కొన్ని రంగాలను ఏఐ ఎప్పటికీ శాసించలేదంటున్న గేట్స్!

ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ తో కచ్చితంగా ప్రభావమయ్యేది మానవ వనరులే. ఆది నుంచీ జరుగుతున్న చర్చే ఇది. ఏ రంగమైనా ఏఐ చాట్ బాట్స్ వినియోగంతో వండర్స్ సృష్టించే యత్నాలు చేస్తున్న క్రమంలో.. అదే సమయంలో ఉద్యోగాల కోసం మనుషుల అవసరాలు తగ్గిపోతుండటం ఈ మానవ సమాజం ఎదుర్కొనే మరో మహా విషాదం. అయితే ఎంత ఏఐ అయినా దాన్ని ప్రోగ్రామ్ తయారుచేసేదీ మనిషే. కానీ, ఏ ఒక్కడో.. లేక, కొందరి సమూహమో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ తాలూకు పర్యవసానం.. ఎందరి ఉద్యోగాలో హూస్టింగవ్వడమే. ఇలాంటి క్రమంలో ఏఐ రాకపై విభిన్న స్వరాల నుంచి అంతకు భిన్నమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఓసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏమంటున్నాడో తెలుసుకుందాం.

2022లో వచ్చిన ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ప్రారంభించినప్పట్నుంచీ.. కృత్రిమ మేధ మన ఆలోచనల్నీ, మన పని విధానాల్నే మార్చేస్తూ వస్తోంది. ఇదింకా కింది స్థాయి వరకూ అమితంగా చేరుకోకపోవచ్చుగానీ.. కార్పోరేట్ సెక్టార్ లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్టు సాఫ్ట్వేర్ నిపుణులే చెబుతున్న మాట. పైగా ఓపెన్ ఏఐకి పోటీగా గూగుల్ నుంచి జెమినీ, మైక్రోసాఫ్ట్ కు చెందిన కో పైలట్ వంటివి ఇప్పుడు కృత్రిమ మేధతో దూసుకుపోతున్న తరుణంలో… అతి తక్కువ ఖర్చులో చైనా మరింత రెవల్యూషనరీగా డీప్ సీక్ ను తీసుకొచ్చి కొత్త చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో ఈ ఏఐ అనేక రంగాల్లో ఉద్యోగాలకు కత్తెర పెట్టొచ్చని నిపుణుల్లోనూ ఇప్పుడు ఆందోళన నెలకొన్న కాలమిది.

NVIDIA సీఈవో జెన్సెన్ హువాంగ్ తో పాటు, ఓపెన్ ఏఐ సీఈవో స్యామ్ ఆల్ట్ మాన్, సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనియోఫ్ వంటివారు ఈ ఆర్టీఫిషియన్ ఇంటలిజెన్స్ రాకతో.. కోడింగ్ లో నిపుణులైనవారిపై మొట్టమొదటి వేటు పడుతుందని కచ్చితమైన అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో మరిన్ని రంగాలపై పడుతోందనీ ఏకంగా ఈ సీఈవోలే తమ నివేదికల్లో పేర్కొంటున్నారు.

అయితే, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ మాత్రం ప్రపంచంలోని అన్ని రంగాలపై ఏఐ ఆధిపత్యం చెలాయించినా కూడా.. మూడు రంగాల్లో మాత్రం మానవుల పాత్ర అంత్యత కీలకమంటున్నారు. ఆ రంగాల్లో ఏఐని విశ్వసించలేమని.. యాక్యురసీ పర్సెప్షన్ లో అక్కడ మనుషులు మాత్రమే పని చేయగలరని గేట్స్ మూడు రంగాల పేర్లు తెరపైకి తెచ్చారు.

అందులో భాగంగా ప్రముఖ ఏఐ ఆవిష్కర్తల వాదనను కూడా గేట్స్ తప్పుపడుతున్నారు. వారికి భిన్నంగా.. కోడింగ్ లో మానవులదే కీలకపాత్ర అనీ ఆయన చెబుతుండటంతో.. ఈ అధునాతన శాస్త్ర సాంకేతిక రంగంపై చర్చోపచర్చలకు తెరలేస్తోంది.

గమ్మత్తేందంటే, ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్న వ్యక్తులు మాత్రమే తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఎక్కువుందనేది గేట్స్ వాదన. కోడ్‌ను రూపొందించడంలో ఏఐ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ.. సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి అవసరమైన ఖచ్చితత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు మాత్రం ఇప్పటికీ ఏఐకి లేవనేది ఆయన మాట. ఏఐని డీబగ్గింగ్ చేయడానికైనా, మెరుగుపరచడానికైనా, మరింత అభివృద్ధి చేయడానికైనా మ్యాన్ పవరే అల్టిమేటన్నది గేట్ విశ్వాసం.

దీంతో ఏఐ సృష్టికర్తలు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి అభిప్రాయాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండటంతో ఇప్పుడు కోడింగ్ పై ఏఐ ప్రభావమనే అంశంపై పెద్ద చర్చే మొదలైంది.

69 ఏళ్ల గేట్స్ అంచనా ప్రకారం ఏఐ ప్రభావం చూపించని రంగాలను పరిశీలిస్తే.. కోడింగ్ తో పాటు, మరొకటి బయాలోజిస్టుల పాత్రను ఏఐ ఎప్పటికీ పూరించలేదంటాడాయన. వాధి నిర్ధారణ, డీఎన్ఏ విశ్లేషణ వంటి పనులను చేయడానికి ఉపయోగకరమైన సాధనంగా మాత్రమే ఏఐ పనిచేస్తుందే తప్ప.. శాస్త్రీయ ఆవిష్కరణలు చేసేంత సృజనాత్మకత ఏఐ దగ్గర ఉండదని.. అందుకే, అది జీవశాస్త్రవేత్తలను స్థానాన్ని మాత్రం ఎప్పటికీ పూరించలేదంటారు.

అలాగే, ఇంధన నిపుణుల స్థానాన్నీ ఏఐ కచ్చితంగా భర్తీ చేయలేదంటారు గేట్స్. ఇప్పటికే ఆ రంగం పూర్తిగా ఆటోమేటెడ్ గా ఉండటంతో పాటు, చాలా క్లిష్టమైన ఈ రంగంలో మానవ వనరులదే కీలకపాత్ర అవుతుందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చమురు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో వ్యవహరించే విషయంలో ఏఐ సంక్షోభాలను నివారించలేదంటారాయన. నిపుణులైన మానవ వనరులు మాత్రమే నియంత్రణ కల్గి పరిష్కారాలను చూపగలరని, పరిస్థితులకనుగుణంగా వ్యూహరచన చేయగలరంటారు. ప్రస్తుత ప్రపంచం ముందు ఇంధనానికున్న డిమాండ్ దృష్ట్యా ఈ రంగంలో ఏఐ ప్రభావంతో నిపుణులపై వేటు పడే అవకాశాలు తక్కువన్నది గేట్స్ అభిప్రాయం.

రానున్న రోజుల్లో ఓపెన్ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ మరింత శక్తివంతంగా మారే అవకాశాలున్న నేపథ్యంలో.. ఆ సాంకేతిక విజ్ఞానం ఈ మానవ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుందనే ఒకింత ఆందోళనతో పాటు, మరింత క్యూరియాసిటీ కూడా ఇంకోవైపు కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles