మానవత్వమంటే ఏంటి…? ఈ ప్రశ్నకు ఎన్నో కదిలించే సమాధానాలు అరుదుగా కనబడుతూనే ఉన్నా.. తమిళనాడు డ్రైవర్ చూపిన కన్సర్న్ తాజాగా మనల్ని కట్టిపడేసేది. తాను చనిపోతున్నానన్న విషయం తెలిసి… తనలాగా మిగిలిన పిల్లలూ విగతజీవులు కావొద్దని.. తాను మరణించినా… వారి కుటుంబాల్లో చిరంజీవిగా మిగిలిపోయిన తమిళనాడులోని ఓ వ్యాన్ డ్రైవర్ కథ ఇది!

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల వయసున్న సెమలయప్పన్.. స్కూల్ విద్యార్థులను ఇంటికి దింపేందుకు వెళ్తున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ హృదయ విదారకమైంది. తాను ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో… వెంటనే సుదురాయించి.. నడిరోడ్డుపైనున్న వ్యాన్ ను తీసుకెళ్లి ఓ సేఫ్ ప్లేస్ లో ఆపి కుప్పకూలిపోయాడు. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులున్నారు. ఆ తర్వాత సెమలయప్పన్ ను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది.
ఆ వీడియోతో పాటు.. అపస్మారక స్థితిలో సెమలయప్పన్ ఆ వ్యాన్ సీటులో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. X వేదికగా చాలామంది సెమలయప్పన్ తాను చనిపోతున్నా… తన పరిస్థితి పిల్లలకు రాకూడదని.. నడిరోడ్డుపై ఏదైనా జరగరానిది జరిగకూడదన్న ఒక బాధ్యతతో తాను వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. చాలామంది సెమలయప్పన్ కు సెల్యూట్ చేస్తున్నారు.
ఈ దురదృష్టకర ఘటన జూలై 24, బుధవారం.. వెల్లకోయిల్ లోని ఏఎన్వీ మెట్రిక్ స్కూల్ విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి దింపేందుకు తీసుకెళ్లే క్రమంలో జరిగింది. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే అతి కష్టమ్మీద సెమలయప్పన్ ఎలా రోడ్డు పక్కకు వ్యాన్ ను తీసుకెళ్లాడో ఆ స్కూల్ బస్సులో ప్రత్యక్షసాక్షులుగా ఉన్న విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాట.. ఒక బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి ఏ రంగంలోనైనా ఎలా నడుచుకోవాలో చెప్పేది.
సెమలయప్పన్ భార్య కూడా అదే స్కూల్ లో హెల్పర్ గా పనిచేస్తోంది. మృత్యువు అంచున తానుండి… ఆ పరిస్థితి పిల్లలకు రావొద్దన్న గట్టి సంకల్పంతో వ్యాన్ ను సేఫ్ గా ఆపి గుండెపోటుతో మృతి చెందిన సెమలయప్పన్ మానవత్వాన్ని ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు అంతా కొనియాడుతున్నారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలుస్తున్నా.. పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడిన సదరు సెమలయప్పన్ కర్తవ్య భావన, ఆత్మ బలిదానానికి అభివాదం చేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటనలో తెలపగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సెమలయప్పన్ కుటుంబానికి పరిహారం ప్రకటించడంతో పాటు.. ఆయన పనిచేస్తున్న స్కూల్ లో ఘన నివాళులర్పించారు. పలువురు మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతిని తెలియజేయడంతో పాటు.. అండగా నిలుస్తామని భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు డ్రైవర్ సెమలయప్పన్ చూపిన మానవత్వం మాత్రం… ఇప్పుడా చిన్నారుల కుటుంబీకుల్లో అంతకుమించిన ఆనందాన్ని, మరోవైపు అంతకుమించి సెమలయప్పన్ మృతి విషాదాన్నీ రేపింది.
సెమలయప్పన్ కు తెలిసిపోయింది.. ఇక తానెలాగూ బతకనని.. కానీ, తనతో ప్రయాణిస్తున్నవారు.. తన భుజాలపైనై ఆ డ్రైవింగ్ బాధ్యత పెట్టినవారికి, ఆ చిన్నారులకూ ఏమీ కాకూడదని.. ఆ చిన్నారుల కుటుంబాల్లో విషాదం నింపొద్దన్న సంకల్పంతో హార్ట్ ఎటాక్ కు గురైన సమయంలో సెమలయప్పన్ వ్యవహరించిన తీరు.. మానవత్వానికి ప్రతీకై నిల్చింది.



