“చూసినోళ్లు ఏమంటారు” (నోడిదవరు యేనంతారే)
…………………………………….
Maruthi Powrohitham.. ✍️
కన్నడ సినిమా. చాలా బావుంది. కన్నడ తెలియక పోయినా ఇంగ్లీష్ sub titles తో అర్థం చేసికోవచ్చు.
సిద్ధార్థ్ ఒక అస్తిత్వవాది, అతను తన ఇంటిని వదిలి తెలియని వాటిని వెతుక్కుంటూ, తనను తాను వెతుక్కుంటూ వెళ్తాడు. జీవితాన్ని అర్థం చేసుకొనే ఒకానొక తాత్విక దృక్పధం గురించి ఈ సినిమా అద్భుతంగా చెప్పగలిగింది.

ఈ సినిమాలో కొన్ని సంభాషణలు భలే ఉన్నాయి.
“నాదైన జీవితం నాకు కావాలి”
“మొదట ఇంజనీరింగ్ లో చేరి పూర్తి చేస్తాం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఏం చేయాలని ఆలోచిస్తాం”
హీరో కు తన ప్రయాణంలో గొర్రెల కాపరైన ఒక పిల్లవాడు పరిచయం అవుతాడు. సమస్యలను వాడు స్వీకరించే తీరు అతడిని ఆశ్చర్య పరుస్తుంది. వాడు హీరోతో ఇలా అంటాడు “నీవు చెప్పేది ఏమీ నాకు అర్థం కాలేదు. మా అమ్మ చెప్పేవి కూడా అర్థం కానప్పుడు అమ్మ నీవు పెద్దగైతే అర్థం అవుతాయి అనేది. కానీ చూస్తుంటే నీతో ఎన్నిరోజులు ఉన్నా పెద్దగయ్యేటట్లు లేను”
పిల్లవాడిని హీరో తనతోపాటు బెంగళూరు రమ్మంటాడు.
“వచ్చి ఏంచేయాలి ?”
“మంచి స్కూల్లో చదివిస్తా”
“చదివి ?”
“మంచి ఉద్యోగం చేయొచ్చు. కారు కొనొచ్చు”
“గొర్రెల కాపరికి కారెందుకు?”
“గొర్రెలు కాయాల్సిన పనిలేదు. బెంగళూరు బావుంటుంది ”
“బెంగళూరు బావుంటే మరి నీవు ఇక్కడకు ఎందుకొచ్చావు?”
“ఎక్కవలసిన బస్సును ఎక్కలేక పోయావ్.చదివి ఏం ప్రయోజనం ?”
బీచ్ లో పరిచయం అయిన ఒక అమ్మాయి ఇలా అంటుంది.. “పాత ఉత్తరాల్లోని అక్షరాలను మన చేతితో తడిమినప్పుడు ఎవరిదో చేయి పట్టుకొన్నట్లుగా అనిపిస్తుంది”
“మన జీవితం చాలా చిన్నది.ఉన్న సమయాన్ని ప్రేమించటానికే కేటాయించాలి. ద్వేషించవద్దు. ద్వేషించవలసిన వారిని క్షమించి వదలివెయ్” ఇలా హృదయాన్ని తాకే సంభాషణలు ఉన్నాయి.
కులదీప్ కరియప్ప చక్కగా తీర్చిదిద్దిన చిత్రం ఇది.
ఈ మూవీ ను పరిచయం చేసిన R. Samala గారికి ధన్యవాదములు.
అమెజాన్ prime లో ఉందీమూవీ!



