ఎక్కడ పెళ్లి బ్యాండ్ బారాత్ ఉన్నా… ఆ పాట వినిపించడం తప్పనిసరి. కుర్రకారుకు కిక్కెక్కించిన వెర్సటైల్ సాంగ్ అది. అందులోనూ తమ అభిమాన హీరోనే స్వయంగా పాడిన పాట… పైగా స్త్రీ వేషంలో కవ్వించే డ్యాన్స్… వెరసి లావారీస్ అంటే మేరే అంగ్నే మే పాట. ఆ సినిమా హిట్ లో ఆ పాటదెంత కీలకపాత్రో… అమితాబ్ కెరీర్లో ఆ పాట కూడా ఓ మైల్ స్టోన్. అందుకే ఇప్పటికీ, ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది.. వన్స్ మోర్ అనిపిస్తూనే ఉంటుంది. అయితే, అమితాబ్ కు అంత హిట్ పేరు తెచ్చిన పాట… కెరీర్ లో ఓ మెయిన్ పీజీగా నిల్చిన పాట… లావారీస్ సినిమా హిట్ లోనూ వన్స్ మోర్ అని పబ్లిక్ డిమాండ్ అయిన పాట… అమితాబ్ కంటే ముందున్న ఏ సూపర్ స్టార్ కు.. ఎందుకు నచ్చలేదు..? ఆ పాట కన్నా… ఆ పాటలో అమితాబ్ చీర కట్టుకుని డ్యాన్స్ చేయడాన్ని సదరు స్టార్ హీరో బాహాటంగానే తప్పు పట్టేశాడట. ఇంతకీ ఎవరా హీరో అంటే… రాజేష్ ఖన్నా!

తానొక స్టార్ హోదాకు వచ్చిన తర్వాత తన గౌరవానికి భంగం కల్గే పనిలో తానెప్పుడూ రాజీపడనని కూడా రాజేష్ ఖన్నా కరాఖండిగా ఒకానొక సమయంలో రివీలయైపోయాడట.
వాస్తవానికి రాజేష్ ఖన్నా తెర నుంచి నిష్క్రమించే రోజుల్లో… అమితాబ్ అప్పుడప్పుడే పుంజుకుంటున్నాడు. 1970ల కాలంలో ఈ ఇద్దరూ హీరోలుగా ప్రత్యర్థులు కూడాను. అమితాబ్ అప్పటికే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న వేళ అది. బాలీవుడ్ అంతా కాక అని పిల్చుకుంటూ గౌరవించే రాజేష్ ఖన్నా మాత్రం… పీక్స్ కు వెళ్లిన తన కెరీర్ ను నిలబెట్టుకునే యత్నంలో ఉన్నాడు. 1980లలో రాజేష్ ఖన్నా కెరీర్ ఇక క్షీణదశకు వచ్చేసింది. అదే సమయంలో అమితాబ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాడు. ఆ సమయంలోనే లావారీస్ రిలీజైంది. ఆ సినిమాలో మేరే అంగ్నే మే పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.. కానీ, రాజేష్ ఖన్నా మాత్రం ఆ పాటకు ఆమోదముద్ర వేయలేదు.
మేరే అంగ్నే మే పాటలో అమితాబచ్చన్.. ముద్దుగా చీర కట్టుకుని తానే స్వయంగా పాడుతూ.. తన స్వరానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేసి క్లాప్స్ కొట్టించాడు. కానీ రాజేష్ ఖన్నాకు మాత్రం ఆ నటన అంత గౌరవంగా అనిపించలేదనే విషయాన్ని.. యాసర్ ఉస్మాన్ అనే రచయిత… రాజేష్ ఖన్నా, ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ అనే తన పుస్తకంలో పొందుపర్చాడు. 1982లోనే ఓ ఫిల్మ్ మ్యాగజైన్ తో.. తానెప్పుడూ గౌరవం విషయంలో రాజీపడనని.. డబ్బుకో.. లేక, అభిమానుల చప్పట్ల కోసమో ఏది పడితే అది చేయనని కరాఖండిగా చెప్పాడట రాజేష్ ఖన్నా.
ప్రకాష్ మెహ్రా డెరెక్షన్ లో అమితాబ్, జీనత్ అమన్ నటించిన లావారీస్ 1981లో ఒక ఊపు ఊపింది. అమితాబ్ అందుకున్న పెద్ద హిట్స్ లో అదీ ఒకటి. బచ్చన్ నటించిన కాలియా, యారానా, నసీబ్ కూడా అదే ఏడాది విడుదలై పెద్ద విజయాలు సాధించి… తనను ఓ సక్సెస్ ఫుల్ స్టార్ గా నిలబెట్టి బాగా కలిసివచ్చినన సంవత్సరమది. అదే సమయంలో విడుదలైన రాజేష్ ఖన్నా కుద్రత్ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను మాత్రమే అందుకుంది. అలా అవతార్ రూపంలో ఓ మంచి హిట్ ను మళ్లీ తిరిగి అందుకునేందుకు రాజేష్ ఖన్నా 1983 వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది.
రాజేష్ ఖన్నా పీక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ గా వెండితెర రారాజుగా ఏలుతున్న 1971 సమయంలో… అమితాబ్ స్టార్ డమ్ ను అప్పుడప్పుడే రుచి చూస్తున్న వేళ… ఆ ఇద్దరు ఆనంద్ తో జట్టు కట్టారు. ఆ మల్టీస్టారర్ మూవీ కూడా ఓ పెద్ద హిట్ అన్న సంగతి తెలిసిందే. అయితే, యాదృచ్ఛికంగా రాజేష్ ఖన్నా పీక్ లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న వేళ.. అమితాబ్ అప్పుడప్పుడే సక్సెస్ చూస్తున్న సమయంలో ఆనంద్ తో జట్టుకడితే… ఆ తర్వాత, ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన నమక్ హరామ్ సినిమా చూస్తున్నప్పుడు.. రాజేష్ ఖన్నా ఇక తన స్టార్ డమ్ ను అమితాబచ్చన్ చేతుల్లో పెడుతున్నాడనే అనుకున్నారంతా. ఆ మాటకొస్తే ఆ విషయం రాజేష్ ఖన్నాకు కూడా తెలుసునట. ఆ సమయంలోనే హృషీదాతో… ఇదిగో రేపటి సూపర్ స్టార్ ఇతనే అంటూ అమితాబ్ గురించి తాను చెప్పిన సంగతులూ గుర్తు చేసుకున్నారట రాజేష్ ఖన్నా. నమక్ హరామ్ తర్వాత రాజేష్ ఖన్నా, అమితాబ్ ఇద్దరూ కలిసి ఇక తిరిగి ఏ సినిమాలోనూ కనిపించలేదు.



