యాస సక్కగ రాని తెలంగాణ పిలగాని మనోగతం ✍️✍️

తెలంగాణ యాస సక్కగ రాని తెలంగాణ పిలగాని మనోగతం!

విశీ.. ✍️

… తెలంగాణ కథకులు, కవుల తరపున మాట్లాడినప్పుడు, సినిమాల్లో తెలంగాణ నటులు బాగా చేశారనే కామెంట్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఎక్కడినుంచో ఒక వాక్యం వచ్చిపడుతూ ఉంటుంది – “మనందరం తెలుగువాళ్లం. ఇందులో మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర ఏమిటీ? తెలుగు జాతి అనండి”.

సార్ & మేడమ్! నిజమే కళకు భాష/ప్రాంతం/కులం/మతం ప్రాతిపదిక లేదు. ఎవరూ సృష్టించలేరు కూడా! కానీ వందలమంది బలిదానాలు చేసి, లాఠీల దెబ్బలు తిని తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం మీద మాకు బోలెడంత ప్రేమ ఉంటుంది. చెప్పలేనంత మమకారం ఉంటుంది. ఎవరూ వెలకట్టలేనంత అభిమానం ఉంటుంది. మాకొక ప్రత్యేక గుర్తింపు కావాలనే కదా ఇంత పోరాటం చేసింది. ఆ ఫలితాన్ని అందిపుచ్చుకున్న క్రమంలో మాకై మేము సగర్వంగా చాటుకునే సంగతి అది. మా ఆనందం మాది. దాన్ని కాదంటే ఎట్లా? తెలుగు జాతి అనే మీ మాటకు భాష ప్రతిపాదిక అయితే, తెలంగాణ అనే మా మాటకి ప్రాంతం ప్రాతిపదిక. అంతేగా తేడా! మేమేమీ విభేదాలు సృష్టించడం లేదు, మా అస్తిత్వాన్ని వివరిస్తున్నాం.

మాది తెలంగాణ. మేం తెలంగాణ వాళ్లం. మాట గట్టిగా, మనసు మెత్తగా ఉండేవాళ్లం. సంగతేదైనా సరే, దబాయించి నిక్కచ్చిగా మాట్లాడేవాళ్లం. పోరాటాలనే బతుకు బాటలుగా చేసుకున్నవాళ్లం. ఆ పోరాట పటిమను ఎన్నడూ విడిచిపెట్టనివాళ్లం. మాకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన వాళ్లం. ఎడతెగని తన్లాటల్లోనూ ఎదురొడ్డి నిలిచినవాళ్లం. కొట్లాడి కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నవాళ్లం. అందుకే ఇప్పుడు మేం మా ఘనతను నిలువెత్తున చాటుకుంటాం. చాటుతూనే ఉంటాం!

మాకెప్పుడూ ఎవరి మీదా కోపం లేదు. ఎవరి మీదా కక్ష లేదు. పక్కనే ఉన్న ఆంధ్ర అంటే మాకెవరికీ చిన్నచూపు లేదు. ఇప్పుడేంటి, అసలేనాడూ లేదు. ఉన్నట్టు సృష్టించిన రాజకీయ చదరంగంలో మేము పావులమే తప్ప పాపులం కాదు. మీరు హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూడకుండా ఉన్నారా, మేం తిరుపతికొచ్చి ఏడుకొండలు ఎక్కకుండా ఉన్నామా? మాకు మీరు కావాలి. మీకు మేం కావాలి. మనకు మనం ఎప్పుడూ కావాలి. మీరూ, మేమూ ఇద్దరం బాగుండాలి. కోపంలో మేమొకమాట జారినా బెజవాడ కనకదుర్గమ్మ మమ్నల్ని కడుపున దాచలేదా? ఆవేశంలో మీరో మాట అన్నా కొమిరెల్లి మల్లన్న మిమ్మల్ని చల్లగా చూడలేదా? అన్నదమ్ముల నడుమ అలకలు ఎంతకాలం? అవ్వన్నీ దూదిపింజలే! మీరైనా, మేమైనా ఒకరి మీద ఒకరం పానమున్న మనుషులమే!

మా తెలంగాణ పుట్టి తొమ్మిదేళ్లు దాటి ఇప్పుడు పదో ఏడులో పడింది. ఆనందం. ఇంతకింత ఆనందం. చెప్పలేనంత ఆనందం. పక్కనే ఉండి మాకు కాపు కాస్తున్న సుట్టు ముట్టు రాష్ట్రాల సుట్టపోల్లందరికీ శనార్థులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles