21 శతాబ్దపు సవాళ్లకు సిద్ధం కావల్సిన సమయంలో… ఇంకా 20వ శతాబ్దపు నమూనాల్లో ఎంతకాలం..?
ఈ ప్రశ్న.. ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ ది. ఆయన లేవనెత్తిన ఈ ప్రశ్న… ఇప్పుడు దేశవ్యాప్తంగా మూస చదువుల విధానంపై కొత్త చర్చకు తెరలేపుతోంది.
యూపీఎస్సీ పరీక్షల కోసం.. లేదా, రాష్ట్ర పరిధిలో నిర్వహించే గ్రూప్ పరీక్షల కోసం పాకులాడటాన్ని టైం వేస్ట్ అనేస్తున్నాడు సంజీవ్ సన్యాల్. కృత్రిమ మేథ ఆధారిత వర్తమాన, భవిష్యత్ యుగంలో భారతీయ వృత్తి, విద్యా నైపుణ్యాలెంతవరకు సరిపోతున్నాయనే అంశంపై ఆయన మాటలు ఆలోచింపజేస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పోటీ పరీక్షలతో పాటు, గ్రూప్స్, సివిల్స్, ఐఐటీ జేఈఈ, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ వంటి ఎలైట్ పోటీ పరీక్షలతో పాటు, సంప్రదాయ యూనివర్సిటీ డిగ్రీలపై యువతరం కనబర్చే మోజునే సవాల్ చేసేలా సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలు మథనానికి గురి చేసేవి.
ఈ తరహా చదువులు, పరీక్షలన్నీ కూడా కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకోవడానికి, స్థిరత్వం కోరుకోవడానికి, ఒక హోదాలో బతికేందుకు మాత్రమే. మూసధోరణిలో సాగుతూ… నైపుణ్యాలు, నవోత్తేజాన్ని విస్మరించే పాతతరపు ఆలోచనల ప్రతిబింబాలంటాడు సంజీవ్ సన్యాల్. కృత్రిమ మేథ, ఆటోమేషన్ వంటివి నిరంతర మార్పులతో, కొత్త నిర్వచనాలతో ముందుకొస్తున్న కాలాన… ఇంకా 20వ శతాబ్దపు నమూనాలకు అతుక్కుపోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. ఇది ముమ్మాటికీ 21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించే కార్మికవర్గం తయారు కాకపోవడానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగ భద్రత, స్థిరత్వం కోసం పరుగులు!
యూపీఎస్సీ పరీక్షపై సన్యాల్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రత్యేకంగా యావత్ జాతి దృష్టినీ ఆకర్షించేవి. ప్రతీ ఏటా లక్షలాది మంది అభ్యర్థులు.. కేవలం కొద్దిపాటి సివిల్ సర్వీస్ పోస్టుల కోసం తీవ్రంగా శ్రమిస్తూ పోటీపడుతున్నారు. ఆ ప్రక్రియలో విజయం సాధించే అవకాశం అత్యంత స్వల్పం. నూటికి 99 శాతం కంటే ఎక్కువ మంది విఫలమయ్యేవారే. అలాంటప్పుడు ఒకే ఒక్క పరీక్ష కోసం సంవత్సరాల పాటు సిద్ధమవ్వడం వల్ల నష్టపోయే సమయం, అవకాశ వ్యయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.
అయితే, తన విమర్శలు తపస్సులా ప్రయత్నించే అభ్యర్థులు.. లేదా, సాధించిన సివిల్ సర్వెంట్లనుద్ధేశించినవి ఏమాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు. పదే పదే ప్రయత్నాలు చేస్తూ.. ఫలితం లేకుండా ఏళ్లకేళ్లు గడిపే ప్రొఫెషనల్ యూపీఎస్సీ అభ్యర్థులు యావత్ దేశపు ఉత్పాదక సామర్థ్యాన్నే కట్టిపడేస్తున్నారంటాడు సంజీవ్ సన్యాల్.
స్థిరత్వం కోసం, హోదా కోసం ఇంతటి అనిశ్చిత మార్గాన్ని ఎంచుకోవడమేంటంటూ ఆయన తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు.
ఏఐ ఆధారిత వ్యవస్థలో వెనుకబడుతున్న సంప్రదాయ యూనివర్సిటీలు!
భారతదేశంలోని సంప్రదాయ విశ్వవిద్యాలయాల విధానాలపైన కూడా సన్యాల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉపన్యాసాలపై ఆధారపడిన తరగతులు, కఠినమైన అకడమిక్ నమూనాలు.. ఆధునిక పని వాతావరణానికి ఏమాత్రం సరిపోవన్నది ఆయన అభిప్రాయం.
నైపుణ్యాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అలాగే, నైపుణ్యమున్నవారి కొరతా రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అదే సమయంలో యూనివర్సిటీల సిలబసులు కూడా అంత వేగంగా కాలానుగుణ మార్పులతో నవీకరణకు నోచుకోవడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఇప్పటికే మానవ వ్యవస్థల కంటే మెరుగ్గా పనిచేస్తోంది.
కట్టింగ్- ఎడ్జ్ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ వంటివెన్నో చాలా గొప్పగా పనిచేస్తున్నాయంటున్న సన్యాల్… సమస్య విద్యలో కాదని, ఆ విద్యనూ, నైపుణ్యాభివృద్ధినీ ఎలా నిర్వహిస్తున్నామన్నదానిలోనే ఉందంటున్నారు.
చదువుతో పాటే, అప్రెంటిస్షిప్ అవసరమంటున్న సన్యాల్!
గుణాత్మక విద్యకు వ్యవస్థాత్మక మార్పు అవసరమన్నది సంజీవ్ సన్యాల్ మాట. తొలిదశలోనే పని అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్నది సంజీవ్ సన్యాల్ సూచన. విద్యార్థులు పనిరంగంలోకి అడుగుపెట్టి, ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ లెర్నింగ్ తో పాటు, పని చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందంటున్నారాయన. దీర్ఘకాలిక అకడమిక్ చట్రంలో చిక్కుకోకూడదన్నది సన్యాల్ సూచిస్తున్న నూతన విద్యావిధానం.
గత చరిత్రను చూస్తే కోట్ల మంది జనంలో ఎవరో కొద్ది మంది మాత్రమే ఉన్నత విద్యావంతులు. కానీ, నేటికీ ఏ యూనివర్సిటీలకు వెళ్లకుండా కూడా పెద్ద సంఖ్యలో జనం ఉత్పాదకతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు.
తన కాలేజ్ రోజులను గుర్తు చేసుకుంటూ… విద్యార్థిగా ఉన్నప్పుడు చాలావరకూ తన సమయమంతా వృథా అయిందని బాధపడుతున్నారు సన్యాల్. తొలిదశలోనే పని ప్రారంభించి, అవసరమైనప్పుడు మాడ్యులర్ పద్ధతుల్లో చదివి, సిద్ధమైనప్పుడు పరీక్షలు రాసే విధానముండి ఉంటే.. తాను మరింత సమర్థవంతంగా ఉండేవాణ్నన్నది సన్యాల్ అంచనా.
యూనివర్సిటీలకు పనే లేదని తాను అనడం లేదని.. అయితే, ఇవాళ నేర్పిస్తున్న విద్యావిధానంలో కొనసాగడం మాత్రం ముమ్మాటికీ కాలం వృథా చేయడమేనంటూ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే గతంలో ఆయన 2024, మార్చ్ లోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఆ తర్వాత 2025లో ఓ పాడ్ కాస్టా లోనూ దాన్నే పునరుద్ఘాటించాడు. అవే అభిప్రాయాలను ఈసారీ మళ్లీ కుండబద్ధలు కొట్టాడు. మొత్తంగా యూపీఎస్సీ పరీక్షలకు ఇవాళ యావత్ దేశం ఇస్తున్న ప్రాధాన్యతనే ఆయన ప్రశ్నిస్తుండటంతో కొత్త చర్చ మొదలైంది.
సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలు.. వేగంగా మారుతున్న ఉద్యోగ ప్రపంచానికి భారత విద్యావ్యవస్థ యువతను సంసిద్ధం చేస్తోందా…? లేక, మరింత స్థిరంగా, ఊహించినదిగా గతకాలపు కలలతోనే వారిని ఇంకా బంధీలుగా మారుస్తుందానన్నది ఇప్పుడు సమాధానం లభించాల్సిన ఓ అసౌకర్యమైన ప్రశ్న,,?
అసలు ఈ సంజీవ్ సన్యాల్ ఎవరు..?
సంజీవ్ సన్యాల్ భారతీయ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, రచయిత. కలకత్తాలో జన్మించిన సన్యాల్ ప్రధానమంత్రికి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో మెంబర్. గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఛాన్స్లర్. 1990లోనే సౌత్ అండ్ సౌత్ఈస్ట్ ఏసియాకు చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న విద్యావేత్త.


