రంధావాను నదితో ఎందుకు పోల్చారు..?
ఆ రాష్ట్రంలో ఐదు నదులుంటే… ఆరో నదితో ఓ మనిషిని పోల్చారంటే.. ఆ మనిషి ఎంత గొప్పవాడై ఉండాలి..? మరి ఎందుకు ఆ వ్యక్తిని నదితో పోల్చాల్సి వచ్చింది..? తెలుసుకోవాలంటే… పంజాబ్ కు వెళ్లాలి. దేశంలోనే ఒక అద్భుతమైన నగరంగా చెప్పుకునే చండీగడ్ పచ్చని అందాల వెనుక ఉన్న వ్యక్తి గురించి చెప్పుకోవాలి.
పంజాబ్ అంటే ముందుగా గుర్తొచ్చే ఐదు నదులు… సట్లెజ్, బియాస్, రవీ, చీనాబ్, జీలం. కానీ, ఆరో నదిగా ఓ వ్యక్తి ఆ గుర్తింపు సంపాదించారు. ఆయనే మోహిందర్ సింగ్ రంధావా!
1909, ఫిబ్రవరి 2న జన్మించి రంధావా… ఓ సివిల్ సర్వెంట్. కానీ, సివిల్ సర్వెంట్ గా సేవలందించడంతోనే ఆగిపోలేదు. వృక్షశాస్త్రంపై పరిశోధనలు చేశారు. చరిత్ర, వ్యవసాయం, జానపద సాహిత్యం, కళలు, ప్రకృతి పరిరక్షణపై కూడా లోతైన ఆసక్తితో అవగాహన కల్గినవాడు. 1986, మార్చ్ 3న ఆయన కన్నుమూశారు.
రంధావా కెరీర్ ఎలా సాగింది..?
1934లో రంధావా సివిల్ సర్వీస్ లో చేరారు. వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 1946లో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ గా నియమితులయ్యారు. 1947 ఆగస్ట్ 15, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరుపుకునే సందర్భంలో ఆయనదే కీలకపాత్ర. భారతదేశం తన భవిష్యత్ ముఖచిత్రాన్ని రాసుకునే tryst with destiny పేరిట జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగ సందర్భంలో పాలనా ఏర్పాట్లలో ఆయనదే ప్రముఖ పాత్ర.

విచారంలోకి నెట్టేసిన విభజన గాయాలు!
స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారత్ ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో విభజన ప్రధానమైనది. పాకిస్థాన్ లో తమ ఇళ్లు, భూములు వదిలి భారత్ కు వచ్చిన లక్షలాది మంది శరణార్ధుల పునరాసం పెద్ద సవాలుగా మారిన రోజులవి. అప్పుడు కూడా పునరావాసశాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు రంధావా. వచ్చిన శరణార్థులకు భూముల కేటాయింపు, వ్యవసాయానికి అవసరమైన వనరుల కల్పనలో ఆయన ముందుండి నడిపించారు. వచ్చినవారికి కేవలం తాత్కాలిక ఊరట కల్పించడం కాకుండా.. వారు వ్యవసాయంపై ఆధారపడి జీవించే విధంగా వారికి ఒక ఉపాధి కల్పనను చూపించారు.
వ్యవసాయంపై శాస్త్రీయ ఆలోచనలు చేసిన రంధావా!
రంధావాకు వ్యవసాయంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తో ఆయనకు ప్రారంభం నుంచే ఒక అనుబంధముండేది. తర్వాత ఐసీఏఆర్ వైస్ ప్రెసిడెండ్ గా, కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
శాస్త్రీయ పరిశోధనలపై మక్కువ కల్గిన మనిషి!
రంధావా ఆల్గీపై చేసిన పరిశోధనకు 1955లో యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుంచి డాక్టరేట్ ఆఫ్ సైన్స్ లభించింది. ఆల్గీ అంటే శైవలాలు, లేదా నాచు అని అర్థం. నీటిలో, తేమలో కిరణజన్య సంయోగ క్రియ చేసే జీవులు. అంటే చెట్ల మాదిరి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలా అని మొక్కలు కావు. ఆల్గీ అనేది వివిధరకాల జీవులను కలిపి సూచించే ఓ విస్తృత పదం.
అంటే ఒకవైపు సివిల్ సర్వెంట్ గా ప్రభుత్వ పాలనలో నిమగ్నమవుతూనే.. ఇంకోవైపు ప్రయోగశాలల్లో శాస్త్రీయ పరిశోధనలు చేశారు మోహిందర్ సింగ్ రంధావా.
చండీగడ్ ను పచ్చని ఉద్యానవనంలా మార్చిన ఆధునిక శిల్పి!
రంధావా గురించి పంజాబ్ ఇప్పటికీ మాట్లాడుకుంటుందన్నా… భారతదేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుందన్నా అందుకు చండీగడ్ కు ఆయన ఇచ్చిన పచ్చని రూపమే కారణం.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చండీగడ్ ను పంజాబ్ కొత్త రాజధాని చేయాలని నిర్ణయించారు. నగర ప్రణాళికలో లే కార్బూజియర్ వంటి ప్రముఖ ఆర్కిటెక్టులను నియమించుకున్నారు. అయితే, నగరమంటే కేవలం రోడ్లు, భవనాలతో కాంక్రీట్ జంగిల్ లా తయారుచేయడం కాదన్నది రంధావా భావన.
చండీగడ్ నగర అభివృద్ధిలో నగరానికి చెట్లు, ఉద్యానవనాలు, పచ్చనిదనం అవసరమని పట్టుబట్టాడు. 1955లో చండీగడ్ ప్లానింగ్ కమిటీకి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అలా టౌన్ ల్యాండ్ స్కేపింగ్ లో ఆయనది కీలక పాత్ర. 1966లో చండీగడ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డప్పుడు ఆయనే తొలి చీఫ్ కమిషనర్. చాలా నగరాలు దేశంలో ఉన్నా… భారత్ లో చండీగడ్ కు ఒక ప్రత్యేకత రావడంలోనూ.. కేవలం ప్రణాళికాబద్దమైన నగరంగానే కాకుండా… పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలోనూ రంధావా ఆలోచనలే ప్రధాన కారణం.
గుర్తింపు తెచ్చిపెట్టిన గులాబీతోట!
చండీగడ్ లోని ప్రసిద్ధమైన రోజ్ గార్డెన్ ఆయన వారసత్వంగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ ఉద్యానవనానికి రంధావా పేరు కూడా పెట్టారు అక్కడి పాలకులు. చెట్లు, పూలు, ఉద్యానవనాలు నగర సౌందర్యానికే కాదు.. ప్రజల జీవన నాణ్యతకూ అవసరమని ఆలోచించిన ముందుచూపు కల్గిన వ్యక్తిగా రంధావా పేరు పంజాబ్ రాజధాని నిర్మాణంలో చిరస్థాయిగా నిల్చిపోయింది.
ప్రకృతి ప్రేమికుడే కాదు.. కళా ప్రియుడు!
రంధావా ప్రపంచం చెట్లు, వ్యవసాయం, వృక్షశాస్త్ర ప్రయోగాలు, సివిల్ సర్వెంట్ గా సేవలందించడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. మంచి కళాప్రియుడు. పంజాబ్ జానపద కళలు, సాహిత్యం, సంస్కృతి, కళాకారుల జీవితం వంటి అంశాలను సేకరించి డాక్యుమెంట్ చేశారు. చండీగడ్ మ్యూజియం, పంజాబ్ ఆర్ట్స్ కౌన్సిల్ వంటి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన సంస్థల ఏర్పాటులోనూ ఆయన ఎనలేని కృషి కనిపిస్తుంది. వ్యవసాయ చరిత్రపైనా, పంజాబ్ కళా, సాంస్కృతిక జీవన విధానంపైనా ఆయన అనేక రచనలు చేశారు.
జనాలు ప్రజావాణి చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతుంటే.. ప్రతీవారం తిప్పించుకుంటున్న అధికారులను చూస్తున్న ఈరోజుల్లో… రంధావా వంటి ప్రభుత్వ అధికారులెలా ఉండేవారో వారికొక పాఠం కావాలనిపిస్తుంది. అంటే ఒక సివిల్ సర్వెంట్ అయిన అధికారి.. కేవలం తన చుట్టూ ఫైళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. భూములు, పంటలు, చెట్లు, కళలు, సంస్కృతి, మనుషుల జీవితాలు.. ఇలా అన్నింటినీ గమనించిన సంపూర్ణత్వం ఆ అధికారిలో కనిపించేది.
అందుకే ఆయనకు పంజాబ్ ఆరోనదితో పోలిక!
పంజాబ్ లో ఉన్న ఐదు జీవ నదులకు తోడు.. మరో జీవనదిగా రంధావా పేరు సంపాదించుకున్నారు. ఒకే రంగంతో తన జీవితానికి నిర్వచనమివ్వకుండా… స్వాతంత్ర దినోత్సవాన నెహ్రూ ప్రసంగ సమయంలో పాలన నుంచి… విభజన తర్వాత శరణార్ధుల పునరావసం వరకు… వ్యవసాయ పరిశోధనల నుంచి చండీగడ్ ను ఓ నమూనా నగరంగా అభివృద్ధి చేయడం వరకూ.. కళలు, సాహిత్యం నుంచి సంస్కృతి పరిరక్షణ వరకూ మెహిందర్ సింగ్ రంధావా పంజాబ్ పై అడుగడుగునా తనదైన ముద్ర వేసిన అధికారిగా నిల్చాడు.
ఆయన జీవిత చరిత్ర రాసిన గుల్జార్ సింగ్ సంధూనే.. ఆయన్ను పంజాబ్ దా చెవాన్ దరియా అంటే.. పంజాబ్ ఆరో నది అనే బిరుదుతో పాప్యులర్ చేశారు. నదులు తన చుట్టూ ఉన్న జీవజాలానికి ఉపయోగపడుతూ, మానవ సమాజ నాగరికతలో కీలకపాత్ర పోషించినట్టే… పంజాబ్ లో అనేక రంగాలను అత్యంత ప్రభావితం చేశారుగనుకే.. రంధావాను ఆరో నదిగా పోల్చుకుంటూ గౌరవించింది పంజాబ్.


