ స్టోరీ! అందుకే అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. ఈ కథ చెప్పుకుని ఆయన్నోసారి తల్చుకుందాం.
తమిళనాడులో ఓచోట అక్కడి పేదల కోసం ఓ సంక్షేమ పథకం ప్రారంభోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతిగా ఉన్న కాలంలో.. కలాంను కూడా ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆయనా హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని సౌభాగ్య వెట్ మిక్సీస్ అండ్ గ్రైండర్స్ అమ్మే వ్యాపార సంస్థ స్పాన్సర్ చేసింది. కార్యక్రమం పూర్తయ్యాక.. అతిథులందరూ వెళ్లిపోతున్న క్రమంలో సదరు స్పాన్సర్ గా వ్యవహరించిన సంస్థ.. కలాంకు ఓ గిఫ్ట్ ప్యాకందించింది. కానీ.. కలాం మొదటగా మనం చెప్పుకున్నట్టు.. ఆఫ్ట్రాల్ కర్ఛీఫే కాదు.. అప్పనంగా అందితే కోట్ల రూపాయలిచ్చినా తీసుకోని వ్యక్తాయె! అందుకే.. ఆ బహుమానాన్ని అబ్దుల్ కలాం తిరస్కరించారు. కానీ.. సదరు సంస్థ నిర్వాహకులు అభిమానంతో.. సార్ ఇది చిన్న గిఫ్ట్ గా మా సంస్థకు సంబంధించిన ఓ గ్రైండరిది.. ఉంచండి పర్లేదంటూ బలవంతపెట్టారు. అప్పుడు కలాం అన్యమనస్కంగానే వేదికపై వాదనేంటన్నట్టుగా ఆ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితేర్పడింది.

అక్కడ కట్ చేస్తే.. ఇంటికొచ్చాక ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఓపెన్ చేశారు కలాం. వెంటనే తన వద్దనున్న మనిషిని.. ఈ గ్రైండర్ కి మార్కెట్ లో ఎంత ధరో తెలుసుకోమ్మని పంపారు. ఫలానా ధర అని తెలిశాక.. ఆ మిక్సీ మార్కెట్ ధరైన 4 వేల 850 రూపాయలు చెక్కు రాసి.. సదరు సౌభాగ్య కంపెనీకి పంపారు. మరీ ఇంత నీతి, నిజాయితీవంతులు ఇప్పటికీ ఉన్నారా అని ఆశ్చర్యపోయిన ఆ కంపెనీ నిర్వాహకులు.. ఏదో పెద్దమనిషి ఆ చెక్కును పంపిస్తే మాత్రం మనం తీసుకోవడమేంటని అనుకున్నారట! కానీ పంపింది.. కలాం. తప్పనిసరి పరిస్థితుల్లో చెక్ తీసుకున్న సౌభాగ్య సంస్థ యాజమాని.. దాన్ని బ్యాంకులో మాత్రం క్లెయిమ్ చేయకుండా.. తమవద్దే ఉంచుకున్నారు. పొస్ట్ డేటెడ్ టైంలోపు ఆ చెక్ ఇంకా బ్యాంకులో క్లెయిమ్ కాకపోగా.. ఆ చెక్కు కథేమైందో కలాం బ్యాంకర్స్ ను ఆరాతీస్తే.. ఇంకా క్లెయిమ్ కాలేదన్న సమాధానం వచ్చింది.
ఇంకేముందీ.. మళ్ళీ ఆ సౌభాగ్య వెట్ మిక్సీ అండ్ గ్రైండర్స్ కంపెనీకి అబ్దుల్ కలాం నుంచి ఓ లేఖ వెళ్లింది. అందులో ఏముందంటే.. మీరు వెంటనే చెక్కును బ్యాంకులో క్లెయిమ్ చేయకపోతే.. మీరిచ్చిన గ్రైండర్ ని తిరిగి మీ అడ్రసుకు పంపిచేస్తానని రాశారట కలాం.
ఇక తప్పదనుకున్న సౌభాగ్య సంస్థ వెంటనే ఆ చెక్కును బ్యాంకులో క్లెయిమ్ చేసి.. ఆ డబ్బులు డ్రా చేసుకుందట! అంతేనా..? ఆ అద్భుతమైన నైతికపాఠం ఎప్పటికీ గుర్తుండేలా.. అబ్దుల్ కలాం సంతకంతో ఉన్న ఆ చెక్కును ఫోటో తీయించి.. ఏకంగా వాళ్ల సంస్థ ముఖద్వారంలోకి ఎంట్రీ కాగానే కనిపించే విధంగా ఫ్రేం చేయించి వేసింది సౌభాగ్య సంస్థ.
మైకులు దొరికితే నీతి సూత్రాలు వల్లించి.. కన్నుచాటైతే అనైతికతంగా వ్యవహరించేవారెందరికో.. ఈ కలాం నైతికత.. ఓ చెంపపెట్టులాంటి కథ!


