20 ఏళ్లు బీఎడ్ సర్టిఫికెట్ కోసం ఓ వ్యక్తి పోరాటం! కారణం లంచం!!

మనదేశంలో సైంటిస్టుల ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం… మేధావుల మేథస్సు మనదేశానికి ఉపయోగపడాలంటే లంచం… అమెరికాలో చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ ఆ దేశానికి అధ్యక్షుడైతే… ఇంకా మనదేశంలో అబ్రహం లింకన్ లు చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి డైలాగ్స్ గుర్తున్నాయిగా…? ఇదిగో ఇప్పటికీ మనదేశంలో వేళ్లూనుకుని… ఇంకా అవే పరిస్థితుల్లో సర్కారీ వ్యవస్థలు మగ్గుతున్నాయనేందుకు మనకెన్నో ఉదాహరణలు నిత్యం రెవెన్యూ, మున్సిపల్, విద్యా, వైద్యం, పోలీస్ ఇలా మొత్తంగా ఏ శాఖకు వెళ్లినా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి స్టోరే మనమిప్పుడు చెప్పుకోబోతోంది. పదిహేడేళ్ల నుంచి తన డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వడానికి… ఆ విశ్వవిద్యాలయ పెద్దలు లంచమిస్తేనేగానీ సర్టిఫికెట్ ఇవ్వమని తేల్చి చెప్పేయడంతో… ఏకంగా ప్రధానికే లేఖ రాశాడా ఆ 40 ఏళ్ల వ్యక్తి. ఏంటా కథా..? అయితే ఢిల్లీకి వెళ్దాం పదండి!

అమిత్ కుమార్ ది ఢిల్లీలోని హైదర్ పూర్. ఆగ్రా విశ్వవిద్యాలయ అఫిలియేటెడ్ గా ఉన్న ఆర్బీఎస్ కళాశాల నుంచి సరిగ్గా తన 23 ఏళ్ల వయస్సులో బీఎడ్ ను పూర్తి చేశాడు అమిత్. 2003లో బీఎడ్ లో చేరిన అమిత్ కు.. ఇప్పటివరకూ కూడా తన బీఈడీ సర్టిఫికెట్ మాత్రం ఆ విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు. కారణం… మనదేశంలో ఇప్పటికీ కరోనా కంటే భయంకరమైన పరిస్థితుల్లో వికటట్టాహాసం చేస్తున్న లంచం. తన బీఎడ్ పూర్తైన్నాట్నుంచి ఇప్పటివరకూ కూడా కుమార్ విశ్వవిద్యాలయానికి వెళ్లి అధికారుల కాళ్లా, వేళ్లా పడుతున్నా… అమ్యామ్యా ముట్టందే సర్టిఫికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో… ఎలాగు తన ఏజ్ బారైపోయింది… ఇప్పుడా ప్రభుత్వోద్యోగాలు చేసే పరిస్థితా లేదు… ఎలాగైనా లంచం ఇవ్వకుండానే సర్టిఫికెట్ సాధించాలని మరింత కసి పెరిగింది అమిత్ కుమార్ లో.

ఆగ్రా విశ్వవిద్యాలయానికి ఛాన్స్ లర్ అయిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ కు లేఖ రాశాడు అమిత్. కానీ లాభం లేకపోయింది. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూ… అంతకుముందున్న ముఖ్యమంత్రులకూ లేఖలు రాశాడు. అయినా ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడేకంగా భారత ప్రధాని నరేంద్రమోడీకే లేఖ రాశాడు అమిత్ కుమార్. తాను లంచమివ్వకుండా తన బీఎడ్ సర్టిఫికెట్ ను మీరేమైనా ఇప్పించగలరా… మీ మీంచవుతుందా అంటూ కాస్తా సెటైరికల్ గానే తన లేఖలో సంధించాడు అమిత్.

గతంలో తన సర్టిఫికెట్ ఇవ్వకపోతే… ఆత్మహత్యకు పాల్పడతానని కూడా విశ్వవిద్యాలయ సిబ్బందిని హెచ్చరించాడట అమిత్. అయినా లాభం లేకపోయింది. బీఎడ్ లో పాసైనా… సర్టిఫికెట్ లేక… విశ్వవిద్యాలయ సిబ్బంది అడిగిన 20 వేల రూపాయల లంచం కట్టడానికి మనస్కరించక.. తన వయస్సే మీరిపోయిందిప్పుడు. దాంతో కేవలం ట్యూషన్స్ చెప్పుకుంటూ బతుకుతున్న అమిత్ కుమార్… ఇప్పటికైనా తన బీఎడ్ సర్టిఫికెట్ తనకిప్పించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశాడు. అయితే 20 ఏళ్ల తర్వాత తన సరిగ్గా 2023లో.. తన 40 ఏళ్ల వయస్సులో అమిత్ కుమార్ బీఈడీ సర్టిఫికెట్ అందుకోవడం ఒకవైపు ఆయన పట్టుదలకు నిదర్శనమైతే.. ఇద్దరు పిల్లల తండ్రైన మధ్య వయస్కుడిగా.. ఏ పోటీ పరీక్షా రాసేందుకు అర్హత లేని వయస్సులో తాను కష్టపడి చదివిన సర్టిఫికెట్ చేతికిరావడం ఈ సమాజంలో కనిపించిన అతి పెద్ద దౌర్భాగ్యం. మరోవైపు లంచావతారాలతో మన వ్వవస్థ ఎంతగా అవ్యవస్థీకృతమైందో చెప్పడానికి కూడా అమిత్ కుమార్ కథ ఇప్పుడో ఉదాహరణ.

చూశారుగా… లంచం మన దగ్గర మాత్రమే ఉన్నదని బాధపడకండి… ఇప్పుడది వ్యవస్థీకృతమైపోయింది. మన జీవన ప్రస్థానంలో లంచమిప్పుడు ఓ భాగం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles