కన్న తల్లి వంటి ఉన్న ఊరిని వదిలి వెళ్లలేరు. వెళ్లాల్సిన గత్యంతరం లేని పరిస్థితులున్నా… ఎక్కడికెళ్లాలో తెలియదు. ఎక్కడికైనా వెళ్లితే.. తమ పరిస్థితి మంచు పర్వతం పైనుంచి అగ్నిజ్వాలల్లో పడ్డట్టు కాదు కదా అనే మరో సందేహం! ఇన్నింటి మధ్య నిత్యం జీవన్మరణ సమస్యే… ఆ హిమాలయ గ్రామస్థుల బతుకుచిత్రం!!
తక్కిన ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ లోని తషీగ్యాంగ్. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ మినహా… మిగతా ఏ మార్గం కనిపించదు. 15 వేల అడుగుల ఎత్తులో… ఇప్పటికీ సరైన ఉపాధి లేక, మరోవైపు తాగు నీటి సమస్యనెదుర్కొంటోంది హిమలయాల్లో ఎక్కడో పైకి విసిరేయబడ్డ ఈ ఊరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతి ఎత్తైన… కేవలం 62 మంది ఓటర్లున్న ఓ పోలింగ్ స్టేషన్.

1947 అంటే… స్వాతంత్ర్యం వచ్చి సుమారు 77 ఏళ్ల పైమాటే. ఎన్నికల కాలం వచ్చిదంటే… ఇక్కడ పని చేయాల్సిన సిబ్బందికి భూమ్మీదే చుక్కలే. స్వతంత్ర భారతంలో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇక్కడి ప్రజలు కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య కనీసం రోడ్డు మార్గం లేక, బతకడానికి ఉపాధి లేక, దాహమైతే తాగేందుకు మంచి నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేక పడుతున్న అవస్థలు… మిగతా ప్రపంచానికి అవసరం లేకపోవచ్చునేమోగానీ… ఇక్కడి ఓటర్లను కూడా వదలకుండా ప్రతీ ఐదేళ్లకోసారి పోలింగ్ నిర్వహిస్తున్న ప్రభుత్వాలకు పట్టకపోవడం మాత్రం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ!
జూన్ 1వ తేదీతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన 7 విడత పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఏడో విడతలోనే ఇదిగో తషీగ్యాంగ్ తో పాటు.. దీని పక్కనే ఉన్న మరో ఇలాంటి గ్రామం గెటే కూడా సిద్ధమై కళ్లకు కట్టిన కష్టాలే.. ఇప్పటికీ మన పాలకుల దృక్కోణాలు ఎంత మేరకు విస్తరించగల్గుతున్నాయి… ఇలా ఎక్కడో మిగిలిన ప్రపంచం నుంచి విసిరివేయబడేట్టుండే వారిపై కనీస దృష్టి ఎందుకు సారించలేకపోతున్నారనేవి చర్చకొస్తున్నాయి.

ఉదాహరణకు కల్జాంగ్ డోల్మా అనే ఓ మహిళ కథ వింటే.. ఎంత కఠిన పరిస్థితుల్లో ఈ హిమాలయ కొండల్లోని తషీగ్యాంగ్ ప్రజలు దుర్భర జీవితాల్ని నెట్టుకొస్తున్నారో అర్థమవుతుంది. డోల్మా రాష్ట్ర ప్రజా సంక్షేమశాఖలో ఏవో కారణాల వల్ల తన ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో డోల్మాకు 13 వేల రూపాయల జీతం వచ్చేది. ఆ వేతనంతో ఆమె కూతురు పాఠశాల ఫీజులు చెల్లించే అవకాశముండేది. డోల్మా కుటుంబీకులు మొత్తం ఆరుగురు. డోల్మా ఉద్యోగం పోయింతర్వాత.. ఆమె కుటుంబం మొత్తం బఠాణీలు పండిస్తూ పొట్ట పోసుకునేది. అయితే, పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ లో మళ్లీ డోల్మాకు కాంట్రాక్టర్ ఉద్యోగం వచ్చేవరకూ.. పొట్ట నింపలేని చాలీచాలని బఠాణీల పంటే వారి జీవనాధారం. కానీ, రోడ్డు కాంట్రాక్ట్ వర్కర్ గా కూడా డోల్మా ఉద్యోగ కాలపరిమితి ముగిశాక.. మళ్లీ వ్యవసాయమే దిక్కైంది. కానీ, వంద బస్తాలు పండే బఠాణీలు.. ఇప్పుడు 25 బస్తాలకు దిగుబడి పడిపోవడంతో.. తాము నమ్ముకున్న వ్యవసాయం కూడా సాయమందించలేని స్థితిలో డోల్మా కుటుంబముంది. తాషీగ్యాంగ్ లో స్కూల్ లేదు. కాబట్టి… డోల్మా కూతురు 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ హిమచల్ ప్రదేశ్ లోని లౌహౌల్-స్పితి జిల్లా కేంద్రం కాజా పట్టణంలోని బోర్డింగ్ స్కూల్ లో చదివేది. కానీ, ఇప్పుడు ఫీజు కట్టలేని స్థితిలో డోల్మా కూతురు చదువు ఆపేయాల్సిన పరిస్థితి. ఆ విషయాన్ని 30 ఏళ్ల వయస్సులో ఆ మహిళ నవ్వుకుంటూ ఎలా చెప్పగల్గుతుంది..? కథంతా ఆవేదనేగా..?
ఇదొక కల్జాంగ్ డోల్మా కథే కాదు… ఎందరో డోల్మాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కోల్పోయి.. తాషీగ్యాంగ్ నిరుద్యోగితకు కేరాఫ్ లా మారిందిప్పుడు. తమకు పర్మినెంట్ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఉద్యమాలు చేసి డిమాండ్ చేశారు. వ్యవసాయం లాభసాటిగా లేక.. తాము ఎంత దుర్భరమైన జీవితాలనుభవిస్తున్నామో సర్కారు దృష్టికి కళ్లకు కట్టారు. అయినా, అతీగతీ లేదు.
2019 ఎన్నికల నాటి నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ గా గుర్తింపు పొందిన తాషీగ్యాంగ్ లో… నీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం అంతకుముందు నుంచే పెచ్చుమీరిన సంగతి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికీ తెలుసు.
స్పితీవ్యాలీలో భాగమైన తాషీగ్యాంగ్ లో వర్షాలు అరుదు. వచ్చినా అప్పుడో ఇప్పుడో చిటపట చినుకులే. దీంతో ఇక్కడి వారు హిమానీనదాలపైనే ఆధారపడతారు. లేదా, మంచు కురిసినప్పుడు ఒడిసిపట్టుకుంటేనే వీరికి తాగడానికైనా, సాగుకైనా నీరందే పరిస్థితి. కొంత కాలం నుంచి హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మరోవైపు మంచు కురవడం కూడా తగ్గుతుండటం కూడా ఇప్పుడు నేరుగా తాషీగ్యాంగ్ ప్రజల జీవన సరళిని మరింత కఠినతరం చేసింది.
భారత్-చైనా సరిహద్దులో ఉన్న స్పితీ వ్యాలీ.. మండి అనే లోక్ సభ స్థానంలో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని నాల్గు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి. అంతేకాదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మన భారతదేశంలో.. మన మల్కాజిగిరి తర్వాత రెండో అతి పెద్ద నియోజకవర్గం. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున కంగనా రనౌత్ పోటీ చేస్తుంటే… ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నాడు.
జూన్ 1న చివరి ఏడో విడతలో ముగిసిన పోలింగ్ లో.. 62 మంది ఓటర్లతో ఉన్న తాషీ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ లోనే ఓ మాడల్ పోలింగ్ స్టేషన్.
ఎండాకాలంలోనే 5 నుంచి 20 డిగ్రీలకు మించని ఉష్ణోగ్రతలతో కనిపించే తాషీగ్యాంగ్, దీని చుట్టుపక్కల గ్రామాల్లో.. శీతాకాలంలోనే మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి. తాషీగ్యాంగ్ నుంచి కాజాకు కలిపే మట్టి రహదారి కూడా మూసుకుపోయి ఉంటుంది. కేవలం ఇళ్లకే జనమంతా పరిమితం కావల్సిన రోజులవి. కరోనా సమయంలో కొన్ని నెలలపాటు ఇళ్లకే పరిమితమైతేనే.. ఈ ప్రపంచం ఎంతలా అల్లాడిపోయిందో చూశాం. అలాంటిది, ప్రతీ చలికాలం తాషీగ్యాంగ్ కు ఈ తిప్పలు తప్పవు. పైగా సమ్మర్ సమీపిస్తే ఇక్కడ కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో.. ఉన్న కొన్ని జలవనరులు కూడా ఎండిపోతుండటంతో… సాగుకు అనుకూలమైన రోజుల్లోనూ నీళ్లు లేక వీరి యాతన చెప్పతరం కానిది.
ఓవైపు జలవనరులు లేక, మరోవైపు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, ఉద్యోగాలు, ఉపాధి లేక… ఎన్నిసార్లు మొత్తుకున్నా చెవిటివాడి చెవిలో శంఖమూదిన చందంగా పాలకులు వ్యవహరించారు. దీంతో ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని తాషీగ్యాంగ్ తో పాటు గెటే వంటి ఊళ్లల్లో ఓ తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ, ఈసారి ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. కచ్చితంగా సాయమందిస్తామని నాయకులు స్పష్టమైన హామీలివ్వడంతోనే.. తామంతా ఈ ఒక్కసారి చూద్దామని పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్టు తాషీగ్యాంగ్ వాసులతో పాటు.. చుట్టుపక్కల ఇదే దుర్భర పరిస్థితులనుభవిస్తున్నవారంతా చెబుతున్న మాట.
గెటే గ్రామంలోనూ సేమ్ టూ సేమ్ తాషీగ్యాంగ్ పరిస్థితే! 30 మంది మాత్రమే జనాభా నివశిస్తున్న ఈ ఊరికి కూడా కనీసం రహదారి కనిపించదు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం సమీప పట్టణమైన కాజా నుంచి తాషీగ్యాంగ్, గెటే, కిబ్బర్ వంటి ఇక్కడి గ్రామాలకు వేసిన రహదారి మొత్తం పెచ్చులూడి ప్రయాణమంటేనే ఓ నరకయాతనలా తయారైంది పరిస్థితి. రోడ్లు బాగు చేస్తే తమ గ్రామాలు పర్యాటకంగా కూడా ఆకట్టుకుంటాయంటున్నారు ఇక్కడి స్థానికులు. అయితే, 62 మంది ఓటర్లు, 20 మంది ఓటర్లుండే ఊర్లకు ప్రధాన అభ్యర్థలెవ్వరైనా వచ్చి ప్రచారం చేశారా అంటే మాత్రం.. ఇవే గ్రామాల ప్రజలు నవ్వుతూ.. ఇంత తక్కువ ఓటర్స్ ఉన్న ప్రాంతాలకు వారు రావడమేంటి సార్ భలేవారు మీరంటూ ఒకింత నిర్వదమైన నవ్వుతూ ఉల్టా ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
మరి ఇప్పటికైనా మిగతా ప్రపంచంతో విడదీయబడ్డట్టున్న ఈ గ్రామాలను.. తిరిగి ఇదే ప్రపంచంతో కలిసిపోయేలా ఈసారైనా పాలకులు ప్రయత్నిస్తారా.. లేక, హామీలు మళ్లీ ఉట్టి ఎన్నికల నీటి మూటలేనా అన్నది కాసిన్ని రోజులు వెయిట్ చేస్తేనేగానీ తేటతెల్లమవ్వదు.



